పైసా వచ్చింది లేదు!
Published Sat, Oct 29 2016 4:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
వేల ఎకరాల్లో ఎర్రమట్టి క్వారీలు
గ్రామ పంచాయతీలకు దక్కని ప్రయోజనం
మైనర్ మినరల్స్‌గా గుర్తిస్తే ఆదాయం సమకూరే అవకాశం
సర్కారు స్పందిస్తే ఉపాధికి ఊతం
కోట్లాది రూపాయల విలువైన సహజ సంపదను తన భూగర్భంలో దాచుకున్న గ్రామాల పరిస్థితి ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా మారింది. ఉన్న వనరులతో ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోవాల్సిన ఆ పంచాయతీలు.. పైసా రాకట లేక కనీస మౌలిక సదుపాయాల్లో అట్టడుగున ఉన్నాయి.
ములుగు : ములుగు మండలం మల్లంపల్లి, శ్రీనగర్, రామచంద్రాపురం, కొడిశలకుంట ప్రాంతాలలో వేలాది ఎకరాలలో ఎర్రమట్టి క్వారీలు విస్తరించి ఉన్నాయి. అధికారికంగా 739 ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. మరో వందలాది హెక్టార్లలో అతి విలువైన విలువైన ఖనిజ సంపద అందుబాటులో ఉంది. సుమారు 31 ఎర్రమట్టి క్వారీలు నడుస్తున్నా యి. ఇక్కడి నుంచి డోలమైట్, బాక్సైట్, లాటరైట్, ఐరన్ ఓర్ వంటి ముడి సరుకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర్టతో పాటు ఇతర ప్రాంతాలకు చేరుతోంది. ఇతర రాష్ట్రాల పరిశ్రమలకు ఆదా యం సమకూర్చి పెడుతున్న ఎర్రమట్టి నిల్వలు స్థానికంగా మాత్రం ఎలాంటి లాభాలు ఇవ్వడం లేదు.
మల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పలు రకాల పన్నులతో సంవత్సరానికి వచ్చే ఆదాయం వేగంగా పెరుగుతున్నా పట్టణాభివృద్ధికి నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఈ సమయంలో ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మేర అంది నా పట్టణ పురోగతికి దోహదపడుతుందని ప్రజలు సూచిస్తున్నారు. పైగా మైనర్ మినరల్స్‌గా గుర్తింపు రావడం వల్ల మం డల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ, రాష్ట్రానికీ ఆదాయం వచ్చి చేరుతుంది.
పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి
ఇక్కడ దొరికే ముడి సరుకు ప్రధానంగా సిమెంట్ తయారీలో ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి స్థానికంగా సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. సిమెంట్ పరిశ్రమల ఏర్పాటు కావలసిన ప్రభుత్వ భూములు జాకారం ప్రాంతంలో ఉన్నాయి. బొగ్గు భూపాలపల్లి సింగరేణిలో అందుబాటులో ఉంది. ప్రధానమైన నీటి వనరు తలాపున ఉన్న గోదావరిపై నిర్మించిన దేవాదుల పైప్‌లైన్ ద్వారా అందుకోవచ్చు. ఇక సిమెంట్ తరలింపుకు జాతీయ రహదారి 365, 369లకు మల్లంపల్లి కేంద్రంగా ఉంది. ఇటీవల పూర్తయిన ముల్లకట్ట బ్రిడ్జి ద్వారా ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు పెరిగాయి.
ప్రభుత్వం చొరవ చూపితేనే..
ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని కొన్ని రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ఈ క్రమంలో ములుగు అభివృద్ధికి పాటుపడి ఉంటామని, ములుగు ఏజెన్సీని అభివృద్ధి చేస్తామని పరోక్షంగా సూచనలు ఇచ్చింది. అయితే మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలను మైనర్ ఇరిగేషన్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తేగలిగితే తద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గ్రామపంచాయతీకి ఉపయోగపడుతుంది. ఇదే విషయమై స్థానిక అధికారులు, గ్రామస్తులు పలు మార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
జౌత్సాహికులను ప్రొత్సహించాలి
సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలోని ఔత్సాహిక వ్యాపారులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టే వ్యాపారులకు ఆశించిన రాయితీలు అందించి ఆహ్వానించాలి. అన్ని సౌకర్యాలు కల్పించి వ్యాపార పరంగా ములుగుకు ప్రత్యేక స్థానం కల్పించాలని యువత కోరుతున్నది. ములుగు అభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉండాలని కోరుతున్నారు.
మైనర్ మినరల్స్‌గా గుర్తించాలి
మల్లంపల్లితో పాటు రాంచంద్రాపురం, శ్రీనగర్ గ్రామపంచాయతీల పరిధిలో ఎర్రమట్టి క్వారీలు విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వం మైనర్ మినలర్స్‌గా గుర్తించినట్లయితే మూడు గ్రామపంచాయతీలకు తగిన ఆదాయం చేకూరుతుంది. తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి మార్గం సుగమం అవుతుంది.
– గోల్కొండ రవి, సర్పంచ్
Advertisement
Advertisement