హువాయ్ పరిశోధన కేంద్రం ప్రారంభం
బెంగళూరులో ఏర్పాటు; రూ. 1,050 కోట్ల పెట్టుబడి
బెంగళూరు: టెలికం పరికరాలు, మొబైల్ ఫోన్స్ తయారీలో ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న చైనా కంపెనీ హువాయ్.. బెంగళూరులో తన పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది. ఇది భారత్‌లో ఒక చైనా కంపెనీ నెలకొల్పిన తొలి క్యాంపస్ మాత్రమే కాకుండా... చైనా వెలుపల హువాయ్‌కి అతిపెద్ద ఆర్‌అండ్‌డీ కేంద్రం కూడా కావడం గమనార్హం. దీనిలో 5,000 మంది ఇంజనీర్లను నియమించుకునే సామర్థ్యం ఉందని.. ప్రస్తుతానికి ఇక్కడ 2,500 మంది పనిచేస్తున్నట్లు హువాయ్ ఇండియా ఆర్‌అండ్‌డీ సెంటర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విల్సన్ వాంగ్ పేర్కొన్నారు.
వివిధ ఉత్పత్తులకు సంబంధించి అత్యంత నాణ్యమైన కాంపొనెంట్లు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్, అప్లికేషన్లను అభివృద్ధిచేయడం... కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంపై ఈ ఆర్‌అండ్‌డీ సెంటర్ దృష్టిపెడుతుందని ఆయన వెల్లడించారు. భారత్ మార్కెట్లో హువాయ్ ప్రస్థానానికి 15 ఏళ్లు పూర్తయింది. దేశంలో టెలికం రంగం ప్రగతి ప్రస్థానంలో హువాయ్ ప్రధాన ప్రాత్ర పోషిస్తోందని.. భారత్ మార్కెట్‌పై కంపెనీ నిబద్ధతకు ఈ ఆర్‌అండ్‌డీ కేంద్రమే నిదర్శనమని పారిశ్రామిక విధానం-ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు.