గబ్బు మాటలెందుకు?.. ‘దిబ్బలు’ సేఫ్
సాక్షి, విశాఖపట్నం: తాను చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పు అనడం చంద్రబాబుకు రివాజు. చంద్రబాబు పాడే ప్రతి పాటకు డ్యాన్స్ చేయడం పవన్ అలవాటు. ఇదే విధానాన్ని విశాఖలోని ఎర్రమట్టి దిబ్బల పైనా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఇదే తప్పాట ఆడుతున్నారు. భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలకు ప్రస్తుతం, భవిష్యత్తులోనూ ఎటువంటి నష్టం కలగకుండా, రక్షణగా బఫర్ జోన్ పెట్టి, వాటికి దూరంగా అభివృద్ధి పనులు చేపట్టడం వీరిద్దరికీ కంటగింపుగా మారింది.
ఎర్రమట్టి దిబ్బలకు నష్టం జరిగిపోతోందంటూ ఇద్దరూ వీరంగాలు వేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న కొత్తవలసలో భూసమీకరణ చేపట్టిందే చంద్రబాబు సర్కారు. ఆ విషయాన్ని దాచిపెట్టి, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఎర్రమట్టి దిబ్బలకు నష్టం చేస్తున్నారంటూ నీచ రాజకీయాలకు ఒడిగట్టారు. దశాబ్దాలుగా జీడితోటలు సాగు చేసుకుంటూ 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి డీ–పట్టాలు పొందిన రైతుల భూములనే ప్రభుత్వం సమీకరించింది.
ఈ భూములు ఎర్రమట్టి దిబ్బలైతే వాటికి డీ–పట్టాల్ని ప్రభుత్వం ఎలా ఇస్తుందన్న కనీస అవగాహన టీడీపీ నేతలకు, పవన్‌కు లేదు. వీరి తీరును టీడీపీకి చెందిన రైతులే ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రభుత్వం మంచి పరిహారం ఇస్తోందని, అది రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బఫర్ జోన్ ఆవలే అభివృద్ధి
సర్వే నం.49లో నేరెళ్లవలస గ్రామం ఉంది. సర్వే నం.49/1లో మొత్తం 1067 ఎకరాలు ఉంది. ఇందులో 525 ఎకరాల్లో ఐఎన్ఎస్ కళింగ విస్తరించి ఉంది. మరో 287 ఎకరాలు ఓ బిల్డింగ్ సొసైటీకి చెందినవి. ఈ రెండింటి మధ్యలో ఎర్ర మట్టి దిబ్బలు విస్తరించి ఉన్న 262.92 ఎకరాలను జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. నేరెళ్లవలసను ఆనుకొనే ఉన్న కొత్తవలస గ్రామం సర్వే నం 75, 86, 87లో సుమారు 80 ఎకరాల్లో 80 ఏళ్లుగా రైతులు జీడితోటలు, తాటిచెట్లు పెంచుకుంటూ జీవిస్తున్నారు. వీరికి 1982లో అప్పటి ప్రభుత్వం డీ–పట్టాలిచ్చింది.
ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం అభివృద్ధి జరుగుతోంది. ఇందు కోసం సర్వే నంబర్ 86ని ప్రభుత్వం సబ్ డివిజన్ చేసింది. 86/3ని ఎర్రమట్టి దిబ్బల రక్షణ కోసం బఫర్ జోన్‌గా ఏర్పాటు చేసింది. 148 అడుగుల మేర ఉన్న ఈ బఫర్ జోన్‌కు అవతల అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి, ఎర్రమట్టి దిబ్బలకు ఎలాంటి సంబంధం లేదు. ఎర్రమట్టి దిబ్బలకు ఎటువంటి నష్టం కలిగించడంలేదన్నది 100 శాతం వాస్తవం.
2016లోనే జీవో ఇచ్చిన టీడీపీ..
టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా వుడా (ప్రస్తుతం వీఎంఆర్డీఏ) ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల కోసం 2016 నవంబర్ 25న జీవో ఎంఎస్ నం.304ని జారీ చేసింది. తొలుత పెందుర్తి మండలం సౌభాగ్య రాయపురంలో 128.94 ఎకరాలు, దబ్బందలో 114.23 ఎకరాలు, కొమ్మాదిలో 116.64 ఎకరాలి్న, ఆ తర్వాత నేరెళ్లవలసలో సర్వే నం.49/1పీలో 114.34 ఎకరాల అసైన్డ్ భూములు, గండిగుండంలో 69 ఎకరాలు లాండ్ పూలింగ్‌కు ఉత్తర్వులిచ్చింది.
ఆ తర్వాత కొత్తవలసలోని సర్వే నం.75లో భూముల వివరాలు కోరింది. అప్పటి వుడా ప్రత్యేక తహశీల్దార్ సర్వే నం.75, 85, 86లో ఉన్న అసైన్డ్ భూములు, సరిహద్దులతో నోట్ పంపారు. వీటిని పూలింగ్‌లోకి తెచ్చింది. ఇలా భూ సమీకరణ కీలక ప్రక్రియ మొత్తం టీడీపీ హయాంలోనే జరిగింది. ఇప్పుడు అవే భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే టీడీపీ, పవన్ గగ్గోలు పెడుతున్నారు.
టీడీపీకి చెందిన రైతు ఏమంటున్నారంటే..
ఎర్రమట్టి దిబ్బల విధ్వంసమంటూ టీడీపీ, జనసేన చేస్తున్న ఆందోళనల్ని టీడీపీకి చెందిన రైతులే ఖండిస్తున్నారు. అసలు ఈ ప్రక్రియ మొత్తం టీడీపీ హాయాంలో జరిగితే.. ఏదో కొత్తగా చేస్తున్నట్లు మాట్లాడటంపై టీడీపీకి చెందిన పాసి నర్సింగరావు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘మా టీడీపీ హయాంలోనే దీనిపై జీవో వచ్చింది. అప్పుడే మేము పూలింగ్‌కి భూములు ఇచ్చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మాకు కొత్తవలస దగ్గర 5 ఎకరాలు ఉంది. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం మా పేరుతో డీ–పట్టాలిచ్చింది.
రైతులంతా కూర్చొని పూలింగ్‌లో భూములిస్తే ఎంత పరిహారం అడగాలో మాట్లాడుకున్నాం. గ్రామ సభలకు రైతులందరం హాజరయ్యాం. అందరికీ మంచి పరిహారం ఇస్తామన్నారు. అప్పట్లో ప్రక్రియ ఆలస్యమైంది. దాని ప్రకారమే పరిహారం ఇస్తున్నారు. ఇదంతా అప్పుడే జరిగింది. ఇప్పుడు పవన్ వచ్చి విధ్వంసం చేస్తున్నారని మాట్లాడటం సరికాదు’ అని అన్నారు.