బెరైడ్డి బస్ యాత్రలో ఘర్షణ
బుచ్చినాయుడుకండ్రిగ, న్యూస్‌లైన్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి బస్సు యాత్రలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బస్సు యాత్ర సభ జరుగుతున్న సమయంలో రెండు కార్లలో ఆయన అనుచరులు బుచ్చినాయుడుకండ్రిగకు బయలుదేరారు. మార్గమధ్యంలోని గోవర్థనపురం వద్ద ఆ కార్లను ఓ ఆటో ఓవర్టేక్ చేసింది. దీంతో బెరైడ్డి అనుచరులు ఆటోను ఆపి డ్రైవర్ వెంకటేష్, మరో వ్యక్తిని చితకబాదారు. వెంకటేష్ అక్కడికి సమీపంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందినవాడు.
జరిగిన విషయాన్ని కాలనీలోని బంధువులకు ఫోన్లో తెలిపాడు. దీంతో కాలనీవాసులు కార్లను అడ్డుకోబోయారు. ఓ కారు వెళ్లిపోగా, మ రో కారులో ఉన్న ముగ్గురిపై కాలనీ వాసులు దాడి చేశారు. వారిలో మధు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కారు వెనుక అద్దాలు పగిలాయి. ఇంతలో సభను ముగించుకుని బస్‌లో వస్తున్న బెరైడ్డి రాజశేఖరరెడ్డిని కాలనీవాసులు చుట్టుముట్టారు. బెరైడ్డి గంటసేపు బస్‌లోనే ఉండిపోయారు. ఈలోపు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాలనీవాసులకు సర్ది చెప్పారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.