ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్
సాక్షి, అమరావతి/తిరుపతి క్రైం: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోన్న ఎస్ఎం రఫీ రూ.9 వేలు లంచం తీసుకుంటూ శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డాడు. తిరుపతిలోని శ్రీపురం కాలనీలో నివాసముంటున్న రవీంద్రనాథ్ రెడ్డి వద్ద టి.నరసింహ అనే వ్యక్తి ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. ఇంటి పన్నులు నరసింహ పేరుతో రాకపోవడంతో గత నెల 23న 6 వార్డు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఫీని నరసింహ కలిశాడు. ఇంటి పన్ను కాగితాలపై పేరు మార్చేందుకు గాను రూ.10 వేలు లంచం ఇవ్వాలని రఫీ డిమాండ్ చేశాడు.
చివరకు రూ.9 వేలకు బేరం కుదిరింది. అనంతరం నరసింహ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం తిరుపతిలోని ఓ బట్టల దుకాణం వద్దకు డబ్బులు తీసుకొని రమ్మని నరసింహకు రఫీ చెప్పాడు. అక్కడ నరసింహ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రఫీని అరెస్ట్ చేశారు. నిందితుడిని నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం
శనివారం ఒక ప్రకటనలో విడుదల చేసింది.