ఈ ఏడాది రూ.1,000 కోట్లు టార్గెట్
ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ ఎంటీఆర్ ఈ ఏడాది రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. 2016లో కంపెనీ రూ.800 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందులో రూ.140 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సమకూరింది. మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల వాటాను రెండింతలకు చేరుస్తామని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ తెలిపారు.
గురువారమిక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పైసీ సాంబార్ పౌడర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఎంటీఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ రెజి మాథ్యూతో కలిసి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక తర్వాత కంపెనీకి అధిక ఆదాయాన్ని అందిస్తున్న తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశామని, ఇందులో భాగంగానే నూతన ఉత్పాదనను పరిచయం చేశామన్నారు. 1,500 మంది కస్టమర్ల ఆమోదం తర్వాత స్పైసీ సాంబార్ పౌడర్‌ను విడుదల చేసినట్టు చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో 1.50 లక్షల దుకాణాల్లో సంస్థ ఉత్పత్తులు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ ద్వారా కూడా కంపెనీ ప్రొడక్టులను అమ్ముతోంది.