చిన్న కార్లతో హ్యుందాయ్ సందడి
హైదరాబాద్: చిన్న కార్ల మార్కెట్లో హ్యుందాయ్ భారీ యుద్ధానికే సిద్ధం అవుతోంది. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకికి పోటీగా కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి తేనున్నది. రెండేళ్లలో కనీసం నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేవడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది, వీటిల్లో ఎస్యూవీ, సెడాన్లు కూడా ఉంటాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మరోవైపు అమ్మకాలు మరింతగా పెంచుకోవడానికి గాను పూర్తిగా భారత్‌లోనే డిజైన్ చేసి, భారత్‌లోనే కార్లను తయారు చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. దీంట్లో భాగంగా హైదరాబాద్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. వివరాలు...,
వచ్చే నెలలో గ్రాండ్ ఐ10
చిన్న కార్ల సెగ్మెంట్లో మారుతీ తర్వాతి స్థానం హ్యుందాయ్‌దే. కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి తేవడం ద్వారా మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి కంపెనీకి గట్టిపోటీనివ్వాలని హ్యుందాయ్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ కార్లపై కంపెనీ దృష్టిపెడుతోంది. దీంట్లో భాగంగానే ఈ సెగ్మెంట్లో బాగా అమ్ముడయ్యే మారుతీ సుజుకి ఆల్టోకు పోటీగా ఇయాన్ 1.1 లీటర్ కారును అందుబాటులోకి తేనున్నదని సమాచారం. కొత్త కాంపాక్ట్ కారు, గ్రాండ్ ఐ10ను హ్యుందాయ్ కంపెనీ వచ్చే నెలలో మార్కెట్లోకి తేనున్నది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారు మారుతీ స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో కార్లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా. డీజిల్ కార్ల విభాగంలో హ్యుందాయ్ వెనకబడి ఉందని, అమ్మకాలు మరింతగా పెంచుకోవడానికి కొత్త డీజిల్ కార్లతో రంగంలోకి రానున్నదని నిపుణులంటున్నారు.
మేడిన్ ఇండియా
గ్రాండ్ ఐ10 తరహా కార్లను భారత్‌లోనే అభివృద్ధి చేసే, తయారు చేయాలని హ్యుందాయ్ యోచిస్తోంది. వీటిని విదేశాలకు కూడా విక్రయించాలని భావిస్తోంది. మార్కెట్లో అమ్మకాలు పెంచుకునే వ్యూహాంలో భాగంగా పూర్తిగా భారత్‌లోనే తయారయ్యే కారును రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ షారుక్ హాన్ చెప్పారు. అయితే ఈ లక్ష్యం ఐదేళ్ల తర్వాతే సాకారం అవుతుందని ఆయన చెప్పారు. ఈ లక్ష్యసాధన కోసం హైదరాబాద్‌లో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నామని పేర్కొన్నారు. తమ మాతృ కంపెనీకి కొరియాలో ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్‌తో పోల్చితే ఈ సెంటర్ శక్తి సామర్థ్యాలు తక్కువేనని అంగీకరించారు. తమ మాతృసంస్థ డెవలప్ చేసిన కార్లను భారత పరిస్థితులకు తగ్గట్లుగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయడానికి ప్రస్తుతం ఈ హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్ తోడ్పడుతోందని వివరించారు. ఇలాంటి సహకారమందించే స్థాయి నుంచి సొంతంగా కార్లును డిజైన్ చేసే స్థాయికి ఈ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నామని షారుక్ హాన్ పేర్కొన్నారు.