భర్త వేధింపులు.. ఆర్బీఐ ఉద్యోగిని ఆత్మహత్య
- ఆత్మహత్య కాదు.. హత్యే: బాధితురాలి తల్లి
- హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఘటన
హైదరాబాద్: నిత్యం అదనపు కట్నం, అనుమానంతో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆర్బీఐ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని.. ఆమె భర్తే హత్య చేశాడని మృతురాలి తల్లి ఆరోపించారు. హైదరాబాద్ అమీర్‌పేటలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపిం ది. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం వివరా లు వెల్లడించారు. కోల్‌కత్తాకు చెందిన శ్వేతజైన్(36), నితిన్జైన్లు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో శ్వేత తల్లిదండ్రులు రూ.2 లక్షల నగదు, 14 తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. నితిన్‌కు నాబార్డులో ఉద్యోగం రావడంతో ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు వచ్చాడు. ఆర్బీఐలో గ్రేడ్–ఎ అధికారిగా ఉద్యోగం రావడంతో శ్వేత ఏప్రిల్ 1న నగరానికి వచ్చి భర్తతో అమీర్‌పేట నాబార్డు క్వార్టర్స్‌లో ఉంటున్నారు.
అనుమానంతో బెడ్రూమ్లో కెమెరాలు...
నగరానికి వచ్చినప్పటి నుంచీ నితిన్ అదనపు కట్నం కోసం శ్వేతను వేధించేవాడు. మద్యానికి బానిసై, స్నేహితులతో కలసి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, భార్య జీతం డబ్బులూ తీసుకొనేవాడు. ఆమెపై అనుమానంతో బెడ్రూమ్లో తెలియకుండా కెమెరా లు అమర్చాడని శ్వేత సోదరుడు పంకజ్‌జైన్ చెప్పా డు. వారి వద్ద ఉన్న మారుతి కారు సరిపోదని, పెద్ద కారు కొనేందుకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడన్నాడు. దీనిపై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్వేత... గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని ఏసీపీ తెలిపారు. కాసేపటికి స్నేహితుడి సాయంతో నితిన్ తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లగా.. శ్వేత శవమై కనిపించిందన్నారు.
నోట్లో గుడ్డలు కుక్కి ఫోన్ చేయించాడు...
ఆత్మహత్యకు ముందు తనకు ఫోన్ చేయించిన నితిన్... ఏడుపు మాత్రమే వినిపించేలా, శ్వేత నోట్లో గుడ్డలు కుక్కి కొట్టాడని పంకజ్ తెలిపాడు. తర్వాత శ్వేతకు ఫోన్ చేసినా తీయలేదని, రాత్రి 9 సమయంలో నితిన్ అతడి స్నేహితుడితో ఫోన్ చేయించి.. మీ సోదరి ఆత్మహత్య చేసుకుందంటూ చెప్పించాడన్నాడు. పంకజ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నితిన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.