అక్కడ తగ్గంది.. ఇక్కడ పెరిగింది
అక్కడ తగ్గంది.. ఇక్కడ పెరిగింది
Published Wed, Jul 27 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
రేషన్ డిపోల్లో ఇకపై కిలో కందిపప్పు రూ.120
రూ.30 పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
వినియోగదారులపై భారీగా భారం
రైతుబజార్లలో కిలో రూ.113లకే ఇకపై విక్రయం
విజయనగరం గంటస్తంభం : కందిపప్పు ఇక పేదోడి ఇంట ఉడకటం కష్టమే. సబ్సిడీ ధరలపై రేషన్ డిపోల ద్వారా అందాల్సిన దీని ధర భారీగా పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకప్పుడు సాధారణ ధరకే లభ్యమైన ఈ పప్పు దశలవారీగా పెంచేస్తూ సామాన్యుడికి అందనంతగా పెంచేశారు. విచిత్రంగా బహిరంగ మార్కెట్లో దీనిని రూ. 120లకే విక్రయిస్తుండగా... జిల్లా అధికారుల చర్చల మేరకు ఇకపై రూ. 113లకే విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే రేషన్‌కంటే బయటి ధరే తక్కువన్నమాట.
మరో భారం
నిత్యవసర సరకుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న పేదలపై ప్రభుత్వం మరో భారం మోపింది. చౌకధరల దుకాణం ద్వారా ఇచ్చే కందిపప్పు ధరను ఒకేసారి కేజీపై రూ. 30లు పెంచింది. విశేషమేమిటంటే బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర తగ్గిన సమయంలో ప్రభుత్వం ధర పెంచడం విశేషం. దీంతో కోటా కందిపప్పు ఇక అక్కరకు రాదనడంలో సందేహం లేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే కందిపప్పు ధర ఏడాది క్రితం కేజీ రూ.50 ఉండేది. బహిరంగ మార్కెట్‌లో కందుల కొరత, ధరల పెరుగుదల నేపధ్యంలో కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని దాన్ని కాస్తా రూ. 90లకు పెంచారు. మళ్లీ తాజాగా రూ.120లకు పెంచారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు పౌరసరఫరాల సంస్థ కార్యాలయానికి బుధవారం వెలువడ్డాయి. ఈ మేరకు డీలర్లు కమీషన్ మినహాయించుకుని కేజీకి రూ.119.50 చెల్లించాలని అధికారులు సూచించారు. డీలర్లు లబ్ధిదారులకు రూ. 120కు విక్రయిస్తారు. ఈ విషయాన్ని పౌరసరఫరాలసంస్థ డీఎం కూడా ధ్రువీకరించారు.
జిల్లా ప్రజలపై రూ.2కోట్లు భారం
ప్రభుత్వం కేజీ కందిపప్పుపై రూ.30లు పెంచడంతో పేదలపై మోయలేని భారం పడనుంది. జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించి 6,67,683 తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులున్నాయి. ఒక్కో కార్డుకు ప్రభుత్వం కేజీ చొప్పున కందిపప్పు సరఫరా చేస్తోంది. ఇంతవరకు రూ. 90లకు లభించే కేజీ పప్పు ఇకపై రూ.120కు కొనుగోలు చేయాలి. పెరిగిన ధర ప్రకారం జిల్లాలో అందరు లబ్ధిదారులపై ఏకంగా రూ. 2కోట్లు భారం పడుతోంది.
రైతుబజార్లలో ఇకపై రూ. 113లకే..
ప్రభుత్వం కందిపప్పు ధర పెంచిన తీరు విడ్డూరంగా ఉంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర ప్రస్తుతం హోల్‌సేల్‌లో కేజీ రూ.125 ఉండగా రిటైల్‌లో రూ.130 వరకు ఉంది. పక్షం రోజుల క్రితం రూ.180 ఉండగా క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఇదిలా ఉండగా స్థానిక వ్యాపారుల సహకారంతో అధికారులు రైతుబజార్లలో కేజీ రూ. 120కు విక్రయిస్తుండేవారు. ఇకపై దాని ధర సైతం జేసీ చర్చల నేపథ్యంలో గురువారం నుంచి కిలో రూ. 113లకే లభ్యం కానుంది. సాధారణంగా బహిరంగ మార్కెట్‌లో ధర అధికంగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం రైతుబజార్లలో తక్కువకు విక్రయిస్తారు. రేషన్‌డిపో(కోటా)లో ఇంతకంటే తక్కువకు విక్రయించాలి. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ. 125 ఉన్న సమయంలో ప్రభుత్వం ధర పెంచడం దారుణం. దీనివల్ల బహిరంగ మార్కెట్‌లో ధర ఇలాగే ఉంటే కోటా కందిపప్పు వల్ల ప్రజలకేమీ ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Advertisement