క్యాష్‌లెస్ ప’రేషాన్’
క్యాష్‌లెస్ ప’రేషాన్’
Published Fri, Feb 3 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీలు
బ్యాంక్ ఖాతాలున్న వారికే సరఫరా
3 మండలాలు, అన్ని పట్టణాల్లో నిలిచిన సరుకుల పంపిణీ
బలవంతపు ప్రయోగాలపై మండిపడుతున్న జనం
జిల్లావ్యాప్తంగా మూతపడిన డిపోలు
కొవ్వూరు :
నగదు రహిత లావాదేవీల జపం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహితాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. జిల్లాలో అన్ని రేషన్ డిపోల్లో క్యాష్‌లెస్ విధానం అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. నేరుగా డబ్బులిస్తే సరుకులు ఇచ్చేది లేదని.. బ్యాంకు ద్వారా చెల్లిస్తేనే పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతుండటంతో పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. నగదు రహితంగా రేషన్ సరుకులు పొందాలంటే కార్డుదారుడికి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదికూడా ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉండాలి. సరుకులు పొందాలంటే కార్డుదారుడి అకౌంట్‌లో కనీసం రూ.100 నగదు ఉండాలి. తెలుపు రంగు రేషన్ కార్డుదారులంతా నిరుపేదలే కావడంతో వారంతా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే అవకాశం లేక నిత్యావసర సరుకుల పొందేందుకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటివరకు నగదు రహితంతోపాటు నగదు తీసుకుని కూడా సరుకులు అందించేవారు. ఈ నెల నుంచి నగదు విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. నగదు రహిత లావాదేవీ ద్వారా మాత్రమే సరుకులు ఇస్తామని అధికారులు భీష్మించడంతో పేదలు అవస్థలు పడుతున్నారు. పేదలపై బలవంతపు ప్రయోగాలు చేయడం విమర్శలు తావిస్తుంది.
25 శాతం కార్డులకే సరుకులు
జిల్లాలో 2,163 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 11,96,775 తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. గత నెల నుంచి నగదు రహిత విధానాన్ని అమలు చేస్తూ.. కొత్త ఈపోస్ మెషిన్లు అందించారు. దెందులూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలతోపాటు 8 పురపాలక సంఘాలు, ఏలూరు నగరంతో కలిపి 759 రేషన్ డీలర్లకు ఎన్‌లాజిక్స్ మెషిన్లు, మిగిలిన 45 మండలాల్లోని 1,401 డిపోలకు విజన్‌టెక్ మెషిన్లు అందించారు. విజన్‌టెక్ మెసిన్లలో క్యాష్‌లెస్ విధానం బాగా పనిచేస్తోంది. గత నెలలో ప్రయోగత్మాకంగా పరిశీలించిన అధికారులు ఈనెల నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఎన్‌లాజిక్స్ మెషిన్లలో నగదు రహిత విధానం పనిచేయడం లేదు. ఈ కారణంగా రేషన్ సరుకుల పంపిణీని దెందులూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలతోపాటు జిల్లాలోని అన్ని పట్టణాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నిలిపివేశారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,18,314 కార్డుదారులకు (25.95 శాతం మందికి)మాత్రమే సరుకులు పంపిణీ చేశారు. జిల్లాలో శుక్రవారం సాయంత్రానికి కేవలం 89,637 మంది కార్డుదారులు మాత్రమే క్యాష్‌లెస్‌ను వినియోగించుకున్నారు. ప్రతినెలా 1నుంచి 5వ తేదీ లోపు సరుకుల పంపిణీ పూర్తి చేసే వారు. నాలుగైదు శాతం మిగిలితే వారికి 15వ తేదీ వరకు అందించేవారు. అటువంటిది ఈనెల 3వ తేదీ నాటికి కేవలం 26 శాతం మాత్రమే సరుకులు పంపిణీ పూర్తయ్యింది. ఎన్‌లాజిక్స్ మెషిన్లలో స్టాఫ్‌వేర్‌ను మార్పుచేసి సరుకులు పంపిణీ చేస్తామని చెబుతున్నా.. ఇది పూర్తికావడానికి చాలారోజులు పట్టే అవకాశం ఉంది.
పేదలను ఇబ్బందులు పెట్టడం సరికాదు
రేషన్ డిపోల్లో సరుకుల పంపిణీని నగదు రహిత లావాదేవీలతో ముడిపెట్టడం సరికాదు. నిరక్షరాస్యులైన పేదలకు క్యాష్‌లెస్ లావాదేవీలపై అవగాహన ఉండదు. ఈ విధానం పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరవాలంటే కష్టం. సరుకులు తెచ్చుకునే సమయానికి ఖాతాలో సొమ్ములు ఉండాల్సి ఉంటుంది. రేషన్ సరుకుల తెచ్చుకోవాలంటే బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్‌లో సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. పరిజ్ఞానం లేని అమాయకులపై పెనుభారం మోపడమే. డబ్బులు తీసుకెళ్లినా సరుకులు అందించాలి. బలవంతపు విధానాలతో ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురిచేసే పద్ధతి మార్చుకోవాలి.
తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే
సరుకులు పంపిణీ ఆపమనలేదు
ఎనలాజిక్స్ ఈపోస్ యంత్రాల్లో సాఫ్ట్‌వేర్ ఆప్‌డేట్ చేయడం వాస్తవం. సరుకులు పంపిణీ ఆపమని ఏవిధమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఏలూరులో సొమ్ములు చెల్లించిన వారికి సరుకులు అందిస్తున్నారు. కొవ్వూరులోను, ఇతర పట్టణాల్లోను రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేసిన విషయమై మాకెలాంటి సమాచారం లేదు.
సయ్యద్ యాసీన్, జిల్లా పౌర సరఫరాశాఖ అధికారి
15వ తేదీ వరకు సరుకులిస్తాం
నగదు రహిత లావాదేవీలను ప్రజలకు అలవాటు చేసే ప్రక్రియలో భాగంగానే ఎన్‌లాజిక్స్ ఈపోస్ యంత్రాలున్న చోట్ల సరుకులు పంపిణీ ఈ రోజు ఆగింది. సాఫ్ట్‌వేర్ ఆప్‌డేట్ చేస్తున్నాం. శనివారం నుంచి వీటిలోనూ యధావిధిగా సరుకులు అందిస్తాం. ఈపోస్ యంత్రాలు వినియోగించుకోని వాళ్లకు నగదు తీసుకుని సరుకులు అందిస్తాం. ఈ విషయంలో అపోహలు పడాల్సిన అవసరం లేదు.
పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్
Advertisement
Advertisement