Ready-to-Eat
-
నోరూరిస్తున్న రెడీ టు ఈట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీ టు ఈట్.. నిముషాల్లో సిద్ధం చేసుకునే వీలున్న ఫుడ్. అందుబాటు ధర, సౌలభ్యం, నెలల తరబడి మన్నికకుతోడు నోరూరించే వేలాది రుచులు. వెరశి ఈ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఏటా 30 శాతం దాకా వద్ధి నమోదు చేస్తుండడంతో దిగ్గజ కంపెనీలూ ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వినియోగం విషయంలో దక్షిణాది రాష్ట్రాలే ముందంజలో ఉండడం విశేషం. ఇక భారత్ రుచులతో తయారైన రెడీ టు ఈట్ ఉత్పత్తులకు విదేశీయులూ దాసోహం అంటున్నారు. వేలాది ఉత్పత్తులు..: ప్రస్తుతం భారత్‌లో 6,000 పైచిలుకు రెడీ టు ఈట్ ఉత్పత్తులు లభిస్తున్నాయని సమాచారం. వీటిలో వెజ్ రకాలు 80 శాతముంటాయి. యువతరం విభిన్న రుచులను కొరుకుంటోందని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. ఇందుకోసం ఎంతైనా వెచ్చిస్తున్నారని అన్నారు. ఈ తరం యువతలో అత్యధికులకు వంట చేయడం రాదని, వీరంతా ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారని వివరించారు. రెస్టారెంట్ల విషయానికి వస్తే చేయి తిరిగిన వంట వారి కొరత దేశవ్యాప్తంగా ఉంది. ఒక్క ముంబై నగరంలోనే ఐదేళ్లలో 180కి పైగా రెస్టారెంట్లు మూతపడ్డాయని ఉడుపి రుచి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న శ్రీ ఫ్యామిలీ గ్రూప్ డైరెక్టర్ ఎస్.ఆర్.రావు సాహిబ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. హోటళ్లలో సైతం రెడీ టు ఈట్ ఉత్పత్తుల వాడకం పెరిగిందన్నారు. దక్షిణాది ముందంజ..: ఈ ఉత్పత్తుల వాడకంలో దక్షిణాది రాష్ట్రాలే అగ్ర స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నిలిచింది. ప్రధానంగా మెట్రో నగరాలే ముం దుంటున్నాయి. ఇప్పుడిప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా వినియోగం పెరిగింది. రెడీ టు ఈట్ విభాగంలో అల్పాహార ఉత్పత్తుల వాటాయే అధికం. రవ్వ ఇడ్లీ, రవ్వ దోశ టాప్‌లో నిలిచాయి. స్వీట్స్‌లో గులాబ్ జామూన్ ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తోంది. రైస్ ఐటెమ్స్‌లో పులిహోరకు అగ్రస్థానం లభిస్తోంది. రైస్ ఐటెమ్స్ ను అత్యధికంగా దక్షిణాది కస్టమర్లు కోరుకుంటున్నారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో వీటికి కొద్ది డిమాండ్ ఉంది. ఎగుమతులు రూ.2,000 కోట్లు అంతర్జాతీయంగా వడ, ఇడ్లీ, సాంబార్, దోశ, ఉప్మ టాప్ జాబితాలో స్థానం సంపాదించాయి. సింగపూర్, హాంగ్‌కాంగ్, దుబాయి, యూకే, యూఎస్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో భారత రెడీ టు ఈట్ ఉత్పత్తులకు సమున్నత స్థానం ఉంది. రుచికరంగా ఉండడం, వేలాది రకాల లభ్యత ఇందుకు కారణం. ఎంటీఆర్ 30కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. అన్ని బ్రాండ్లు కలిపి భారత్ నుంచి ఎగుమతుల విలువ రూ.2,000 కోట్లుంది. ఇదీ మార్కెట్..: భారత్‌లో రెడీ టు ఈట్ పరిశ్రమలో 15 కంపెనీల దాకా ప్రముఖంగా పోటీపడుతున్నాయి. అలాగే ఈ రంగంలో చిన్నా చితకా కంపెనీలు, చిరు వ్యాపారులు వేలల్లో ఉంటారు. నెస్లే, ఎంటీఏఆర్, ఐటీసీ, బాంబినో, కోహినూర్ ఫుడ్స్, హల్దీరామ్స్, ఉడుపి రుచి, సూర్య, మదర్స్ రెసిపీ వంటి బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హైదరాబాద్‌కు చెందిన 24 లెటర్ మంత్ర సైతం ఎంట్రీ ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నాణ్యత ప్రమాణాల నిబంధనల అమలు కఠినతరం చేస్తోంది. దీంతో నాణ్యతకు పెద్ద పీట వేసే వ్యాపారులు, కంపెనీలు మాత్రమే నిలుస్తాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం రూ.13,500 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వార్షిక వృద్ధి రేటు 25–30 శాతముంది. విపణిలో 80 శాతం అవ్యవస్థీకృత రంగానిదే. ఆన్లైన్ కొనుగోళ్ల వాటా 1 శాతముంది. -
రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్
రైళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా కేంద్రం పలు చర్యలు ప్రకటించింది. ఇందులోభాగంగా తినడానికి సిద్ధంగా ఉన్న(రెడీ టు ఈట్) ఆహార పదార్థాలను రైళ్లలో అందించనున్నట్లు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ పార్లమెంట్లో వెల్లడించారు. నాణ్యత, భిన్నత్వం కోసం రైళ్లలో ‘రెడీ టు ఈట్’ ఆహార ఉత్పత్తులను దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక రైళ్లలో కేటరింగ్ సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మరో సంస్థతో తనిఖీలు(థర్డ్ పార్టీ ఆడిట్) నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ వ్యవస్థను రూపొందించనున్నట్లు ప్రతిపాదించారు. ఇందులోభాగంగా ఐవీఆర్ఎస్ విధానంలో ఆహార నాణ్యతపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టే పద్ధతిని త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు. శుభ్రత, రుచి విషయంలో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసినపక్షంలో సదరు విక్రయదారుపై కఠిన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టును రద్దు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎక్కడికక్కడ స్థానిక రుచులను అందించనున్నట్లు, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డర్లు స్వీకరించే సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా న్యూఢిల్లీ-అమృత్సర్, న్యూఢిల్లీ-జమ్మూతావి సెక్షన్లలో ఈ సేవలను త్వరలోనేఅమలు చేయనున్నట్లు ప్రకటించారు. -
రెడీ టు ఈట్ విభాగంలోకి వస్తున్నాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల విక్రయ రంగంలో ఉన్న రుచి సోయా ఇండస్ట్రీస్ వచ్చే ఏడాది రెడీ టు ఈట్ విభాగంలోకి ప్రవేశించనుంది. ఇప్పటికే కంపెనీ సోయా ఉత్పత్తులను నూట్రెలా బ్రాండ్‌లో విక్రయిస్తోంది. న్యూట్రెలా ఇన్స్టాంట్ను ఇటీవలే ఉత్తరాదిన ప్రవేశపెట్టారు. సెప్టెంబరుకల్లా వీటిని దక్షిణాదిన పరిచయం చేయనుంది. అల్పాహార ఉత్పత్తులను కూడా తీసుకొస్తామని రుచి సోయా సీవోవో సతేంద్ర అగర్వాల్ గురువారమిక్కడ తెలిపారు. సంయుక్త భాగస్వామితో కలిసి మార్కెట్లోకి తేనున్నట్టు పేర్కొన్నారు. ప్రీమియం సన్‌ఫ్లవర్ నూనె సన్రిచ్ను రీబ్రాండ్ చేసి దక్షిణాది మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా కంపెనీ దక్షిణ ప్రాంత వైస్ ప్రెసిడెంట్ అజయ్ మాలిక్, మార్కెటింగ్ హెడ్ అలోక్ మహాజన్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సన్‌ఫ్లవర్ (పొద్దుతిరుగుడు) నూనె అమ్మకాల్లో ఏడాదిలో 10 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. బ్లెండెడ్ ఆయిల్‌లోకి..: మిశ్రమ(బ్లెండెడ్) నూనెల విభాగంలోకి ఏడాదిలో అడుగు పెడతామని సతేంద్ర అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఈ విభాగం వాటా 2-3 శాతం మాత్రమే. వృద్ధి 15-20 శాతముందని తెలిపారు. ‘2013-14లో వంట నూనెల వినియోగం 1.9 కోట్ల టన్నులుంది. ఇందులో ప్యాకేజ్డ్ విభాగం వాటా 90 లక్షల టన్నులు. మొత్తం వినియోగం మూడేళ్లలో 2.2 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అంచనా. సగటు వినియోగం ప్రపంచంలో 22 కిలోలుంటే, దేశంలో 14 కిలోలకే పరిమితమైంది. ప్యాకేజ్డ్ నూనెల్లో 70 శాతం వినియోగం దక్షిణాది రాష్ట్రాలదే’ అని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభం మరికొంత కాలం కొనసాగితే సన్‌ఫ్లవర్ నూనె దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన చెప్పారు. ఉక్రెయిన్, రష్యాల నుంచి భారత్ ఏటా 15 లక్షల టన్నుల నూనెను దిగుమతి చేస్తోంది.