
తుని: నిబంధనలకు విరుద్ధంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్లు వేసి.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి ఎగనామం పెట్టారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కీలక నాయకుల ప్రమేయం ఉండడంతో అధికారులు మౌనం వహించారు. విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికను సహితం బుట్టదాఖలు చేశారు. ఇంత జరుగుతున్నా పారదర్శకతకు మారుపేరని చెప్పుకునే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తుని మండలం ఎస్.అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ దందాకు చివరకు ప్లాట్లు కొన్నవారు బలైపోతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి..
తుని పట్టణం నానాటికీ విస్తరిస్తోంది. చుట్టుపక్కల పల్లెలకు చెందిన అనేకమంది ఇక్కడకు వచ్చి ఇళ్లు నిర్మించుకొంటున్నారు. ఇదే అవకాశంగా రియల్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ఇక్కడ రియల్ దందా ప్రారంభించారు. మెట్ట ప్రాంతంలోని 300 ఎకరాల వ్యవసాయ భూమిలో 112 లే అవుట్లు వేశారు. నిబంధనల ప్రకారం లే అవుట్ వేసిన విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు కేటాయించాలి. అలాగే మార్కెట్ విలువలో 10 శాతం భూమి మార్పిడి ఫీజును రెవెన్యూ శాఖకు చెల్లించాలి. మొత్తం లే అవుట్‌లో 10 శాతం సామాజిక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి స్థానిక సంస్థలకు అప్పగించాలి.
రోడ్లు, కాలువలు, తాగునీరు తదితర అవసరాలకు సంబంధించి డెవలప్‌మెంట్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి అనుమతులు పొందాలి. తరువాత మాత్రమే ప్లాట్ల విక్రయాలు జరపాల్సి ఉంది. కానీ బరితెగించిన రియల్టర్లు ఎటువంటి నిబంధనలూ పాటించకుండానే దర్జాగా ప్లాట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. పైగా మొత్తం 300 ఎకరాలకు సంబంధించిన లే అవుట్లలో ప్లాట్లతోపాటు అందులోని సామాజిక స్థలాలను కూడా బరితెగించి, నిబంధనలకు విరుద్ధంగా అమ్మేసినట్టు అధికారులు చెబుతున్నారు.
టీడీపీ నాయకులు కావడంతో..
మూడేళ్ల క్రితం వుడా అధికారులు ఈ అనధికార లే అవుట్లను పరిశీలించారు. లే అవుట్లలో వేసిన రోడ్లను యంత్రాలతో ధ్వంసం చేశారు. ఆ ప్లాట్లను ఎవ్వరూ కొనుగోలు చేయరాదని బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ తరువాత విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పంచాయతీ పరిధిలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును రియల్టర్లు ఎగవేశారని నివేదిక ఇచ్చారు. అనంతరం రూ.21 కోట్లు చెల్లించాలని సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు.
అలా నోటీసులు అందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఎక్కువ శాతం అధికార టీడీపీకి చెందిన నాయకులే ఉన్నారు. తరువాత ఏం రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ, మొదట్లో హడావుడి చేసిన అధికారులు చివరకు రియల్టర్ల నుంచి చిల్లిగవ్వ కూడా రికవరీ చేయలేకపోయారు. చివరకు ఇందులో ప్లాట్లు కొనుక్కొని మోసపోయిన బాధితులు రెవెన్యూ శాఖకు కన్వర్షన్ ఫీజులు, ఇతర నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఫీజులను జరిమానాలతో కలిపి వుడాకు చెల్లించాల్సి వస్తోంది. అప్పుడు మాత్రమే వారికి ఇళ్లు నిర్మించుకొనేందుకు అనుమతులు వస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు.
ప్లాటు కొని మోసపోయాను
ఇల్లు కట్టుకుందామని అప్పు చేసి ఎస్.అన్నవరం లే అవుట్‌లో ప్లాటు కొన్నాను. అప్పట్లో అన్ని అనుమతులూ ఉన్నాయని వ్యాపారి చెప్పాడు. ఇల్లు కట్టుకోవడానికి ప్లాను కోసం దరఖాస్తు చేశాను. అనుమతి ఇవ్వబోమని అధికారులు చెప్పారు. ఎందుకని అడిగితే ఆ లే అవుట్‌కు అనుమతి లేదని, భూమి మార్పిడి ఫీజు కట్టలేదని చెప్పారు. కొన్న ప్లాటుకు రూ.2 లక్షలు అదనంగా చెల్లిస్తే ప్లాను ఇస్తామని చెబుతున్నారు. ఇంటి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది.
– కె.గోపి, వ్యాపారి, తుని
5 శాతమే చెల్లించారు
ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలో లే అవుట్లు వేసి, భూమి మార్పిడి ఫీజు ఎగవేతకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చి మూడేళ్లవుతోంది. ఇప్పటివరకూ 5 శాతం మాత్రమే సొమ్ములు చెల్లించారు. దీంతో పంచాయతీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాం.
– బి.వరప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి, పెద్దాపురం
Comments
Please login to add a commentAdd a comment