రేషన్‌డిపోల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు | vigilance department searches in ration depots | Sakshi
Sakshi News home page

రేషన్‌డిపోల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

Published Wed, Feb 7 2018 1:27 PM | Last Updated on Wed, Feb 7 2018 1:27 PM

విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణంలో రేషన్‌ డిపోల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో మూడు డిపోల్లో తనిఖీలు చేసి లోపాలు గుర్తించారు. డీలర్లపై చర్యలకు పౌరసరఫరాల అధికారులకు సిఫార్సు చేశారు. దీంతో సంబంధిత అధికారులు 6ఏ కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. విజిలెన్స్‌ సీఐలు శ్రీనివాసరావు, కృష్ణ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు వేర్వేరుగా తనిఖీలు చేపట్టారు. సీఐ కృష్ణ నేతృత్వంలో బృందం పట్టణంలో కె.ఎల్‌.పురంలో ఉన్న 70వ నెంబరు డిపోలో తనిఖీలు చేయగా ఆన్‌లైన్‌లో ఈపాస్‌ మిషను లెక్కలకు భౌతిక నిల్వలకు 39క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలరు సూర్యకుమారిని ఆరా తీయగా గోదాం నుంచి ఇంకా రావల్సి ఉందని తెలిపారు. అయితే మొత్తం సరుకు గోదాము నుంచి వచ్చినట్లు ఉండడంతో తేడాగా గుర్తించారు. ఈ మేరకు సరుకు స్వాధీనం చేసుకుని విజయనగరం సీఎస్‌డీటీ రమణరాజుకు అప్పగించారు.

అదేవిధంగా పుచ్చలవీధిలో 23నంబరు డిపోలో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా రికార్డులతో పోల్చిచూస్తే భౌతిక నిల్వ 48క్వింటాళ్లు అధికంగా ఉంది. దీనిపై డీలరు సరస్వతి తరఫున దుకాణం నడుపుతున్న టి.మోహనరావును ఆరా తీయగా సరుకు సోమవారం సాయంత్రం వచ్చిందని, కానీ ఆన్‌లైన్లో గోదాం ఇన్‌ఛార్జి డెలవరీ కొట్టకపోవడం వల్ల ఈపాస్‌ యంత్రం గణాంకాల్లోకి రాలేదని చెప్పారు. అయితే ముందురోజు సాయంత్రం సరుకు వచ్చినా మరుసటి రోజు వరకు నమోదు కాకపోవడంపై అనుమానం వ్యక్తం చేసిన సీఐ కేసు నమోదుకు సీఎస్‌డీటీ రమణరాజుకు సిఫార్సు చేసి సరుకు స్వాధీనం చేసుకుని అప్పగించారు. అదేవిధంగా పట్టణంలో 22వ డిపోలో సీఐ శ్రీనివాసరావు జరిపిన తనిఖీల్లో రికార్డు కంటే 60క్వింటాళ బియ్యం తక్కువగా ఉన్నట్లు తేలింది. భౌతిక నిల్వ తక్కువగా ఉండగా రికార్డులో అధిక సరుకు ఉండడంతో అనుమానించిన సీఐ ఆరా తీశారు.అయితే గోదాం నుంచి సరుకు మొత్తం వచ్చినట్లు డిస్పాచ్‌ కొట్టి సరుకు 60క్వింటాలు తక్కువ ఇచ్చారని తెలిపారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సీఐ పౌరసరఫరాల అధికారులకు సూచించి సరుకు అప్పగించారు. ఈ మేరకు విజయనగరం సీఎస్‌డీటీ రమణరాజు విచారణ చేపట్టారు. మంగళవారం సాయంత్రం మండలస్థాయి నిల్వ కేంద్రానికి వెళ్లి వివరాలు సేకరించారు. బుధవారం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామని సీఎస్‌డీటీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement