Real Estate Danda
-
పట్టుబడ్డ పయ్యావుల!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో జరిగిన అక్రమాలు, టీడీపీ నాయకుల రియల్ ఎస్టేట్ దందాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయి. రాజధాని ఎక్కడనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకముందే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం ద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పాల్పడినట్లు తేటతెల్లమైంది. పయ్యావుల కుటుంబ సభ్యుల పేరుతో ఎక్కడెక్కడ భూములు కొన్నారో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చిట్టా బయటపెట్టారు. తప్పేముంది.. స్వాధీనం చేసుకోండి! అసెంబ్లీలో గురువారం అమరావతి భూముల కొనుగోళ్లపై చర్చ సందర్భంగా తాను రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు కొనుగోలు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పయ్యావుల తొలుత ఖండించారు. ‘రాజధానిని ప్రకటించాక భూములు కొన్నాం.. తప్పేముంది?’ అంటూ ప్రశ్నించారు. చట్ట విరుద్ధంగా భూములను కొనుగోలు చేస్తే కేంద్రం తెచ్చిన బినామీ ఆస్తుల స్వాధీనం చట్టం ప్రకారం తన భూములు తీసేసుకోవాలంటూ సవాల్ విసిరారు. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన స్పందిస్తూ గత ప్రభుత్వం రాజధాని ప్రకటన ఎప్పుడు చేసిందో చెప్పాలని సూచించగా.. 4–9–2014న ప్రకటించారని, నెల తర్వాత నవంబర్‌లో భూములు కొన్నట్లు పయ్యావుల పేర్కొన్నారు. ముందే భూములు కొన్న పయ్యావుల ‘రాజధానిపై టీడీపీ పెద్దలు తొలుత నాగార్జున వర్సిటీ ప్రాంతమని, తర్వాత నూజివీడు అని ప్రచారం చేయడంతో ఆయా చోట్ల చాలామంది సామాన్యులు భూములు కొన్నారు. టీడీపీ నేతలు మాత్రం తుళ్లూరు ప్రాంతంలో పనులు చక్క బెట్టుకున్నారు. వాస్తవానికి రాజధానికి నోటిఫికేషన్ ఇచ్చింది 2014, డిసెంబర్ 30న. పయ్యావుల కేశవ్ తన కుమార్తె హారిక పేరిట 2014 ఫిబ్రవరి 28న, కుమారుడు పయ్యావుల విక్రమ్‌సింహ పేరిట 13–10–2014న రెండెక రాలు, 03–11–2014న మరో రెండున్నర ఎకరా లు తుళ్లూరు ప్రాంతంలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ చివరిలో అక్కడ రాజధాని వస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటిం చింది’ అని బుగ్గన డాక్యుమెంట్ల నంబర్లతో సహా వెల్లడించడంతో పయ్యావుల కంగుతిన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ పేరుతోనూ కొనుగోలు రాజధాని ప్రకటన వెలువడటానికి (2014 డిసెంబర్ 30న) ముందే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్టు బుగ్గన రాజేంద్రనాథ్ నిరూపించారు. ‘ఈ సంస్థ పేరిట 07–07–2014న పెదకాకాని, కంతేరు, తాడికొండలో సర్వే నంబర్ 56లో ఎకరా 15 సెంట్లు (డాక్యుమెంట్ నం.5869), ఇదే తేదీన (డాక్యుమెంట్ నం.5866) మరో ఎకరా 11 సెంట్లు, తాడికొండలోని సర్వే నం.63/1లో 45 సెంట్లు (డాక్యుమెంట్ నం.5867), 8 సెప్టెంబర్ 2014న తాడికొండ సర్వే నం.56లో ఎకరా 11 సెంట్లు (డాక్యుమెంట్ నం.8024), ఇదే తేదీన సర్వే నం. 63/2బిలో ఎకరా 35 సెంట్లు (డాక్యుమెంట్ నం.8025), ఇక్కడే మరో ఎకరా 35 సెంట్లు (డాక్యుమెంట్ నం.8026), సర్వే నం.57లో 2.20 సెంట్లు (డాక్యుమెంట్ నం.8027).. ఇలా భారీగా భూములు హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో కొనుగోలు చేశారు’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ముందుగానే ఒప్పందం.. ‘రాజధాని ప్రకటన తేదీకి రెండు నెలలు ముందు, రెండు నెలల వెనుక భారీగా భూములు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన చేసింది 30 డిసెంబర్ 2014 (జీఓ ఎంఎస్ నం.254) కాగా, టీడీపీ నాయకులు మాత్రం అంతకుముందే స్థానిక రైతులతో ఒప్పదం చేసుకుని వేలాది ఎకరాలు కొన్నారు. ఇదంతా వారికి ముందే తెలిసి ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారమే, ఇన్నివేల ఎకరాలు రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు అయిపోవు. ఇదంతా ముందే ఒప్పందం చేసుకుని జరిగిన వ్యాపారం’ అని బుగ్గన తెలిపారు. -
తమ్ముళ్ల రియల్ దందా
తుని: నిబంధనలకు విరుద్ధంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్లు వేసి.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి ఎగనామం పెట్టారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కీలక నాయకుల ప్రమేయం ఉండడంతో అధికారులు మౌనం వహించారు. విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికను సహితం బుట్టదాఖలు చేశారు. ఇంత జరుగుతున్నా పారదర్శకతకు మారుపేరని చెప్పుకునే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తుని మండలం ఎస్.అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ దందాకు చివరకు ప్లాట్లు కొన్నవారు బలైపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి.. తుని పట్టణం నానాటికీ విస్తరిస్తోంది. చుట్టుపక్కల పల్లెలకు చెందిన అనేకమంది ఇక్కడకు వచ్చి ఇళ్లు నిర్మించుకొంటున్నారు. ఇదే అవకాశంగా రియల్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ఇక్కడ రియల్ దందా ప్రారంభించారు. మెట్ట ప్రాంతంలోని 300 ఎకరాల వ్యవసాయ భూమిలో 112 లే అవుట్లు వేశారు. నిబంధనల ప్రకారం లే అవుట్ వేసిన విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు కేటాయించాలి. అలాగే మార్కెట్ విలువలో 10 శాతం భూమి మార్పిడి ఫీజును రెవెన్యూ శాఖకు చెల్లించాలి. మొత్తం లే అవుట్లో 10 శాతం సామాజిక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి స్థానిక సంస్థలకు అప్పగించాలి. రోడ్లు, కాలువలు, తాగునీరు తదితర అవసరాలకు సంబంధించి డెవలప్మెంట్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి అనుమతులు పొందాలి. తరువాత మాత్రమే ప్లాట్ల విక్రయాలు జరపాల్సి ఉంది. కానీ బరితెగించిన రియల్టర్లు ఎటువంటి నిబంధనలూ పాటించకుండానే దర్జాగా ప్లాట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. పైగా మొత్తం 300 ఎకరాలకు సంబంధించిన లే అవుట్లలో ప్లాట్లతోపాటు అందులోని సామాజిక స్థలాలను కూడా బరితెగించి, నిబంధనలకు విరుద్ధంగా అమ్మేసినట్టు అధికారులు చెబుతున్నారు. టీడీపీ నాయకులు కావడంతో.. మూడేళ్ల క్రితం వుడా అధికారులు ఈ అనధికార లే అవుట్లను పరిశీలించారు. లే అవుట్లలో వేసిన రోడ్లను యంత్రాలతో ధ్వంసం చేశారు. ఆ ప్లాట్లను ఎవ్వరూ కొనుగోలు చేయరాదని బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ తరువాత విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంచాయతీ పరిధిలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును రియల్టర్లు ఎగవేశారని నివేదిక ఇచ్చారు. అనంతరం రూ.21 కోట్లు చెల్లించాలని సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. అలా నోటీసులు అందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఎక్కువ శాతం అధికార టీడీపీకి చెందిన నాయకులే ఉన్నారు. తరువాత ఏం రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ, మొదట్లో హడావుడి చేసిన అధికారులు చివరకు రియల్టర్ల నుంచి చిల్లిగవ్వ కూడా రికవరీ చేయలేకపోయారు. చివరకు ఇందులో ప్లాట్లు కొనుక్కొని మోసపోయిన బాధితులు రెవెన్యూ శాఖకు కన్వర్షన్ ఫీజులు, ఇతర నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఫీజులను జరిమానాలతో కలిపి వుడాకు చెల్లించాల్సి వస్తోంది. అప్పుడు మాత్రమే వారికి ఇళ్లు నిర్మించుకొనేందుకు అనుమతులు వస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. ప్లాటు కొని మోసపోయాను ఇల్లు కట్టుకుందామని అప్పు చేసి ఎస్.అన్నవరం లే అవుట్లో ప్లాటు కొన్నాను. అప్పట్లో అన్ని అనుమతులూ ఉన్నాయని వ్యాపారి చెప్పాడు. ఇల్లు కట్టుకోవడానికి ప్లాను కోసం దరఖాస్తు చేశాను. అనుమతి ఇవ్వబోమని అధికారులు చెప్పారు. ఎందుకని అడిగితే ఆ లే అవుట్‌కు అనుమతి లేదని, భూమి మార్పిడి ఫీజు కట్టలేదని చెప్పారు. కొన్న ప్లాటుకు రూ.2 లక్షలు అదనంగా చెల్లిస్తే ప్లాను ఇస్తామని చెబుతున్నారు. ఇంటి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. – కె.గోపి, వ్యాపారి, తుని 5 శాతమే చెల్లించారు ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలో లే అవుట్లు వేసి, భూమి మార్పిడి ఫీజు ఎగవేతకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చి మూడేళ్లవుతోంది. ఇప్పటివరకూ 5 శాతం మాత్రమే సొమ్ములు చెల్లించారు. దీంతో పంచాయతీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. – బి.వరప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి, పెద్దాపురం -
రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ దందా
-
రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ దందా
♦ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా భూ సమీకరణ ♦ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మండిపాటు సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని అమరావతి నిర్మాణం పేరిట ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా సాగిస్తోందని ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ధ్వజమెత్తారు. స్టార్ హోటళ్లు, గోల్ఫ్ కోర్టుల కోసమని రైతులను బెదిరించి వేలాది ఎకరాలు సమీకరిస్తోందని విమర్శించారు.గురువారం ఉదయం విజయవాడలోని రోటరీ ఆడిటోరియంలో గ్రీన్ సాలిడర్స్ స్వచ్ఛంద సంస్థ ‘పర్యావరణం – సారవంత భూముల పరిరక్షణ’అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి మోసపూరితంగానే వ్యవహరించిందన్నారు. రాజధాని ప్రతిపాదన ఒక చోటు నుంచి మరో చోటుకు కదులుతూ.. మొదట నూజివీడు.. తర్వాత గన్నవరం, మంగళగిరి.. ఆ తర్వాత అమరావతికి చేరిందన్నారు. అసలు రాజధానికి 33వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రాజధాని ప్రక్రియలో నన్ను దూరం పెట్టారు : రాజధాని ప్రక్రియలో అప్పటి ప్రభుత్వ సీఎస్‌గా ఉన్న నన్ను ప్రభుత్వం దూరం పెట్టింది. ప్రభుత్వ స్థలాల అన్వేషణ కోసం నన్ను సంప్రదించినప్పుడు దొనకొండను పరిపాలన నగరంగా ఏర్పాటుకు సూచించాను. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలను అభివృద్ధి చేసుకోవాలని నివేదించాను. ఆ సమయంలోనే శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి తొలుత నేను కన్వీనర్‌గా ఉంటారని చెప్పారు. నాలుగు రోజులకే సీఎస్‌గా బిజీగా ఉంటారు కాబట్టి నన్ను తొలగిస్తున్నట్లు తెలిపారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి రాజధానులను నిర్మిస్తేనే విజయవంతమవుతాయి. ‘మీరు సీఎస్‌గా ఉన్నారు.. అధికారం మీ చేతిలో ఉండింది.. ఆ రోజు మాట్లాడకుండా.. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు?’ అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలో పని చేసేటప్పుడు పరిమితులుంటాయి. అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అధికారికంగా ఏం చేసినా బయటకు చెప్పడానికి వీల్లేదు. రాజధాని విషయంలోనూ అదే జరిగింది. ఈ రోజు ఇలా మాట్లాడడానికి.. ఆ రోజు నేను చేసిన దానికి సంబంధం లేదు’’అని కృష్ణారావు వివరించారు.