విద్యుత్ ఫోరంతో సమస్యల పరిష్కారం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ ఫోరంను అందుబాటులోకి తీసుకువచ్చామని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కన్సూ్యమర్ గ్రీవెన్సెస్ రిడ్రసల్ ఫోరమ్ చైర్పర్సన్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డి.ధర్మారావు అన్నా రు. శనివారం స్థానిక డీఈఈ కార్యాలయంలో విద్యుత్ విని యోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పలు సమస్యలపై ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ధర్మారావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చే అంతరాయాలు, హెచ్చుతగ్గులు, మీటరు, బిల్లింగ్‌లో సమస్యలు, కొత్త సర్వీసులు ఇవ్వడానికి నిరాకరణ, ఇతర సమస్యలను ఫోరం తక్షణమే పరిష్కరిస్తుందన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1912ను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతేడాది సెప్టెంబర్ 2 నుంచి ఇప్పటివరకు 201 కేసుల విషయంలో తీర్పులు చెప్పామన్నారు. బిల్లింగ్‌లో 112, మీటరు సమస్యలు 8, లోవోల్టేజీ సమస్యలు 10, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. ఫోరం ఏర్పాటుతో 5 జిల్లాల్లోనూ ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. అధికారులు కె.బాలాజీ, పీవీ రమణరావు, బాలాజీ ప్రసాద్ పాండే, డీఈఈ ఎస్.జనార్దన్‌రావు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.