ఢోక్లా క్వీన్
ఢోక్లాతో మొదలుపెట్టి ఖాండ్వి, భేల్పురి, సేవ్‌పురి, ఘుగ్రా వంటి గుజరాత్ సంప్రదాయ వంటకాలన్నింటినీ ఇష్టపడి, వాటికి అలవాటు పడిన ముంబై మహానగరం నేటికీ నీలా మెహతాను తలచుకుంటూనే ఉంది. ముంబైలో ఢోక్లా క్వీన్‌గా, మిగతా ప్రపంచానికి భేల్ క్వీన్‌గా ప్రసిద్ధురాలైన ఈ గుజరాతీ గృహిణి.. స్నాక్స్ వ్యాపారంలో ఒక ట్రెండ్‌ను సృష్టించి వెళ్లారు.
అది 1974. నీలా మెహతా అనే యువతి పెళ్లి చేసుకుని గుజరాత్‌లోని బారుచ్ నుంచి ముంబైకి వచ్చింది. అప్పటి గృహిణులకు తెలిసింది.. భర్త, పిల్లలకు వండి పెట్టుకుంటూ, ఇంటిని చక్క దిద్దుకుంటూ గడపడమే. అయితే ముంబై మహానగరంలో ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవదని అర్థమైందామెకి. తనకు ఇష్టమైన ఎంబ్రాయిడరీ చేసింది. చీర మీద సన్నని అందమైన ఎంబ్రాయిడరీ చేయడానికి నెల రోజులు పట్టేది. నెల రోజులపాటు పడిన శ్రమకు వచ్చిన డబ్బు సంతృప్తినిచ్చేది కాదు. అప్పుడే ఒక కొత్త అడుగు వేశారు నీలా మెహతా. తనకు చెయ్యి తిరిగిన గుజరాత్ వంటకాలను ముంబైవాసులకు రుచి చూపించారు. ‘ఢోక్లా’ పేరు వినడమే కానీ దాని రుచితో పరిచయం లేని ముంబై వాళ్లు లొట్టలేసుకుని తిన్నారు.
ఢోక్లాతో పరిచయం ఉండి, ఉద్యోగరీత్యా ముంబయిలో స్థిరపడిన వాళ్లు నీలా మెహతా చేతి ఢోక్లా తిని సొంతూరికి వెళ్లి వచ్చిన అనుభూతికి లోనయ్యారు. ఢోక్లాతో మొదలు పెట్టి ఖాండ్వి, భేల్పురి, సేవ్‌పురి, ఘుగ్రా వంటి గుజరాత్ సంప్రదాయ వంటకాలన్నింటినీ ఇష్టపడడం ముంబై వాళ్లకు అలవాటై పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ముంబై నగరం నీలా చేతి వంటకు దాసోహం అయింది. ఇందుకోసం నీలా మెహతా పెద్ద పెట్టుబడి పెట్టిందేమీ లేదు. తాను నివసిస్తున్న ఇంటి వంట గదిలో తనకు చేతనైన వంటకాలను చేయడం, వాటిని డోర్ డెలివరీ చేయడం. ఇక్కడ ఆమె ప్రవేశ పెట్టిన డోర్ డెలివరీ మార్కెటింగ్ టిప్... ఆమెకు అతి కొద్ది సమయంలోనే ‘ఢోక్లా’ క్వీన్ బిరుదును తెచ్చి పెట్టింది.
రంగుల ప్రయోగం
వ్యాపార రంగంలో ఒకరు ఒక కొత్త ఐడియాతో వచ్చిన తర్వాత వారి అడుగుజాడల్లో నడవడానికి మరెంత మందో సిద్ధంగా ఉంటారు. నీలా మెహతా ఐడియా సక్సెస్ కావడంతో మగవాళ్లు కూడా తమ రాష్ట్రాల సంప్రదాయ వంటల వ్యాపారంలోకి వచ్చేశారు. అప్పుడు నీలా మెహతా తన హోమ్ఫుడ్లో ప్రయోగాలు మొదలు పెట్టారు. స్వాతంత్య్రోద్యమం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో మూడు రంగుల ఢోక్లాను ప్రవేశపెట్టారు. ఒక వరుస శనగపిండితో చేసిన పసుపు రంగు ఢోక్లా, మరో వరుసలో బియ్యం గోధుమ పిండితో చేసిన తెల్లటి ఢోక్లా, వాటి మధ్యలో పుదీనా వంటి ఆకుపచ్చ రంగు చట్నీతో ‘తిరంగి ఢోక్లా’ను రుచి చూపించారు. ఢోక్లా వడ్డించడం ఓల్డ్ ఫ్యాషన్ అని శాండ్‌విచ్‌లతో ఆతిథ్యం ఇచ్చే సంపన్న కుటుంబాలు కూడా తమ ఇళ్లలోని వేడుకలకు ఈ తిరంగి ఢోక్లా కోసం నీలా మెహతాకు ఆర్డర్ ఇవ్వడం మొదలైంది. పెళ్లి సీమంతం వంటి వేడుకలకు ఐదురంగులతో ‘పంచరంగ్’ ఢోక్లా చేశారు నీలా మెహతా.
‘ఎంటర్ప్రెన్యూర్ అనే పదం మహిళాలోకానికి చెందినది కాదు, ఆ రంగంలో పేటెంట్ రైట్స్ అన్నీ పురుష ప్రపంచానివే’ అని సమాజం పరిధులు విధించుకున్న రోజుల్లో.. మహిళలను ఎంటర్ప్రెన్యూర్ అయిన మగవాళ్ల దగ్గర పీఏ ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేసిన సమాజంలో... నీలా మెహతా ఒక ట్రెండ్‌ను సెట్ చేశారు. ‘ఒక మహిళ ఒక పరిశ్రమ నడిపిస్తోందంటే.. అది ఆమెకు తండ్రి లేదా భర్త నుంచి వారసత్వంగా వచ్చిన పరిశ్రమను నడిపించడం లేదా అంతటి సంపన్న కుటుంబాల నుంచి కొత్త ఆలోచనలతో వచ్చిన మహిళలకు మాత్రమే సాధ్యం... అంతే తప్ప మామూలు మహిళలకు అది అసాధ్యం’ అనే భావనను కూడా తుడిచి పెట్టేశారు నీలా మెహతా.
బజాజ్ వాళ్లింటి పెళ్లి
ఉమెన్ అసోసియేషన్ సమావేశానికి ఇరవై ఢోక్లా పార్సిళ్లు ఇవ్వడంతో పడిన నీలా తొలి అడుగు... రోజుకు అరవై నుంచి డెబ్బై కిలోల ఢోక్లా ఆర్డర్లు అందించే స్థాయికి చేరింది. ఈ ప్రయాణంలో ఆమెను తీవ్రమైన ఉత్కంఠకు గురి చేసిన సంఘటన బజాజ్ కుటుంబంలో పెళ్లి. ‘‘ఆ పెళ్లికి పదహారు వందల కిలోల ఢోక్లా ఆర్డర్ వచ్చింది. దినుసులన్నీ సమకూర్చుకున్నాం, అదనంగా పని వాళ్లను కూడా పిలుచుకున్నాం. హఠాత్తుగా నీళ్లు బంద్. వాటర్ ట్యాంకర్ల కోసం పరుగులు పెట్టాం. వంట చేయడం కంటే నీళ్ల ట్యాంకర్లు సమకూర్చుకోవడమే పెద్ద సవాల్ అయింది. రెండు రోజుల పాటు ఇంట్లో వాళ్లకు, పని వాళ్లకు తిండి, నిద్ర లేవు.
మొత్తం అందిచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాం’’ అని చెప్పారు నీలా మెహతా కొడుకు ప్రతీక్.చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసిన ప్రతీక్ తర్వాత తల్లికి సహాయంగా ఆమె వ్యాపారంలోనే స్థిరపడ్డారు. ‘‘ఢోక్లా క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మకు నిల్వ ఉండే భేల్ వంటి పదార్థాలను కూడా చేర్చమని సలహా ఇచ్చాం. వాటిని ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, యూఎస్, యూకేలకు ఎగుమతి చేసింది అమ్మ. ముంబై వాళ్లు ఢోక్లా క్వీన్‌ని చేశారు, అమ్మ చేతి భేల్ రుచి చూసిన బయటి నగరాల వాళ్లు ఆమెను ‘భేల్ క్వీన్’అని ప్రశంసించారు’’ అని చెప్పారు ప్రతీక్ మెహతా. 83 ఏళ్ల నీలా మెహతా పోయిన మంగళవారం అక్టోబర్ 15వ తేదీన తుది శ్వాస వదిలారు. ముంబై నేటికీ ఆమెను తలచుకుంటూనే ఉంది.