rayalaseema drought
-
కరువు సీమను సస్యశ్యామలం చేస్తాం
డోన్(నంద్యాల జిల్లా): కరువు సీమను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినమైన ఆదివారం, సోమవారం రెండురోజుల పాటు మంత్రి బుగ్గన నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్ మండలాల పరిధిలోని 12 చెరువులను సందర్శించి హంద్రీనీవా కాల్వ నీటితో చెరువులను నింపే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రెడ్డి రాజశేఖర్, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు ఆధ్వర్యంలో చనుగొండ్ల గ్రామంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సందర్భంగా హంద్రీనీవా నీటితో డోన్, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోని 68 చెరువులను నింపుతామని హామీ ఇచ్చారని, ఆ మేరకు మొదటి దశ కింద రూ.360 కోట్లతో వచ్చే జూన్ నాటికి సాగునీరు అందిస్తామన్నారు. క్రిష్ణగిరి మండలం పులిచెర్ల కొండపై డెలివరీ చాంబర్‌తో పాటు లక్కసాగరం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్.. అన్ని చెరువులకు నీటిని మళ్లింపు చేసే కార్యక్రమం పైపులైన్ పనులు 100 శాతం పూర్తయ్యాయన్నారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారు కాగానే చెరువులకు నీటిని మళ్లించే కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఆయన మండలంలోని దేవరబండ, చనుగొండ్ల, యాపదిన్నె, మల్లెంపల్లె, వెంకటాపురం, ఉడుములపాడు, జగదుర్తి, ఎల్లారెడ్డి చెరువుల వద్ద ఆయా గ్రామ ప్రజలతో కలిసి మంత్రి బుగ్గన నీటి మళ్లింపు కార్యక్రమానికి భూమిపూజ చేశారు. ఖరీఫ్ నాటికి 10వేల ఎకరాలకు సాగునీరు ప్యాపిలి: వచ్చే ఖరీఫ్ నాటికి డోన్ నియోజకవర్గంలో 10వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మెట్టుపల్లి, ఏనుగుమర్రి, ప్యాపిలి, పెద్దపొదిళ్ల చెరువులను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రైతులనుద్దేశించి మాట్లాడారు. వర్షాధారం మీద మాత్రమే ఆధారడిన డోన్ నియోజకర్గం రైతులకు చెరువులు నింపే కార్యక్రమం ఓ వరం అన్నారు. బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఏడాదికి రెండు నుంచి మూడు పంటలు తీసే అవకాశం లభిస్తుందన్నారు. -
పనులు పరుగులు
సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా జిల్లాలో ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, గండికోట–సీబీఆర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్ విస్తరణ, అలవలపాడు లిఫ్ట్ స్కీమ్, జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్, జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ విస్తరణ పథకాలను చేపట్టింది. సుమారు రూ. 10,816 కోట్లతో పనులు చేపట్టగా గత మార్చిలో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవలే అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ పనులు మొదలయ్యాయి. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మలు భూసేకరణ పనులను పర్యవేక్షిస్తుండగా జీఎన్ఎస్ఎస్ అధికారులు పనులను వేగవంతం చేశారు. ఈ పనులు పూర్తయితే వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 4.34 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అందులో 4,04,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కాగా, మరో 30 వేల ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకి వస్తుంది. 12 లక్షల మందికి తాగునీరు అందనుంది. మొత్తంగా రెండు జిల్లాల్లో సాగు, తాగునీటి కష్టాలు తీరినట్లే. పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు రూ. 1256 కోట్లతో పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. సీకేఎల్ఐ, పీబీసీ, సీబీఆర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుండి నీటిని పంప్ చేసి ప్రత్యేకంగా నిర్మించే సంపులు, పైపులైన్ల ద్వారా ఆయకట్టుకు మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటిని అందించనున్నారు. సంపులు, పైపులైన్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. 1,22,480 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం లక్ష్యం. అలవలపాడు లిఫ్ట్ స్కీమ్ రూ. 56 కోట్లతో అలవలపాడు లిఫ్ట్ స్కీమ్ పనులను ప్రభుత్వం చేపట్టింది. పీబీసీ పరిధిలో 50వ కిలోమీటరు తర్వాత టెయిలెండ్ పరిధిలోని 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం లక్ష్యం. జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ నుండి 1.5 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అలవలపాడు ట్యాంకు, పెండ్లూరు ట్యాంకు, పీబీసీ 50వ కిలోమీటరు చివరి ఆయకట్టుకు నీటిని తరలించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి కావచ్చు. ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సీబీఆర్ నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించి 15 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది లక్ష్యం. ప్రాజెక్టుల నీరు అందించలేని కొండ ప్రాంతాలకు లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించి పైపుల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. సీబీఆర్‌కు 110 మీటర్ల పైభాగంలో (ఎత్తున) ఉన్న ప్రాంతాలలోని ఆయకట్టుకు పైపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి సాగునీటిని అందించనున్నారు. దీంతోపాటు లింగాల మండలంలో ఎగువపల్లి, దిగువపల్లి, మురారిచింతల, అంబకంపల్లె, ఎర్రబల్లి, గిడ్డంగివారిపల్లె తదితర ఎనిమిది చెరువులను నీటితో నింపనున్నారు. గిడ్డంగివారిపల్లె చెరువులో 1.2 టీఎంసీల నీటిని నింపి యురేనియం ప్రభావిత ఏడు గ్రామాల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు అక్కడి ప్రజలకు తాగునీటిని అందించనున్నారు. ఈ లెక్కన మొత్తం 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ. 1113 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. భూ సేకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గండికోట–సీబీఆర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్ పనుల విస్తరణ గండికోట నుండి సీబీఆర్‌కు రెండు వేల క్యూసెక్కులు, పైడిపాలెంకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని తరలించాలన్నది ఉద్దేశం. పైడిపాలెం ఆరు టీఎంసీల సామర్థ్యం కాగా, సీబీఆర్ 10 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. మొత్తం 16 టీఎంసీల నీటిని ప్రస్తుతం ఉన్న సామర్థ్యం మేరకు 70 రోజుల్లో నింపాల్సి వస్తోంది. దీనిని 35 రోజులకు తగ్గించేందుకు ఈ కొత్త లిఫ్ట్ స్కీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా జీకేఎల్ఐ, సీబీఆర్, పీబీసీల పరిధిలో మొత్తం 1,63,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. ఇందులో మైక్రో ఇరిగేషన్ ద్వారా 1,22,480 ఎకరాలకు నీటిని అందించనున్నారు. రూ. 3050 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. ప్రస్తుతం కొండాపురం మండల పరి«ధిలోని లావనూరు వద్ద టన్నెల్ పనులు జరుగుతున్నాయి. 2023 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ రూ. 5036 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా వైఎస్సార్ జిల్లాలోని చక్రాయపేటతోపాటు అన్నమయ్య జిల్లాలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె, వీరబల్లి ప్రాంతాల్లోని 133 చెరువులను నీటితో నింపనున్నారు. వైఎస్సార్ జిల్లా పరిధిలో 91 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జీఎన్ఎస్ఎస్ 56వ కిలోమీటరు నుంచి నీటిని లిఫ్ట్ చేసి తరలించనున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని తంబళ్లపల్లె, పుంగనూరు, మదనపల్లె, పీలేరులో రెండు లక్షల ఎకరాల హెచ్ఎన్ఎస్ఎస్ ఆయకట్టుకు సాగునీరు అందనుంది. వైఎస్సార్ జిల్లా పరిధిలో రెండు లక్షల మందికి, అన్నమయ్య, చిత్తూరు జిల్లా పరిధిలో 10 లక్షల మందికి మొత్తం 12 లక్షల మందికి తాగునీటిని అందించనున్నారు. దీని పరిధిలో భూ సేకరణ పనులు, భూ సేకరణ గుర్తింపు పనులు, డిజైన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాయలసీమ కరువు నివారణ పనులు వేగవంతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 4,34,000 ఎకరాలకు సాగునీరు, 12 లక్షల మందికి తాగునీరు అందుతుంది. అప్ల్యాండ్ ఏరియాల్లోని భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. – మల్లికార్జునరెడ్డి, ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్, కడప 8 జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ విస్తరణ రూ. 305 కోట్లతో గండికోట జీరో కిలోమీటరు నుంచి 56వ కిలోమీటరు వరకు జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్‌ను విస్తరించడంతోపాటు లైనింగ్ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి. ఈ మొత్తం ఆరు ప్రాజెక్టుల పరిధిలో 2500 ఎకరాల భూమిని సేక రించాల్సి ఉండగా, భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రతి మంగళవారం కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ, జీఎన్ఎస్ఎస్ ఎస్ఈ మల్లికార్జునరెడ్డిలు పనులను పర్యవేక్షిస్తున్నారు. -
రాయలసీమ కరువు నివారణకు ప్రపంచ బ్యాంకు సాయం
సాక్షి, అమరావతి: కరువుకు నెలవుగా మారిన రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక అమలుకు ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను(పీపీఆర్) తయారుచేసి.. పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రూ.33,869 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పీపీఆర్‌ను ప్రపంచ బ్యాంకుకు పంపేందుకు జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రణాళిక అమలుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. ఈ నిధులతో కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా... కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచే పనులను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల సమీకరణకు స్పెషల్ పర్పస్ వెహికల్ కృష్ణా, గోదావరి, వంశధార తదితర నదుల వరద జలాలను ఒడిసిపట్టి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధుల సమీకరణకు స్పెషల్ పర్పస్ వెహికల్‌ను(ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు సేకరించి, పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. దాంతో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సంప్రదింపులు జరుపుతున్నారు. విధానాలు మార్చుకున్న ప్రపంచ బ్యాంకు కొత్తగా చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ.. ఆధునీకరణ.. నీటి యాజమాన్య పద్ధతుల అమలు వంటి పనులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తోంది. కానీ, ప్రభుత్వ వినతి మేరకు ప్రపంచ బ్యాంక్ తన విధానాలను మార్చుకోవడానికి అంగీకారం తెలిపింది. రాయలసీమ కరవు నివారణ ప్రణాళిక అమలుకు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. బ్యాంకు సూచనల మేరకు.. కరువు నివారణ ప్రణాళిక అమలుకు రూ.33,869 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన పీపీఆర్‌ను రాష్ట్ర జలవనరుల శాఖ పంపనుంది. ఆ ప్రణాళికపై బ్యాంకు ఆమోదముద్ర వేస్తే.. దాని అమలుకు అయ్యే వ్యయంలో ఎంత వాటాను రుణం రూపంలో ఇచ్చే ఆంశాన్ని స్పష్టం చేస్తుంది. బ్యాంకు వాటాగా ఇచ్చే రుణానికి.. ప్రభుత్వ వాటాను జత చేసి కరువు నివారణ ప్రణాళికను అమలు చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. -
రాయలసీమలో కరువు విలయతాండవం
సాక్షి, హైదరాబాద్: రాయలసీమలో రెండు, మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయని, కరువు విలయతాండవం చేస్తోందని, ప్రజల పరిస్థితి దారుణంగా మారిందని మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ వడ్డమాను శివరామకృష్ణారావు, డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. వారు బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ దుర్భిక్ష పరిస్థితులు, నీటి వనరుల కేటాయింపులపై ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేర్వేరుగా రాసిన లేఖలను విడుదల చేశారు. కరువు వల్ల పంటల నష్టం జరిగినా బాధిత రైతాంగానికి వ్యవసాయ బీమా సౌకర్యం లభించలేదని బాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. -
'మోదీ సర్వేలో చంద్రబాబుకు 8వ స్థానం'
కడప(వైఎస్సార్ జిల్లా): అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీ చేయించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఎనిమిదో స్థానం వచ్చిందని శాసనమండలి ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు తన చుట్టూ ఒక రకమైన ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో ప్రజలను బతకముంటున్నారని విమర్శించారు. రాయలసీమ కరువుతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. కరువుపై తాను చేయించిన సర్వేను తానే నమ్మలేని పరిస్థితిలో ఆయన ఉన్నారని అన్నారు.