నోరూరిస్తున్న రెడీ టు ఈట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీ టు ఈట్.. నిముషాల్లో సిద్ధం చేసుకునే వీలున్న ఫుడ్. అందుబాటు ధర, సౌలభ్యం, నెలల తరబడి మన్నికకుతోడు నోరూరించే వేలాది రుచులు. వెరశి ఈ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఏటా 30 శాతం దాకా వద్ధి నమోదు చేస్తుండడంతో దిగ్గజ కంపెనీలూ ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వినియోగం విషయంలో దక్షిణాది రాష్ట్రాలే ముందంజలో ఉండడం విశేషం. ఇక భారత్ రుచులతో తయారైన రెడీ టు ఈట్ ఉత్పత్తులకు విదేశీయులూ దాసోహం అంటున్నారు.
వేలాది ఉత్పత్తులు..: ప్రస్తుతం భారత్‌లో 6,000 పైచిలుకు రెడీ టు ఈట్ ఉత్పత్తులు లభిస్తున్నాయని సమాచారం. వీటిలో వెజ్ రకాలు 80 శాతముంటాయి. యువతరం విభిన్న రుచులను కొరుకుంటోందని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు. ఇందుకోసం ఎంతైనా వెచ్చిస్తున్నారని అన్నారు. ఈ తరం యువతలో అత్యధికులకు వంట చేయడం రాదని, వీరంతా ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారని వివరించారు. రెస్టారెంట్ల విషయానికి వస్తే చేయి తిరిగిన వంట వారి కొరత దేశవ్యాప్తంగా ఉంది. ఒక్క ముంబై నగరంలోనే ఐదేళ్లలో 180కి పైగా రెస్టారెంట్లు మూతపడ్డాయని ఉడుపి రుచి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న శ్రీ ఫ్యామిలీ గ్రూప్ డైరెక్టర్ ఎస్.ఆర్.రావు సాహిబ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. హోటళ్లలో సైతం రెడీ టు ఈట్ ఉత్పత్తుల వాడకం పెరిగిందన్నారు.
దక్షిణాది ముందంజ..: ఈ ఉత్పత్తుల వాడకంలో దక్షిణాది రాష్ట్రాలే అగ్ర స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నిలిచింది. ప్రధానంగా మెట్రో నగరాలే ముం దుంటున్నాయి. ఇప్పుడిప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా వినియోగం పెరిగింది. రెడీ టు ఈట్ విభాగంలో అల్పాహార ఉత్పత్తుల వాటాయే అధికం. రవ్వ ఇడ్లీ, రవ్వ దోశ టాప్‌లో నిలిచాయి. స్వీట్స్‌లో గులాబ్ జామూన్ ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తోంది. రైస్ ఐటెమ్స్‌లో పులిహోరకు అగ్రస్థానం లభిస్తోంది. రైస్ ఐటెమ్స్ ను అత్యధికంగా దక్షిణాది కస్టమర్లు కోరుకుంటున్నారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో వీటికి కొద్ది డిమాండ్ ఉంది.
ఎగుమతులు రూ.2,000 కోట్లు
అంతర్జాతీయంగా వడ, ఇడ్లీ, సాంబార్, దోశ, ఉప్మ టాప్ జాబితాలో స్థానం సంపాదించాయి. సింగపూర్, హాంగ్‌కాంగ్, దుబాయి, యూకే, యూఎస్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో భారత రెడీ టు ఈట్ ఉత్పత్తులకు సమున్నత స్థానం ఉంది. రుచికరంగా ఉండడం, వేలాది రకాల లభ్యత ఇందుకు కారణం. ఎంటీఆర్ 30కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. అన్ని బ్రాండ్లు కలిపి భారత్ నుంచి ఎగుమతుల విలువ రూ.2,000 కోట్లుంది.
ఇదీ మార్కెట్..: భారత్‌లో రెడీ టు ఈట్ పరిశ్రమలో 15 కంపెనీల దాకా ప్రముఖంగా పోటీపడుతున్నాయి. అలాగే ఈ రంగంలో చిన్నా చితకా కంపెనీలు, చిరు వ్యాపారులు వేలల్లో ఉంటారు. నెస్లే, ఎంటీఏఆర్, ఐటీసీ, బాంబినో, కోహినూర్ ఫుడ్స్, హల్దీరామ్స్, ఉడుపి రుచి, సూర్య, మదర్స్ రెసిపీ వంటి బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హైదరాబాద్‌కు చెందిన 24 లెటర్ మంత్ర సైతం ఎంట్రీ ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నాణ్యత ప్రమాణాల నిబంధనల అమలు కఠినతరం చేస్తోంది. దీంతో నాణ్యతకు పెద్ద పీట వేసే వ్యాపారులు, కంపెనీలు మాత్రమే నిలుస్తాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం రూ.13,500 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వార్షిక వృద్ధి రేటు 25–30 శాతముంది. విపణిలో 80 శాతం అవ్యవస్థీకృత రంగానిదే. ఆన్‌లైన్ కొనుగోళ్ల వాటా 1 శాతముంది.