ముంబైలో 11 చోట్ల ఉగ్రదాడులకు ఇండియన్ ముజాహిదీన్ రెక్కీ
ఇండియన్ ముజాహిదీన్.. ఈ పేరు వింటే చాలు ముంబై ఉగ్రదాడులు కళ్ల ముందు కదలాడతాయి. అలాంటి ఉగ్రవాద సంస్థ గత నెలలో ముంబై మహానగరంలో 11 చోట్ల మళ్లీ ఉగ్రదాడులు చేసేందుకు రెక్కీ నిర్వహించింది!! ఈ విషయాన్ని ఇటీవలే అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసీన్ భత్కల్ వెల్లడించాడు. దాంతో మహారాష్ట్ర పోలీసులు ముంబైలో ఒక్కసారిగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ రాకేష్ మారియా సంతకం చేసిన ఓ రహస్య నివేదికలోని విషయాలు వెల్లడయ్యాయి. ఆగస్టు మొదటివారంలో నాలుగు సైనేజిలు సహా మొత్తం 11 ప్రాంతాల్లో వీళ్లు రెక్కీలు చేసిన విషయం ఆ నివేదికలో ఉంది.
భత్కల్‌తో పాటు అతడి సహచరుడు అసదుల్లా అఖ్తర్‌ను నిఘా సంస్థలు విచారించినప్పుడు వాళ్లు ఈ వివరాలు వెల్లడించారు. ముంబై పోలీసు కమిషనరేట్, జవేరీ బజార్, కల్బాదేవి, మంగళ్‌దాస్ మార్కెట్, లోహార్ చాల్, క్రాఫోర్డ్ మార్కెట్, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, ముంబై సెంట్రల్ బస్ డిపో, ముంబాదేవీ ఆలయం, నాగ్‌పడ ప్రాంతంలో ఏటీఎస్ ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న మాగెన్ డేవిడ్ సైనేజి, అగ్రిపడ ప్రాంతంలోని హసిదిమ్ సైనేజి, డోంగ్రీలోని షేర్ రాసన్ సైనేజి, పైధోని ప్రాంతంలోని హరహమీమ్ సైనేజి... ఈ అన్ని ప్రాంతాల మీద దాడులు చేయాలని వారు తలపెట్టి రెక్కీలు చేశారు.