జడ్జి హత్యకేసు.. ఫేస్‘బుక్క’యిన వైద్యురాలు!
పాటియాలా: ఆమె వైద్యురాలు. ఓ జడ్జి హత్యకేసులో దోషి. దేశం నుంచి పారిపోయేందుకు వ్యూహం పన్నింది. చివరకు ఫేస్బుక్ వల్ల పోలీసులకు చిక్కింది! పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన రవ్దీప్ కౌర్ అనే డాక్టర్ చండీగఢ్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి విజయ్‌సింగ్‌ను 2005లో హత్య చేయించింది. రూ.5 లక్షలు తీసుకుని హత్య చేసిన మంజీత్‌సింగ్‌తో పాటు ఆమెకు కోర్టు 2012లో జీవితఖైదు విధించింది.
అయితే, రెండుసార్లు పెరోల్‌పై బయటికి వచ్చిన కౌర్ పారిపోయేందుకు పక్కా స్కెచ్ వేసుకుంది. రూ. 12 లక్షలకు పైగా నగదు, కిలో బంగారం సిద్ధం చేసుకుంది. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని దేశం విడిచి వెళ్లాలని పథకం వేసింది. మూడోసారి గతేడాది డిసెంబర్ 6న పెరోల్‌పై వచ్చింది. ఇంట్లో సూసైడ్ నోట్ రాసిపెట్టి పరారైంది. అర్పితా జైన్ అనే పేరుతో ఉత్తరాఖండ్, నేపాల్ వెళ్లింది. ఫోన్ వాడకుండా జాగ్రత్తపడింది. పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
అమెరికాలోని ఆమె బంధువు ఫేస్బుక్ ఖాతాపైనా దృష్టిపెట్టారు. దీంతో ఫేస్బుక్లో మారుపేరుతో బంధువుతో సంబంధాలు నెరుపుతున్న ఆమెను గుర్తించారు. నకిలీ పత్రాల కోసం ఉత్తరాఖండ్‌కు వచ్చిన కౌర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. ఇంతకూ జడ్జిని ఎందుకు హత్య చేయించిందంటే... అతడిని ప్రేమించింది. పెళ్లికి నిరాకరించడంతో చంపించింది. ఆ జడ్జికి అదివరకే భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు!