20 నుంచి గ్యాప్ ఏరియా భూముల సర్వే
నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు
నాతవరం : గ్యాప్ ఏరియా భూముల సర్వే ఈ నెల 20 నుంచి చేపట్టనున్నట్టు నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు తెలిపారు. బుధవారం ఆయన సరుగుడు పంచాయతీలోని గ్యాప్ ఏరియా భూములను పరిశీలించారు. దీనిపై సుందరకోట, అసనగిరి గ్రామాల్లో గిరిజనులతో మాట్లాడారు. అనంతరం సుందరకోట ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు జరపాలని నిర్వాహకులకు సూచించారు. గ్రామస్తులనుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సరుగుడులో సర్పంచ్ సాగిన లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. బండి గంగరాజు తదితరులు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. లేటరైట్ విషయంలో నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కనకారావును ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం ఐదో షెడ్యూల్ ఏరియాతోపాటు, పీసాచట్టం పరిధిలో ఉందన్నారు. గ్యాప్ ఏరియా భూములను ప్రైవేట్ వ్యక్తులకు గాని, ఫ్యాక్టరీలకు కేటాయిస్తేనే ఈ ప్రాంత గిరిజనుల అంగీకారం అవసరమన్నారు.
ఈ ప్రాంతంలో గ్యాప్ ఏరియా భూములు ఎక్కువగా ఉన్నాయన్న అటవీశాఖ నివేదించడం వల్ల సర్వేకు కలెక్టర్ ఆదేశించారన్నారు. ఈ ప్రాంత గిరిజనులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కలెక్టర్ యువరాజ్, జేసీ జనార్ధన్ నివాస్ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ టీవీఎల్ రాజు, సర్వేయర్ గిరిప్రసాద్ పాల్గొన్నారు.