సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో జరిగిన అక్రమాలు, టీడీపీ నాయకుల రియల్ ఎస్టేట్ దందాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయి. రాజధాని ఎక్కడనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకముందే ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం ద్వారా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పాల్పడినట్లు తేటతెల్లమైంది. పయ్యావుల కుటుంబ సభ్యుల పేరుతో ఎక్కడెక్కడ భూములు కొన్నారో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చిట్టా బయటపెట్టారు.
తప్పేముంది.. స్వాధీనం చేసుకోండి!
అసెంబ్లీలో గురువారం అమరావతి భూముల కొనుగోళ్లపై చర్చ సందర్భంగా తాను రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు కొనుగోలు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పయ్యావుల తొలుత ఖండించారు. ‘రాజధానిని ప్రకటించాక భూములు కొన్నాం.. తప్పేముంది?’ అంటూ ప్రశ్నించారు. చట్ట విరుద్ధంగా భూములను కొనుగోలు చేస్తే కేంద్రం తెచ్చిన బినామీ ఆస్తుల స్వాధీనం చట్టం ప్రకారం తన భూములు తీసేసుకోవాలంటూ సవాల్ విసిరారు. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన స్పందిస్తూ గత ప్రభుత్వం రాజధాని ప్రకటన ఎప్పుడు చేసిందో చెప్పాలని సూచించగా.. 4–9–2014న ప్రకటించారని, నెల తర్వాత నవంబర్‌లో భూములు కొన్నట్లు పయ్యావుల పేర్కొన్నారు.
ముందే భూములు కొన్న పయ్యావుల
‘రాజధానిపై టీడీపీ పెద్దలు తొలుత నాగార్జున వర్సిటీ ప్రాంతమని, తర్వాత నూజివీడు అని ప్రచారం చేయడంతో ఆయా చోట్ల చాలామంది సామాన్యులు భూములు కొన్నారు. టీడీపీ నేతలు మాత్రం తుళ్లూరు ప్రాంతంలో పనులు చక్క బెట్టుకున్నారు. వాస్తవానికి రాజధానికి నోటిఫికేషన్ ఇచ్చింది 2014, డిసెంబర్ 30న. పయ్యావుల కేశవ్ తన కుమార్తె హారిక పేరిట 2014 ఫిబ్రవరి 28న, కుమారుడు పయ్యావుల విక్రమ్‌సింహ పేరిట 13–10–2014న రెండెక రాలు, 03–11–2014న మరో రెండున్నర ఎకరా లు తుళ్లూరు ప్రాంతంలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ చివరిలో అక్కడ రాజధాని వస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటిం చింది’ అని బుగ్గన డాక్యుమెంట్ల నంబర్లతో సహా వెల్లడించడంతో పయ్యావుల కంగుతిన్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ పేరుతోనూ కొనుగోలు
రాజధాని ప్రకటన వెలువడటానికి (2014 డిసెంబర్ 30న) ముందే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్టు బుగ్గన రాజేంద్రనాథ్ నిరూపించారు. ‘ఈ సంస్థ పేరిట 07–07–2014న పెదకాకాని, కంతేరు, తాడికొండలో సర్వే నంబర్ 56లో ఎకరా 15 సెంట్లు (డాక్యుమెంట్ నం.5869), ఇదే తేదీన (డాక్యుమెంట్ నం.5866) మరో ఎకరా 11 సెంట్లు, తాడికొండలోని సర్వే నం.63/1లో 45 సెంట్లు (డాక్యుమెంట్ నం.5867), 8 సెప్టెంబర్ 2014న తాడికొండ సర్వే నం.56లో ఎకరా 11 సెంట్లు (డాక్యుమెంట్ నం.8024), ఇదే తేదీన సర్వే నం. 63/2బిలో ఎకరా 35 సెంట్లు (డాక్యుమెంట్ నం.8025), ఇక్కడే మరో ఎకరా 35 సెంట్లు (డాక్యుమెంట్ నం.8026), సర్వే నం.57లో 2.20 సెంట్లు (డాక్యుమెంట్ నం.8027).. ఇలా భారీగా భూములు హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో కొనుగోలు చేశారు’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
ముందుగానే ఒప్పందం..
‘రాజధాని ప్రకటన తేదీకి రెండు నెలలు ముందు, రెండు నెలల వెనుక భారీగా భూములు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన చేసింది 30 డిసెంబర్ 2014 (జీఓ ఎంఎస్ నం.254) కాగా, టీడీపీ నాయకులు మాత్రం అంతకుముందే స్థానిక రైతులతో ఒప్పదం చేసుకుని వేలాది ఎకరాలు కొన్నారు. ఇదంతా వారికి ముందే తెలిసి ఇన్‌సైడ్ ట్రేడింగ్ ద్వారా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారమే, ఇన్నివేల ఎకరాలు రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు అయిపోవు. ఇదంతా ముందే ఒప్పందం చేసుకుని జరిగిన వ్యాపారం’ అని బుగ్గన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment