జలం.. జులుం!
తుంగభద్రకు సంకెళ్లు!
- నీటి కేటాయింపుల్లో ఏటా వివక్ష
- 32.5 టీఎంసీల్లో వచ్చేది 22 టీఎంసీలే
- కేసీ వాటాలోనూ భారీగా కోత
- తాగు, సాగునీటి కష్టాలతో ఉక్కిరిబిక్కిరి
- ఈ ఏడాది డ్యాంలో కనీసస్థాయి నీటి నిల్వలు
- ఆందోళనలో సీమ రైతాంగం
సాక్షిప్రతినిధి, అనంతపురం: తుంగభద్ర జలాల కేటాయింపులో రాయలసీమకు ఏటా అన్యాయం జరుగుతోంది. కేటాయింపులకు భిన్నంగా నీటి విడుదల తగ్గిపోతోంది. వదిలిన నీటిని కూడా కర్ణాటక రైతులు జల చౌర్యానికి పాల్పడుతుండటంతో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి రైతుల మధ్య గొడవకు కారణమవుతోంది. హెచ్ఎల్సీ కాలువకు 32.5 టీఎంసీల నికర జలాలను తుంగభద్ర బోర్డు కేటాయించింది. ఈ నీటిపై ఆధారపడి ‘సీమ’లోని అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో 2.84లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది.
అయితే టీబీ బోర్డు మాత్రం 32.5 టీఎంసీలలో ఏటా సగటున 22 టీఎంసీలు మాత్రమే కేటాయిస్తోంది. ఈ మేరకు కూడా అధికారులు నీటిని అందించలేకపోతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేసీ కెనాల్‌కు దక్కాల్సిన 10 టీఎంసీల నీటిని హెచ్ఎల్సీ ద్వారా మళ్లించేందుకు జీఓ జారీ చేశారు. అంటే.. హెచ్ఎల్సీ ద్వారా మొత్తం 42.5 టీఎంసీల నీళ్లు సీమకు దక్కాల్సి ఉంది. కేసీ కెనాల్ వాటాలో కూడా ఏటా 4 టీఎంసీలు మాత్రమే బోర్డు విడుదల చేస్తోంది. దీంతో 10.5 టీఎంసీలు హెచ్ఎల్సీ కోటా, 6 టీఎంసీలు కేసీ కెనాల్ కోటాను సీమ కోల్పోతోంది.
అటు జల చౌర్యం.. ఇటు సర్కారు నిర్లక్ష్యం
హెచ్ఎల్సీకి సగటున 22 టీఎంసీలు.. కేసీ కెనాల్ కోటాలో మరో 4 టీఎంసీలు కలిపి ఏటా సగటున 26 టీఎంసీలు కేటాయిస్తున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి ఏపీ సరిహద్దు వరకు 105 కిలోమీటర్ల మేర కాలువ కర్ణాటకలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు ఏటా జలచౌర్యానికి పాల్పడుతున్నారు. 105 కిలోమీటర్ల మేర కాలువలోకి పైపులు వేసుకుని మోటార్ల ద్వారా నీటిని సమీప పొలాలకు వినియోగించుకుంటున్నారు. ఈ కారణంగా 105 కిలోమీటర్ వచ్చేలోపు నీటి ప్రవాహం మందగిస్తోంది. హెచ్ఎల్సీ నుంచి ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కర్నూలుకు, పీబీసీ(పులివెందుల బ్రాంచ్ కెనాల్), మైలవరం బ్రాంచ్ కెనాల్ ద్వారా వైఎస్సార్ జిల్లాకు తుంగభద్ర జలాలు చేరాలి. విడుదల చేసిన జలాలు కాలువ చివరి ఆయకట్టు వరకూ వెళ్లడం లేదు. దీంతో తమ వాటా జలాలు దక్కడం లేని ఈ రెండు జిల్లాల రైతులు ఏటా ఆందోళనలు చేపడుతున్నారు.
ఆరేళ్లుగా పీబీసీ ఆయకట్టుకు చుక్కనీరు లేదు
పీబీసీకి 4.4 టీఎంసీల నీరు అందాలి. దీని కింద 55వేల ఎకరాలకు నీళ్లు అందివ్వాలి. అయితే డ్యాంలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందనే కారణంతో ఏటా సగటున 1.9 టీఎంసీలు కేటాయిస్తున్నారు. ఈ నీళ్లన్నీ తాగునీటికే సరిపోతున్నాయి. దీంతో పులివెందుల ప్రాంతంలో పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చీనీ, అరటిసాగు చేస్తున్న రైతులు ఏటా పీబీసీ నీరు వస్తుందని ఆశపడటం, నీరు రాకపోవడంతో చెట్లను బతికించుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసుకోవడం ఆనవాయితీగా మారింది. మైలవరం బ్రాంచ్ కెనాల్‌కు 1.7టీఎంసీలు కేటాయించాలి. కొన్నేళ్లుగా ఈ కాలువకు చుక్కనీరు కేటాయించట్లేదు.
గతేడాది మరీ దారుణం
ఐఏబీ సమావేశంలో గతేడాది హెచ్ఎల్సీకి 23.1 టీఎంసీల నీరు కేటాయించారు. ఇందులో 8.5 టీఎంసీలు తాగునీటికి, 14.6టీఎంసీలు సాగుకు కేటాయించారు. హెచ్ఎల్సీ కింద మొత్తం 2.84లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. కానీ చివరకు 11 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. నష్టాలు పోను ‘అనంత’కు 9.5 టీఎంసీలు మాత్రమే చేరాయి. హంద్రీనీవా ద్వారా గతేడాది 28టీఎంసీల నీళ్లు జిల్లాకు చేరాయి. ఈ నీటిని ఏపీబీఆర్(పెన్నహోబిళం బ్యాలెన్స్ రిజర్వాయర్)కు మళ్లించి హెచ్ఎల్సీకి తరలించారు. కానీ ఆయకట్టుకు మాత్రం ఇవ్వలేదు. చెరువులను నింపే పేరుతో జలాలను మొత్తం వృథా చేశారు. 28 టీఎంసీల నీటితో కనీసం 28 ఎకరాలకు కూడా నీరు అందించలేదంటే నీటి వినియోగంపై ప్రభుత్వానికి ఏమేరకు ప్రణాళిక ఉందో, రైతుల శ్రేయస్సుపై చిత్తశుద్ధి ఏంటో ఇట్టే తెలుస్తుంది.
ఈ ఏడాది కలవరపెడుతున్న తుంగభద్ర
గతేడాది నీటి లభ్యత తక్కువ కారణంగా ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొనే ప్రమాదం కన్పిస్తోంది. ప్రస్తుతం డ్యాంకు 16వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 35.59 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ఏడాది జరిగే ఐఏబీ సమావేశంలో కేటాయింపులు తక్కువగా ఉంటాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
గత ఐదేళ్లుగా హెచ్ఎల్సీకి నీటి కేటాయింపులు ఇలా:
సంవత్సరం నీటి కేటాయింపులు విడుదలైంది కేసీ కెనాల్ వాటా(తాగునీటికి)
2011–12 23.426 20.186 2.941
2012–13 18.856 15.947 3.300
2013–14 22.075 22.075 4.500
2014–15 21.156 18.093 4.00
2015–16 16.863 15.997 1.000
2016–17 23.1 9.5 0