ఎర్రచందనం దుంగలు పట్టివేత
చెన్నేకొత్తపల్లి : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల్ని చెన్నేకొత్తపల్లి పోలీసులు వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రామగిరి సీఐ యుగంధర్, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ మహమ్మద్రఫీ గురువారం చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరించారు. గత 15 తేదీన ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా తక్కిన వారు (తమిళనాడుకు చెందిన శివశక్తినాన్, కన్నన్కుమార్,గౌడమణి, బెంగళూరుకు చెందిన మహేంద్ర) పరారయ్యారన్నారు.
తిరిగి బుధవారం ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో నాగసముద్రం గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఓ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో దాన్ని వెంబడించామన్నారు. అయితే దుండగులు చెన్నేకొత్తపల్లి సమీపంలో వాహనాన్ని ఆపి పరరయ్యారని, దీంతో వాహనంలో ఉన్న నాలుగు ఎర్రచందనం దుంగల్ని వాహనంతో సహా (దాదాపు రూ.1లక్ష)స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన నిందితుల్ని విచారించి కోర్టులో ధర్మవరం కోర్టుకు హాజరు పరచినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.