కళ్యాణ్‌రామ్ హీరోగా మరో కామెడీ యాక్షన్
హిట్, ఫ్లాప్‌లతో సంబందం లేకుండా తనకు నచ్చిన సినిమా చేసుకుంటూ పోతున్నాడు నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్. చాలా కాలం తరువాత 'పటాస్' సినిమా హిట్ ట్రాక్‌లోకి వచ్చినట్టుగానే కనిపించినా.. తరువాత రిలీజ్ అయిన 'షేర్' సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. అయితే ముందుగా చెప్పినట్టుగానే సక్సెస్, ఫెయిల్యూర్లను సింపుల్‌గా తీసుకునే కళ్యాణ్ రామ్... మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.
'పటాస్' ఇచ్చిన కిక్ కళ్యాణ్ రామ్ కెరీర్‌పై ఇంకా పనిచేస్తూనే ఉంది. అందుకే సక్సెస్ఫుల్ దర్శకులు, బడా నిర్మాతలు ఈ నందమూరి హీరోతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ హీరోగా 'పిల్లా నువ్వులేని జీవితం' లాంటి హిట్ సినిమాను అందించిన ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో సినిమా మీద ఇప్పటినుంచే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
ప్రస్తుతం ఏఎస్ రవికుమార్‌చౌదరి, గోపిచంద్ హీరోగా 'సౌఖ్యం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా రిలీజ్ తరువాత కళ్యాణ్‌రామ్‌తో చేయబోయే సినిమా పని మొదలు పెట్టనున్నాడు. పటాస్ తరహాలోనే కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.