అడుగడుగునా. రాజ ముద్రలే!
‘‘రాయలకాలంలో రత్నాలు రాశులుపోసి అమ్మిన నేల
కరువు రక్కసి ఎడారిగా మారుస్తుంటే ఆ గుండె తల్లడిల్లింది..
హలం పట్టి పొలాలు దున్నిన హలధారి అప్పుల బాధతో హాలాహలం తాగి తనువు చాలిస్తుంటే ఆ హృదయం ఘోషించింది..
పుట్లకొలది ధాన్యం పండించే పుడమి పుత్రుడు పుట్టెడు దుఖఃలో శోకిస్తుంటే రైతు కష్టాలు తెలిసిన ఆ రైతుబిడ్డ మనసు చిన్నబోయింది..
మట్టిని నమ్మి మట్టిలో పెరిగే ఆ మట్టిమనుషులను
ఆదుకోవాలనీ ఆ తల వేయి తలలై ఆలోచించింది..
సేద్యంలో స్వేదం చిందించే రైతుమోమున దరహాసం చూడాలని..కరువునేల సస్యశ్యామలమై సిరులు పండాలంటే సాగునీరే శరణ్యమని గుర్తించి గురుతరబాధ్యతగా ప్రాజెక్టులకు ప్రాణం పోసిన ఆ అపర భగీరథుడే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.
రైతుకు పంటే ఆధారమనీ .. ఆ పంటకు నీరే ప్రాణమనీ..ఆ నీటికోసమే ప్రాజెక్టుల నిర్మాణానికి జలయజ్ఞమే చేపట్టారు వైఎస్సార్. జలరాశులను ప్రోదిచేసి జలాశయాలను కట్టించేందుకు ప్రతినబూనారు. చంద్రబాబు చీకటిపాలనలో పునాదిరాళ్లతో వెక్కిరిస్తున్న పథకాలకు నిధులను రాశులుగా బోశారు. కొత్త ప్రాజెక్టులకెన్నో రూపకల్పనజేసి రైతు పక్షపాతిగాముద్ర వేసుకొన్నారు.
భావి తరాల భవిష్యత్తు దృష్ట్యా ఆయన చేపట్టిన జలాశయాల్లో నీటి బొట్టు బొట్టునా ఆయన పేరు శాశ్వతమయింది. సీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు పురిటిగడ్డ. రాయలసీమ జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరందించటంతోపాటు..వేనవేల గొంతుకలదాహార్తిని తీర్చాలని వైఎస్ రూపకల్పనజేసిన ఎన్నో ప్రాజెక్టులు కార్యరూపం దాల్చి రైతన్నకు ఆసరాగా నిలిచాయి.
ఆయనలా ఆలోచించేవారులేక మరికొన్ని మధ్యలో నిలిచిపోయాయి. మహానేత ఇప్పటివరకూ బతికుంటే ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేడివని..కరువునేల పచ్చని పైర్లతో సస్యశ్యామలంగా మారేదనీ అందరినోటా వినిపించే మాట. ఆ జలయజ్ఞం ఖ్యాతిని ఆ మహానేతకు అంకితం చేయాలంటే రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటూ గొంతు గొంతూ గుండెలోతుల్లోంచి ఘోషిస్తోంది. వేయి కళ్లతో మరో జననేత కోసం ఎదురుచూస్తోంది..!
- న్యూస్‌లైన్, ఎమ్మిగనూరు