'బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తాం'
హైదరాబాద్ : పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై టీడీపీ నేతలు బహిరంగ చర్చకు వస్తే నిజనిజాలను నిరూపించడానికి తాను సిద్ధమని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ చర్చల వివాదం రోజురోజుకు ముదురుతోంది. మంత్రి జూపల్లి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ ల మధ్య వివాదం కొనసాగుతోంది. రావుల కోసం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మంత్రి జూపల్లి రెండు గంటల పాటు ఎదురుచూశారు.
బహిరంగ చర్చకు రాలేక టీడీపీ నేతలు తోక ముడిచారంటూ జూపల్లి విమర్శలు గుప్పించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతతల పథకం ఆపాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడం వాస్తవమని ఆయన ఆరోపించారు. బాబు హయాంలో పాలమూరులోని 4 ప్రాజెక్టులకు రూ.10 కోట్లకు మించి ఖర్చుపెట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కలిసిరాని ఆ పార్టీ నేతలు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో కూడా అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. బహిరంగ చర్చకు రానిపక్షంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం లేదని చంద్రబాబుతో లేఖ రాయించాలని టీటీడీపీ నేతలను జూపల్లి డిమాండ్ చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్నారు.