reached home
-
తప్పిపోతున్నారు..
కామారెడ్డి క్రైం : ముక్కుపచ్చలారని చిన్నారులు.. ఆడుకోవడమే వారికి సరదా. తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లడమంటే మరీ ఇష్టం. ఆడుకుంటున్నా, తోడుగా వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని విస్మరిస్తే అంతే సంగతులు. ఇంటిల్లిపాదిని సంతోషాల్లో ముంచెత్తే బోసి నవ్వులు కనిపించకుండా పోతాయి! తలిదండ్రులు, కుటుంబసభ్యులు చేస్తున్న కొన్ని పొరపాట్లు పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇంటా బయటా, ఎక్కడున్నా చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు గుర్తుచేస్తున్నాయి. పిల్లల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా భారీ మూల్యం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు తప్పిపోయిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. పక్షం వ్యవధిలో ఇద్దరు చిన్నారులు.. జిల్లా కేంద్రంలో పదిహేను రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. వారిలో ఓ బాలుడు ఏకంగా కిడ్నాప్‌నకు గురయ్యాడు. అజాంపుర కాలనీకి చెందిన ఫాతిమా తన ఏడేళ్ల కుమారుడు సయ్యద్ అయాన్‌తో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలోని ఆమె వెళ్లగా బాలుడు బయట ఆడుకుంటున్నాడు. బాలుడిపై కన్నేసిన నజీరొద్దిన్ అనే వ్యక్తి అయాన్‌ను కిడ్నాప్ చేసి ఆటోలో వెళ్లిపోయాడు. బయటకు వచ్చిన తల్లి బాలుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఐదున్నర గంటలపాటు గాలించి నసీరొద్దిన్ ఇంట్లో బాలుడిని గుర్తించి తల్లికి అప్పగించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మరో బాలుడు అదృశ్యం కావడం కలకలం రేపింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన లక్ష్మీపతి దంపతులు ఆస్పత్రి పనిమీద కామారెడ్డికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. పాతబస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకునేందుకు లోనికి వెళ్లారు. వారి కుమారుడు ఆరేళ్ల కృష్ణమూర్తి ఆస్పత్రి వరండాలో ఆడుకుంటూ తప్పిపోయాడు. అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు, పోలీసులు చుట్టు పక్కల అంతటా గాలించి ఓ మెడికల్ వద్ద బాలుడిని గుర్తించారు. అయాన్, కృష్ణమూర్తి అనే ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడంలో వారి తల్లిదండ్రుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో చేసిన పొరపాట్లే కారణమని పోలీసులు, స్థానికులు భావించారు. ఇవేకాకుండా గత డిసెంబర్లో పాత బాన్సువాడకు చెందిన లోకేష్ అనే ఐదేళ్ల బాలుడు తప్పిపోగా చిల్లర్గి గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఆ బాలుడిని తీసుకెళ్లిపోయారు. అప్పట్లో ఈ సంఘటన కలకలం రేపింది. చివరికి పోలీసులు కేసును చేధించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతకుముందు కోటగిరికి చెందిన ఓ బాలుడిని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు కేసు ఛేదించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మొన్నటికి మొన్న నందిపేట మండలం వన్నెల్(కే) గ్రామానికి చెందిన ఆరేళ్ల పాప మనీశ్వరిని మరో మహిళ పాఠశాల నుంచి కిడ్నాప్ చేయగా కేరళలో వారిని గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ దొరకని గణేష్ ఆచూకీ.. కామారెడ్డిలోని భరత్నగ ర్ కాలనీకి చెందిన మూ డేళ్ల వయస్సు గల కటికె గణేష్ ఇంటి ముందు ఆడుకుంటుండగా తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసే సరికి తప్పిపోయాడు. ఏప్రిల్‌లో జరిగిన బాలుడి అదృశ్యం కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గణేష్ ఆచూకీ కోసం పట్టణంతో పాటు జిల్లా అంతటా వడపోశారు. అయినా లభించలేదు. బాలుడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అందరూ భావించారు. గణేష్ తప్పిపోయి నాలుగు నెలలు దాటినా ఇప్పటికి అతడి జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం కూడా అతడి ఆచూకీ తెలియకపోవడానికి కారణమైంది. -
తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు..
మందస : ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ కుర్రాడు ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. మరణించాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మందస పట్టణంలోని కంచమయికాలనీ సమీపంలో నివాసముంటున కరుమోజి సంతోష్ పుట్టుకతో దివ్యాంగుడు(మూగ, చెవిటి). సంతోష్‌ను ప్రతి ఒక్కరూ జడ్డిడుగా హేళన చేసేవారు. 9 ఏళ్ల కిందట ఇతడు పట్టణంలోని శ్రీవెంకటేశ్వర భోజన హోటల్లో పని చేసేవాడు. ఒక రోజు హఠాత్తుగా కనిపించలేదు. ఇంటికీ వెళ్లలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు హోటల్ యాజమాన్యం కూడా సంతోష్ ఆచూకీకి ఎంతో ప్రయత్నించారు. ఇతడిపై పోలీసు స్టేషన్లో అదృశ్యం కేసు కూడా నమోదైంది. అయితే, అప్పటిలో ఓ చిరువ్యాపారి సంతోష్‌ను ఎవరో కారులో తీసుకెళ్లడం చూశానని చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదు. సంతోష్ కనిపించకుండా దాదాపు తొమ్మిదేళ్లు గడిచాయి. స్థానికంగా పానీపూరి చేసుకుని, అమ్ముకుంటూ జీవించే ఒడిశా వాసులు ఇదే కాలనీలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం వారు తమ సొంత స్థలాలైన ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో సంతోష్ కనిపించాడు. అతనితో సైగలతో మాట్లాడారు. తన దగ్గర డబ్బుల్లేవని, సొంత ఊరుకు వచ్చేస్తానని చెప్పడంతో వారు తమ చేతిలోని డబ్బులతో భువనేశ్వర్ నుంచి మందస తీసుకువచ్చి కుటుంబానికి సంతోష్‌ను అప్పగించారు. తొమ్మిదేళ్ల క్రితం ఆరోగ్యంగా ఉన్న ఇతడు ప్రస్తుతం చిక్కిపోయి ఉండడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్.. ఏమి చేస్తున్నావ్.. అని ప్రశ్నించగా, తనను ఎవరో కారులో తీసుకెళ్లిపోయారని, ఇటుకలు తయారీ చేసే బట్టీలో కూలీగా మార్చేశారని సంతోష్ చెబుతున్నాడు. అర్థాకలితో యజమాని వేధింపులకు గురిచేశాడని, అంతేకాకుండా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పని చేయించుకునే వాడన్నాడు. దాదాపుగా తప్పించుకుని పారిపోయే విధంగానే వచ్చానని చెబుతున్నాడు. సుమారు దశాబ్ద కాలం పాటు కనిపించకుండా పోయిన కుమారుడు ఇంటికి రావడంతో తల్లి కమల, అన్నయ్య అప్పన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సంతోష్ లేకపోవడంతో రేషన్ కార్డులో పేరును తొలగించారని, ఆధార్‌కార్డు లేదని, వస్తున్న పింఛన్‌ను నిలిపివేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో పేదరికంలో ఉన్నామని, అధికారులు స్పందించి, పింఛన్‌తో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
8ఏళ్ల వయస్సులో వెళ్లాడు..8 ఏళ్లకు తిరిగొచ్చాడు
మెదక్ మున్సిపాలిటీ: కన్న తండ్రి మందలించాడని క్షణికావేశంలో కడపదాటిని చిన్నారి.. 8 ఏళ్లపాటు ఆశ్రమాల్లో ఆశ్రయం పొంది ఎట్టకేలకు అమ్మనాన్నల చెంతకు చేరాడు. కన్న కొడుకు దూరమై బతుకంతా భారమై కన్నీరై మున్నీరైన ఆ తల్లిదండ్రులు తిరిగొచ్చిన తమ బిడ్డను చూసి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని బాల సదనంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా, ఖిలాఘణపూర్ మండలం, షాపూర్ గ్రామానికి చెందిన వేమల వెంకటయ్య రాములమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల కిత్రం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అయితే ఈ దంపతుల కుమారుడు వేమల శ్రీకాంత్‌కు 2010లో అపెండెక్స్ ఆపరేషన్ జరిగింది. అప్పట్లో కొద్ది రోజులుగా శ్రీకాంత్‌ను వెంకటయ్య మానాజీపేటలో ఉండే తన అక్క దగ్గర ఉంచారు. అనంతరం శ్రీకాంత్ తిరిగి హైదరాబాద్‌లో ఉంటున్న వారి అమ్మనానల దగ్గరికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు మందలించడంతో.. ఆపరేషన్ జరిగిన శ్రీకాంత్ బరువులు ఎత్తడంతో తండ్రి మందలించాడు. దీంతో శ్రీకాంత్ 2010లో ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు. ఇంటికి తిరిగి వచ్చే దారి మరిచిపోవడంతో శ్రీకాంత్‌ను మానవత ధృక్పథంతో కొందరు చేరదీసి చెర్లపల్లిలోని దివ్యదశ బాల ఆశ్రమానికి తరలించారు. అయితే శ్రీకాంత్‌కు బుద్ది తెలియడంతో తన తల్లిదండ్రులను కలుసుకోవాలని ఆశపడ్డాడు. దీంతో అడ్రస్ వెతుకుంటూ శ్రీకాంత్ మేనత్త ఇంటికి వెళ్లగా చిన్నప్పటి ఫొటో ఆధారంగా శ్రీకాంత్‌ను వారు గుర్తించారు. దీంతో శ్రీకాంత్ తల్లిదండ్రుల అడ్రస్ గుర్తించి మెదక్ బాలసదనం అ«ధికారులు సమాచారం అందించారు. శుక్రవారం బాలసదనం అధికారి రామకృష్ణ, జిల్లా బాల సంక్షేమ సమితి సభ్యులు కైలాష్, ఆత్మరాములు చట్ట బద్దంగా శ్రీకాంత్‌ను అతని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారున్ని ఇక ఈ జీవితంలో కలుస్తామని అనుకోలేదని ఆనందభాష్ఫాలతో ఉప్పోంగి పోయారు. తల్లిదండ్రుల చెంతకు చేరుకున్న శ్రీకాంత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తమ కుమారుని తమకు అప్పగించిన అందరికి జీవితాంతం రుణపడి ఉంటామని శ్రీకాంత్ తల్లిదండ్రులు రాములమ్మ–వెంకటయ్యలు పేర్కొన్నారు. -
తల్లిదండ్రుల చెంతకు...తప్పిపోయిన బాలిక
విజయనగరం టౌన్: తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ చదువుకోవాలన్నా ఆ చిన్నారిని, బంధువుల ఇంట్లో పెట్టి చదివించడం వల్ల తల్లిదండ్రుల ప్రేమ కరువైంది. విషయాన్ని ఆ చిన్నారి సూటిగా చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టడంతో చేసేది లేక, ఏం చేయాలో తెలియక రైలెక్కేసింది. మూడురోజులైనా కుమార్తె కనబడకపోయే సరికి ఆ తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ పాలరాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన వన్‌టౌన్ ప్రత్యేక బృందం ఒక్కరోజు వ్యవధిలోనే ఆ చిన్నారిని కనుగొని, అందరి మన్ననలు అందుకున్నారు. దీనికి సంబంధించి వన్‌టౌన్ సీఐ వి.చంద్రశేఖర్ అందించిన వివరాలిలా ఉన్నాయి. జామి మండలం టి.కొత్తూరు గ్రామానికి చెందిన జెట్టి కృష్ణారావు తన కుమార్తె రోషిణీ మహికి మంచి చదువును అందించాలనే సంకల్పంతో పట్టణంలోని ఎయిమ్ కాన్సెప్ట్ స్కూల్లో జాయిన్ చేసి, తన బంధువుల ఇంటివద్ద అమ్మాయిని ఉంచాడు. తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం తనకు ఇష్టం లేదని పదే పదే ఆ అమ్మాయి తెలిపేది. కానీ, తల్లిదండ్రులు అందుకు అంగీకరించకపోవడంతో ఇటీవలి కాలంలో ఆమెకు చదువుపై ఆసక్తి తగ్గింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వారు తమ కుమార్తెను ఇష్టానికి వ్యతిరేకంగానే చదివించేందుకు ప్రయత్నించడంతో, విసుగు చెందిన ఆ చిన్నారి జనవరి 30న ఇల్లు విడిచి వెళ్లిపోయింది. కూలీలు కడుపున పెట్టి చూసుకున్నారు.. విజయనగరం రైల్వేస్టేషన్లో రైలెక్కిన రోషిణీకి గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి శంబర పండగకు వచ్చి, పనుల కోసం వలస కూలీలుగా తిరిగి వెళ్తున్న బృందం కలిసింది. వారితో మాట్లాడే క్రమంలో తనకెవ్వరూ లేరని తెలపడంతో వారు తమ వెంట రోషిణీని కంకిపాడు గ్రామానికి తీసుకువెళ్లిపోయారు. రోషిణికి ఎటువంటి లోటు లేకుండా చూశారు. దర్యాప్తు ప్రారంభించిన వన్‌టౌన్ పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా రోషిణీ విజయవాడ వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. అక్కడకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంతో శ్రమించిన ఆ బృందం ఎట్టకేలకు రోషిణీని కనుగొని పట్టణానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. అమ్మాయిని వెదికి పట్టుకోవడంలో వన్‌టౌన్ కానిస్టేబుల్ రామకృష్ణ, శ్రీనివాసరావు, కాల్‌డేటా కానిస్టేబుల్ రవి ఎంతగానో కృషి చేయడంతో వారిని వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం..
-
కిడ్నాప్ కథ సుఖాంతం..
తణకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. రెండు రోజుల కింద పాఠశాలకు వెళ్లి కిడ్నాప్‌కు గురైన హేమంత్(5)ను ఆగంతకులు గురువారం ఆటోలో వచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లారు. హోండా యాక్టివా మీద వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి సోమవారం బాలుడిని అపహరించిన విషయం తెలిసిందే. బాలుడి అక్క దుండగుడిని ప్రతిఘటించినా... ఆ చిన్నారిని తోసేసి.. ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. కిడ్నాప్ దృశ్యాలను సీసీటీవీ కెమెరా బంధించింది. ఈ దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గత రెండు రోజులుగా తీవ్రంగా గాలించారు. దాంతో భయపడిన ఆగంతకుడు బాలున్ని ఇంటి దగ్గరే వదిలి వెళ్లాడు. తమ కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.