ravindhra bharathi
-
నీరా ఉత్పత్తులతో వ్యాధి నిరోధక శక్తి
సాక్షి, హైదరాబాద్: నీరా ఉత్పత్తుల వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ పామ్ నీరా, పామ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్, వేద పామ్ ప్రొడక్ట్స్ తయారు చేసిన తాటి బెల్లం, తాటి – ఈత సిరప్‌లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రవీంద్రభారతిలోని ఆయన ఛాంబర్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నీరా పాలసీని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గీత వృత్తిదారుల ఆత్మగౌరవాన్ని పెంచారని అన్నారు. సంప్రదాయ తాటి, ఈత చెట్ల నుంచి తీసిన నీరా ద్వారా సేంద్రియ ఉత్పత్తులైన తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌లను ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆయుర్వేద పద్దతిలో తయారు చేస్తున్నారని స్పష్టంచేశారు. నీరా బై ప్రొడక్ట్స్ ద్వారా మధుమేహం, మూత్రపిండాలలో వచ్చే రాళ్లు తొలగించడంతో పాటు మూత్రసంబంధ వ్యాధులను నివారించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. నీరా ఉత్పత్తుల వల్ల మలబద్దకం, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలుగుతుందన్నారు. తాటి బెల్లం, తాటి– ఈత సిరప్‌లలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయని, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించటంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న నీరా కేంద్రం ఏర్పాటు పనులకు టెండర్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. -
రారండోయ్
రావి రంగారావు సాహిత్య పీఠం జన రంజక కవి పురస్కారాలను ఫిబ్రవరి 10న సా. 6 గం.కు గుంటూరులోని అన్నమయ్య కళావేదికలో ప్రదానం చేస్తారు. గ్రహీతలు: మెట్టా నాగేశ్వరరావు (మనిషొక పద్యం), కరీముల్లా (ఎదురు మతం), మందరపు హైమవతి (నీలి గోరింట), కన్నెగంటి వెంకటయ్య (మమతల హృదయాలు), ఎరుకలపూడి గోపీనాథరావు (భావనా తరంగాలు). సిరికోన – మహాంధ్రభారతి సాహిత్యోత్సవం ఫిబ్రవరి 13న సాయంత్రం 5:30కు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఇందులో బులుసు వేంకటేశ్వర్లు ‘నీలమోహనం’ ఆవిష్కరణ, సిరికోన భారతి వ్యాస సంపుటి (సం. గంగిశెట్టి లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి) ఆవిష్కరణ కానున్నాయి. గంగిశెట్టి స్మారక ఉత్తమ అనువాదక పురస్కారాన్ని డాక్టర్ కోడూరి ప్రభాకర రెడ్డికీ; రుక్మిణమ్మ గంగిశెట్టి స్మారక ఉత్తమ ప్రథమ కవితా సంపుటి పురస్కారాన్ని దేవనపల్లి వీణావాణికీ; చెన్నరాయ కిశోర్ స్మారక తెలుగు తేజో స్ఫూర్తి పురస్కారాన్ని దేశముఖ్ ప్రవీణ్ శర్మకూ ప్రదానం చేయనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో పి.వి.నరసింహారావు ‘లోపలి మనిషి’పై పరాంకుశం వేణుగోపాల స్వామి ప్రసంగిస్తారు. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. భూతపురి సాహిత్య పురస్కారాన్ని గండ్లూరి దత్తాత్రేయ శర్మకు ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడపలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియల్ ట్రస్ట్, అల్లసాని పెద్దన సాహిత్య పీఠం. అనిల్ డ్యానీ కవితా సంపుటి స్పెల్లింగ్ మిస్టేక్ పరిచయ సభ ఫిబ్రవరి 16న సా. 6 గంటలకు సీసీవీఏ, మొఘల్రాజపురం, విజయవాడలో జరగనుంది. అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా గుడిపల్లి నిరంజన్ రాసిన ‘నిట్టాడి’ దీర్ఘ కవిత ఆవిష్కరణ ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు నాగర్‌కర్నూల్, సి.యన్.రెడ్డి సేవాసదన్‌లో జరగనుంది. ఆవిష్కర్త గోరటి వెంకన్న. నిర్వహణ: పూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక, నాగర్‌కర్నూల్. -
వేలికి బ్లూ మార్క్ లేకుంటే..నొసటన బ్లాక్ మార్కే
గన్‌ఫౌండ్రి: ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలని పోలింగ్ రోజున వేలికి బ్లూ ఇంక్ లేకుంటే.. వారంతా తమ నొసటన బ్లాక్‌మార్క్ వేసుకున్నట్లే అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం తమిళిసై ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలన్నా. ఓటర్ల దినోత్సవాన్ని ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల కంటే ప్రజలే పవర్ఫుల్ అన్నారు. అభ్యర్ధుల గుణగణాలను బేరీజు వేసి ఓటు వేయాలని, సరైన వారెవరూ లేరనుకున్నప్పుడు నోటా ఉందంటూ.. అదే ప్రజాస్వామ్యం బ్యూటీ అని అభివర్ణించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా కొంపల్లిలో నిర్వహించిన ఓటర్ ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రశంసించారు. కుల, మత, భాష, ప్రాంతం, వర్గాలకు అతీతంగా ఓటు వేస్తామని సభికులతో గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. అవార్డుల అందజేత... ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ప్రజా స్వామ్య వ్యవస్థ మౌలిక సూత్రమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో పార్లమెంట్, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలను రీపోలింగ్‌కు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్‌అరోరా సందేశం వీడియోక్లిప్ ప్రదర్శించారు. ఎన్నికల ప్రక్రియలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఇతర సిబ్బందికి, వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు రాష్ట్ర స్థాయి అవార్డులను గవర్నర్ అందజేశారు. రెగ్యులర్‌గా ఓటు వేస్తున్న సీనియర్ సిటిజన్లకు, ఓటర్‌గా నమోదు చేసుకున్న యువ ఓటర్లకు కొత్త ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు. అవార్డులకు ఎంపికైన జిల్లా కలెక్టర్లలో ఎంఆర్ఎం.రావు(నిజామాబాద్), ఎం.హనుమంతరావు (సంగారెడ్డి), రోనాల్డ్‌రాస్(మహబూబ్‌నగర్), మస్రత్ ఖానమ్ ఆయేషా (వికారాబాద్), ఖమ్మం పోలీస్ కమిషనర్ తవుఫ్‌సీర్ ఇక్బాల్, వరంగల్ (అర్బన్) కమిషనర్ డా.వి.రవీందర్ తదితరులున్నారు. ఎం.హనుమంతరావు తరఫున ఆ జిల్లా డీఆర్ఓ రాధికా రమణి, రోనాల్డ్ రాస్ తరఫున ఏఓ. ప్రేమ్‌రాజ్, మస్రత్ ఖానమ్ ఆయేషా తరఫున డీటీడీఓ కాటాజి, కరీంనగర్ డీఆర్ఓ పి.ప్రావిణ్య తరఫున మార్కెటింగ్ ఏడీ వి.పద్మావతి, ‘సీఎస్ఓ–లెట్జ్ ఓట్’ నుంచి రాఘవేంద్ర, ఆల్ ఇండియా రేడియో నుంచి డా.రాహుల్ అవార్డులు అందుకున్నారు. -
ప్రతినాయక పాత్రల ‘ప్రతిధ్వండి’
రామాయణం ఆధారంగా ఎన్నోనాటక ప్రదర్శనలు రూపొందాయి.కానీ తొలిసారి రామాయణంలోని ప్రతినాయక పాత్రలతో ‘ప్రతిధ్వండి రామాయణం’ ప్రదర్శించనున్నారు. రామాయణంలోని ప్రతినాయక పాత్రలైన మందర, కైకేయి, శూర్పణక, రావణ, సూత్రధార్ల ఆధారంగా కథక్, కూచిపూడి, మోహినీయాట్టం, భరతనాట్యం శైలుల్లో ఈ నాటక ప్రదర్శనకొనసాగుతుంది. దీపాంజలి స్కూల్‌ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కూచిపూడి, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 6:30గంటలకు రవీంద్రభారతిలోప్రదర్శించనున్న ఈ నాటకవిశేషాలివీ... సాక్షి, సిటీబ్యూరో : ‘ఏడాది క్రితం అంతర్జాతీయ కళాకారిణి గోపికావర్మ నాకు ఫోన్ చేసి రామాయణంలోని ప్రతినాయక పాత్రలు మందర, కైకేయి, çశూర్పనక, రావణ, సూత్రధార్లపై ‘ప్రతిధ్వండి రామాయణం’ పేరుతో నృత్యరూపకం చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. నేను వెంటనే చేద్దామన్నాను. వాల్మీకి, తులసి తదితర రామాయణ గ్రంథాలను పరిశోధించి నృత్యరూపకం రూపొందించామ’ని చెప్పారు ప్రముఖ నృత్యగురువు దీపికారెడ్డి తెలిపారు. ‘దీపికారెడ్డి దీని గురించి నాతో చెప్పగానే ఒప్పేసుకున్నాను. నాకు సూర్పనక పాత్ర కేటాయించార’ని చెప్పారు కేరళకు చెందిన ప్రముఖ నృత్యగురువు దీపికావర్మ. ‘రామాయణంలోని ప్రతినాయక పాత్రల్లో చాలా రసాలు ఉన్నాయి. నేను మందర పాత్రకు సరిపోతానని దీపికారెడ్డి చెప్పగానే సరేనన్నాను’ అని చెప్పారు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఉమా డోగ్రా. రామాయణంలోని ముఖ్యమైన రావణ పాత్రను భరతనాట్య శైలిలో ప్రదర్శిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు ప్రముఖ నృత్యగురువు దీపక్ మజుందార్. ‘దీపికారెడ్డి ఫోన్ చేసి ‘ప్రతిధ్వండి’ గురించి చెప్పారు. అందులో ‘సూత్రధార్’ పాత్రకు నేను సరిపోతానన్నారు. ఇక వెంటనే ఒప్పేసుకున్నాను’ అని చెప్పారు యాంకర్ ఝాన్సీ. ఈ పాత్రలకు అనుగుణంగా స్రిప్ట్ రాయించుకున్న తాము... రిహార్సల్స్ చేసి నాటక ప్రదర్శనకు సిద్ధమయ్యామని కళాకారులు తెలిపారు. -
ముత్యమంతా మురిపెమే!
సాక్షి, సిటీబ్యూరో: ‘కొత్త రాష్ట్రంలో కళల వికాసం.. కళాకారుల అభ్యున్నతే మా ధ్యేయం’.. ప్రభుత్వం తరచూ చెప్పే మాటలివి. తెలంగాణ ప్రభుత్వంలో కళలకు పెద్దపీట వేస్తామని రోజూ ఎక్కడోచోట సీఎం కేసీఆర్ చెబుతునే ఉన్నారు. కానీ సీఎం ప్రకటించిన సాంస్కృతిక చిహ్నల నిర్మాణం ఆచరణలో ఒక్క అడుగు పడలేదు. నగరంలో కళా సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఇలాంటి చోట తెలంగాణ సర్కారు ఏర్పడ్డాక ప్రభుత్వ ముద్రగా చెప్పుకునేందుకు ‘రవీంద్రభారతిని ముత్యపు చిప్ప ఆకృతి’లో నిర్మిస్తామన్నారు. ధర్నాచౌక్‌ను ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతంలో కళాభారతి నిర్మించి తీరుతామని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇంతవరకు వాటికి అతీగతీ లేదు. రవీంద్రభారతి ఆకృతి మారేనా.. భాగ్యనగరానికి ‘సిటీ ఆఫ్ పెరల్స్’(ముత్యాల నగరం)గా పేరు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రవీంద్రభారతిని అద్భుతంగా మారుస్తానని చెప్పారు. భవాన్ని పూర్తిగా ‘ముత్యపు చిప్ప’ ఆకృతిలో నిర్మించాలని, లేకుంటే ప్రస్తుత కట్టడాన్ని అలాగే ఉంచి పై ఆకృతిని మాత్రం ముత్యపు చిప్పలా నిర్మించి తీరాలని సంకల్పించానని చెప్పారు. ఈ ప్రకటన వినగానే కళాభిమానులు, సాహితీ ప్రియులు మురిసిపోయారు. కానీ సీఎం హామీ ఇచ్చి మూడేళ్లు దాటింది. ముత్యపు చిప్ప చిహ్నం స్వప్నంగా మారింది. ఇది సాధ్యం కాదకున్నారేమో.. ముఖ్యమంత్రి రవీంద్రభారతి పునరుద్ధరణ కోసం రూ.3 కోట్లు కేటాయించారు. ‘‘ముత్యపు చిప్ప ఆకృతిలో రవీంద్రభారతి అన్నప్పుడు మళ్లీ పునరుద్ధరణ ఏంటని పలువురు అప్పట్లో విమర్శలకు దిగారు. అయినా రూ.2.7 కోట్లు ఖర్చుతో ఇటీవల రవీంద్రభారతి పునరుద్ధరించారు. ఈ పనులను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహించింది. పనులు పూర్తి చేసి మూడు నెలలు తరగకుండానే రవీంద్రభారతిలోని 42 కుర్చీలు దెబ్బతిన్నాయి. ఈ ఐదేళ్ల పదవీ కాలంలో సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవడం కష్టమని కళాకారులు వాపోతున్నారు’’. కోర్టు చిక్కుల్లో కళాభారతి... సీఎం కేసీఆర్ పేర్కొన్న రెండో సాంస్కృతిక చిహ్నం కళాభారతి. రూ.300 కోట్లతో ధర్నా చౌక్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అద్భుత కళాభారతి నిర్మాణం 14 ఎకరాల్లో చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆరు ఎకరాల్లో భవనాలు నిర్మించి మిగతా అంతా పార్కింగ్‌కు ఉంచుతామన్నారు. సాంస్కృతిక – సాహిత్య ప్రక్రియల అకాడమీలు అందులోనే ఉంటాయన్నారు. 200 నుంచి 3 వేల మంది వరకు వేర్వేరు ఆడిటోరియాలు కళాభారతిలో అంతర్భాగంగా ఉంటాయని తెలిపారు. ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించి కళాభారతి నమూనాను కూడా విడుదల చేశారు. ఇంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ‘‘ఎన్టీఆర్ స్టేడియం స్థలంలో కళాభారతి నిర్మాణం చేపట్ట వద్దని వాకర్స్ క్లబ్ వారు కోర్టు వెళ్లడంతో ఇప్పుడిది చిక్కుల్లో ఇరుక్కుంది. ప్రస్తుత ప్రభుత్వ హయంలో కోర్టు చిక్కులు తొలగే అవకాశం లేదని సాంస్కృతిక శాఖ అధికారులే చెబుతుండడం గమనార్హం. సీఎం కేసీఆర్ హామీలైన ఈ రెండు సాంస్కృతిక చిహ్నల విషయంపై భవిష్యత్తు చర్యలేంటన్న దానిపై భాషా సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారులు నోరు విప్పడం లేదు’’. -
వేషాలు రక్తి కట్టినా భుక్తికి కటకట
రాజానగరం: ఒకప్పుడు పల్లెపట్టులకు పుష్కలంగా వినోదాన్ని పంచిన సామాజికవర్గం.. ఇప్పుడు జీవితాన్ని ఎలా నెట్టుకు రావాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. తమ కళా చాతుర్యంతో గ్రామీణులను ఆనందభరితులను చేసిన వారికి.. ఇప్పుడు కంచంలోకి అన్నం తెచ్చుకోవడమెలాగో తెలియడం లేదు. ముఖానికి పులుముకున్న రంగులతో, ఊరి వీధుల్లో నడయాడే హరివిల్లుల్లా కనిపించిన వారి బతుకు.. ఇప్పుడు వన్నెలు వెలిసిపోయిన చిత్రంలా వెలవెలబోతోంది. ‘ఉదర పోషణార్థం బహూకృత వేషం’ అన్నది నానుడి. ఇప్పుడు ఏ వేషం వేసినా కడుపు నింపుకోవడానికి కటకటలాడే దుస్థితి పగటి వేషగాళ్లది. రాష్ట్రంలో బుడగ జంగాలకు వృత్తిపరంగా ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించక కుటుంబ పోషణ కోసం నానా అవస్థలు పడుతున్నారు. బుడబుక్కలోళ్లుగా పిలువబడే వీరు బుర్రకథలు, తంబురా కథలు చెపుతూ, దసరా, సంక్రాంతి, దీపావళి వంటి పండుగ సమయాల్లో పగటి వేషాలు వేస్తూ జీవనోపాధిని పొందుతుంటారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్థనారీశ్వరుడు, భీముడు, ఆంజనేయుడు, శక్తి వంటి వేషాలు వేస్తుంటారు. మిగిలిన సమయాల్లో ఆలయాల్లో భజనలకు వెళ్తుంటారు. ఇప్పుడూ ఆ వేషాలు వేసి రక్తి కట్టిస్తున్నా.. భుక్తిని సంపాదించుకోవడమే కష్టతరమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అరచేతిలోని స్మార్ట్ఫోనే వినోదాల సునామీకి వేదికగా మారింది. వీధి నాటకాలు కనుమరుగైపోయే పరిణామమే కాదు.. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే రోజులే గత కాలపు ముచ్చటయ్యే పరిస్థితి పొంచి ఉన్న రోజులివి. ఇక పగటి వేషాల దుర్గతి చెప్పేదేముంది! అయితే తాత ముత్తాతల నుంచి వస్తున్న వృత్తిని వదులుకోలేక, కాలం తెచ్చిపెట్టే మార్పులకు తగ్గట్టు మారలేక నలిగిపోతూనే.. కాలం నెట్టుకొస్తున్నామంటున్నారు బుడగజంగాల పెద్దలు. అయితే ఈ కళ తమతోనే ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయని, తరువాత తరాలు ఈ వృత్తిని కొనసాగించడానికి ఇష్టపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో పగటి వేషాలు వేస్తూ సంచరిస్తున్న వీరు పలకరించిన ‘సాక్షి’తో తమ మనోగతాన్ని, మనోవేదనను పంచుకున్నారు. తమది ప్రాచీన కళ అని, పూర్వం రాజులు పోషించేవారని, ఆ తరువాత తమ తండ్రుల వరకు జమీందార్లు, భూస్వాములు, పెద్దలు సహకరించారన్నారు. ప్రస్తుత కాలంలో ఈ కళలను పోషించేవారు లేరన్నారు. నేటి తరం వారికి తమ ప్రత్యేకత గురించి తెలియడం లేదని, చెప్పినా అర్థం చేసుకునే తీరుబడి వారికి ఉండటం లేదని నిట్టూర్చారు. యువతరం విముఖత తమ పిల్లలు చదువుకుంటూ తమలా పగటి వేషాలు వేసేందుకు ఇష్టం చూపడం లేదన్నారు. ఇంటర్, 10వ తరగతి చదువుతున్న తన ఇద్దరు పిల్లలు అప్పుడప్పుడూ వారి విద్యాసంస్థల్లో కార్యక్రమాలు జరిగితే ప్రదర్శనలు ఇస్తుంటారని, బయటకు వచ్చి వేషాలు వేయడానికి ఆసక్తి చూపడం లేదని ఓ కళాకారుడు చెప్పారు. వారిలో కూడా కళాభిమానం ఉన్నా స్టేజ్ ప్రోగ్రామ్‌ల వరకే ఆసక్తిని చూపిస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం అంతంత మాత్రమే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాజధాని హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రోగ్రామ్‌లు చేయడానికి అవకాశం ఉండేది. విభజన తరువాత మన రాష్ట్రంలో ఆ విధమైన ప్రోత్సాహం లేదు. తెలంగాణాలో మనల్ని అడుగుపెట్టనివ్వడం లేదు. అక్కడ రవీంద్రభారతిలో తరచు ప్రోగ్రామ్‌లు జరిగేవి. ఇప్పుడు తెలంగాణా వారే చేస్తుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం చేయడానికి మాత్రం ఏడాదిలో ఒకటి రెండు అవకాశాలు ప్రభుత్వపరంగా లభిస్తున్నాయి. సమాచారశాఖ, పర్యాటకశాఖ, డీఆర్‌డీఏల నుంచి ఈ విధమైన కార్యక్రమాలు ఎక్కువగా...ఏజెన్సీ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా, జ్వరాలు, మూఢనమ్మకాల వంటి వాటి పైన, కాలుష్యాలు, కరెంటు కోతలు, స్వచ్ఛభారత్ మొదలైన కార్యక్రమాల పైన ఉంటాయి. అంతేతప్ప కళాకారుల అభ్యున్నతికి, కళల ఆదరణకు ప్రభుత్వపరంగా ఎటువంటి ప్రోత్సాహం ఉండటం లేదు. –మిరియాల ప్రసాద్, శాటిలైట్ సిటీ, రాజమహేంద్రవరం రాష్ట్ర విభజనతో నష్టపోతున్నాం.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పర్యాటక శాఖ ద్వారా మన రాష్ట్రంలోనే కాక కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సాలకు తీసుకువెళ్లడం, అక్కడి వారిని ఇక్కడకు తీసుకురావడం జరుగుతుండేది. అలాగే అండమాన్ కూడా తీసుకువెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ విధంగా శ్రద్ధ తీసుకునే పాలకులు లేరు. మేము యక్షగానం ప్రదర్శన కూడా ఇస్తుంటాం. టీవీలలో బుర్రకథ, హరికథ, పగటి వేషాలు, జానపద గీతాలు చేస్తుంటాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రవీంద్రభారతిలో ఏడాదికి ఐదారు ప్రదర్శనలకు అవకాశం ఉండేది. విడిపోయిన తరువాత హైదరాబాద్ అంతా తెలంగాణా వారికే పరిమితం అయిపోయింది. –మిరియాల గంగాధర్, శాటిలైట్‌సిటీ, రాజమహేంద్రవరం -
రవీంద్ర భారతిలో పీవీ స్మారక ఉపన్యాసం
-
కన్నెగంటి పోరాటం
-
తిమిరంతో సమరం.. దాశరథి కవిత్వం
-
తెలుగు సినిమాకు దిశా నిర్దేశం చేసిన అక్కినేని
నాంపల్లి, న్యూస్‌లైన్: చలనచిత్రరంగాన్ని గౌరవప్రదంగా మార్చిన ఘనత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకే దక్కుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి రవీంద్రభారతి ప్రధాన వేదికపై ఆకృతి ఆధ్వర్యంలో నవీన్ సుభాష్‌రెడ్డి సారధ్యంలో ‘వంద ఏళ్ల సినిమాకు సంగీత వందనం... అక్కినేని అమరస్మృతికి అంకితం’ పేరిట సినీ సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈసభ ఎంతో విశిష్టమైందని తెలిపారు. మహోన్నతమైనవ్యక్తి కాలం చేస్తే సంతాప సభలు జరుపుకుంటారని.. కాలం చేసి ప్రజల హృదయాల్లో నిలిచినవ్యక్తి పేరిట ఉత్సవ సభను జరుపుకుంటారని వెల్లడించారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగే అంకితం సభ ఉత్సవం లాంటిదని పేర్కొన్నారు. వందేళ్లు బ్రతుకుతానని ఉత్సాహంగా ఉండేవారు.. ఉన్నట్లుండి వెళ్లిపోవడం ఎంతో బాధాకరమన్నారు. తెలుగు సినిమాకు దిశా -నిర్దేశం చేసిన వ్యక్తి అక్కినేని అని అభివర్ణించారు. దేవదాసు చిత్రం ఎన్నోభాషల్లో వచ్చిందని, ఆ సినిమాకు అక్కినేనే తలమానికం కావడం ఆయన చేసుకున్న అదృష్టమన్నారు. గాయని రావు బాలసరస్వతి మాట్లాడుతూ అక్కినేని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను పాటలు పాడేందుకు కారణం అక్కినేనే అని గుర్తుచేసుకున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ కష్టపడిపైకి వచ్చే వారికి అక్కినేని స్ఫూర్తి దాయకమన్నారు. భాషా కార్యక్రమాల కోసం ఏది తలపెట్టినా సహకరిస్తానన్న వ్యక్తి కళ్లముందు లేకుండా పోవడం విచారకరమన్నారు. అనంతరం సినీ గాయనీగాయకులు ఆలపించిన సంగీత విభావరి అలరింపజేసింది. -
ప్రసంగాలు వద్దు.. పనిచేయండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘సభలు, సమావేశాలల్లో రాజకీయ నాయకులు మాటల గారడి చేస్తరు.. ఏకదాటిగా మాట్లాడుతూ.. ఏవేవో చెప్పి మిమ్మల్ని పరేషాన్ చేస్తరు.. ఈ రోజు ఇక్కడ చూస్తుంటే రాజకీయ నాయకుల స్థాయిలో ఉద్యోగ సంఘాల నేతలూ మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆకాంక్ష నేరవేరబోతోంది. ఇక ఉద్యోగులు ప్రసంగాలు కాకుండా ఎక్కువ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో మీదే కీలక పాత్ర’అని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ ఉద్యోగులకు హితబోధ చేశారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుడి ప్రార్థన, పెద్దలను గౌరవించడం, కమిట్మెంట్తో పనిచేయడం నా సిద్ధాంతాలని, వాటిని పాటించి ఇంతటి వాడినయ్యానని అన్నారు. ఉద్యోగులు కూడా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని, జిల్లాలో పనిచేస్తున్న పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్‌లో టీఎన్జీఓ భవన నిర్మాణానికి రూ.రెండు లక్షలు ఇచ్చానని, మరో రూ.మూడు లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇంటి స్థలాలకు ప్రతిపాదనలివ్వండి: కలెక్టర్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలిచ్చేందుకు తనవంతు సహకారం అందిస్తానని కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపాదనలు తయారుచేసి ఇస్తే ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. జిల్లాకున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పనిచేయడం కొంత కష్టమేనన్నారు. కొత్త నియామకాలు లేనందున బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగులకు పరిమితిలేని ఆరోగ్య కార్డులివ్వాలని, ఇటీవల విడుదలచేసిన హెల్త్‌కార్డుల జీఓల్లో సవరణలు అవసరమని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బహుళ జాతి కంపెనీలకు వందల ఎకరాలు కట్టబెట్టిన ప్రభుత్వం ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపడంలేదని టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి అన్నారు. పాలన వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలులో జిల్లాలోని ఉద్యోగులంతా అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సమావేశం ప్రారంభంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.రామ్మోహన్ తెలంగాణ ఉద్యమం, ఉద్యోగుల సమస్యలపై జిల్లా ఉద్యోగుల కృషిని వివరిస్తూ నివేదికను చదివి వినిపించారు. ఉద్యమ సమయంలో బస్సు దగ్ధమైన ఘటనలో మృతిచెందిన బాధిత కుటుం బానికి రూ.10వేల చెక్కును మంత్రి అందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, టీజీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి వివిధ సంఘాల నేతలు నరసింహారావు, రాజ్‌కుమార్, జేఏసీ జిల్లా కోకన్వీనర్ మహ్మద్‌గౌస్ తదితరులు పాల్గొన్నారు.