శ్రీకాంత్‌ను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న అధికారులు
మెదక్ మున్సిపాలిటీ: కన్న తండ్రి మందలించాడని క్షణికావేశంలో కడపదాటిని చిన్నారి.. 8 ఏళ్లపాటు ఆశ్రమాల్లో ఆశ్రయం పొంది ఎట్టకేలకు అమ్మనాన్నల చెంతకు చేరాడు. కన్న కొడుకు దూరమై బతుకంతా భారమై కన్నీరై మున్నీరైన ఆ తల్లిదండ్రులు తిరిగొచ్చిన తమ బిడ్డను చూసి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని బాల సదనంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా, ఖిలాఘణపూర్ మండలం, షాపూర్ గ్రామానికి చెందిన వేమల వెంకటయ్య రాములమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల కిత్రం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అయితే ఈ దంపతుల కుమారుడు వేమల శ్రీకాంత్‌కు 2010లో అపెండెక్స్ ఆపరేషన్ జరిగింది. అప్పట్లో కొద్ది రోజులుగా శ్రీకాంత్‌ను వెంకటయ్య మానాజీపేటలో ఉండే తన అక్క దగ్గర ఉంచారు. అనంతరం శ్రీకాంత్ తిరిగి హైదరాబాద్‌లో ఉంటున్న వారి అమ్మనానల దగ్గరికి చేరుకున్నాడు.
తల్లిదండ్రులు మందలించడంతో..
ఆపరేషన్ జరిగిన శ్రీకాంత్ బరువులు ఎత్తడంతో తండ్రి మందలించాడు. దీంతో శ్రీకాంత్ 2010లో ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు. ఇంటికి తిరిగి వచ్చే దారి మరిచిపోవడంతో శ్రీకాంత్‌ను మానవత ధృక్పథంతో కొందరు చేరదీసి చెర్లపల్లిలోని దివ్యదశ బాల ఆశ్రమానికి తరలించారు. అయితే శ్రీకాంత్‌కు బుద్ది తెలియడంతో తన తల్లిదండ్రులను కలుసుకోవాలని ఆశపడ్డాడు. దీంతో అడ్రస్ వెతుకుంటూ శ్రీకాంత్ మేనత్త ఇంటికి వెళ్లగా చిన్నప్పటి ఫొటో ఆధారంగా శ్రీకాంత్‌ను వారు గుర్తించారు. దీంతో శ్రీకాంత్ తల్లిదండ్రుల అడ్రస్ గుర్తించి మెదక్ బాలసదనం అ«ధికారులు సమాచారం అందించారు. శుక్రవారం బాలసదనం అధికారి రామకృష్ణ, జిల్లా బాల సంక్షేమ సమితి సభ్యులు కైలాష్, ఆత్మరాములు చట్ట బద్దంగా శ్రీకాంత్‌ను అతని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారున్ని ఇక ఈ జీవితంలో కలుస్తామని అనుకోలేదని ఆనందభాష్ఫాలతో ఉప్పోంగి పోయారు. తల్లిదండ్రుల చెంతకు చేరుకున్న శ్రీకాంత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తమ కుమారుని తమకు అప్పగించిన అందరికి జీవితాంతం రుణపడి ఉంటామని శ్రీకాంత్ తల్లిదండ్రులు రాములమ్మ–వెంకటయ్యలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment