టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
ధారూరు, న్యూస్‌లైన్: తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ను గెలిపించాలని, కలల తెలంగాణ పునర్నిర్మాణం ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమని ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ధారూరులో త్రీడీ షో ద్వారా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాదాపు 40 నిమిషాల త్రీడీ షోలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని పలు అంశాలను ప్రస్తావించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తప్పకుండా అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల్లోని దద్దమ్మలతో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానరాని కాంగ్రెస్ నాయకులు తెలంగాణను ఎలా ఉద్దరిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాకుండా అన్నివిధాలా అడ్డుపడిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా కుట్ర పన్నుతున్నారని, తెలంగాణను ఎదగకుండా చూసేందుకు కుయుక్తులు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. బీజేపీతో టీడీపీ బలవంతంగా పొత్తు పెట్టుకుని తెలంగాణలో డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు.
బంగారు తెలంగాణ కోసం ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అంతకు ముందు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంజీవరావులు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చెర్మైన్ రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శుభప్రద్ పటేల్, సిరాజుద్దీన్, సంతోష్‌కుమార్, రాంరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, యాదయ్య, యూనూస్, అంజయ్య, మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.