గణనీయంగా తగ్గిన సాగర్ జలాలు
కురిచేడు, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ కాలువ ద్వారా జిల్లాకు సరఫరా అయ్యే జలాలు గణనీయంగా తగ్గాయి. కాలువకు నీరు విడుదల చేసి నాలుగు నెలలైనా ఇంత వరకు జిల్లాకు రావాల్సిన పరిమాణంలో నీరు విడుదల చేసిన దాఖలాలు లేవు. ఎన్ఎస్పీ అధికారులు ఇష్టం వచ్చినట్లు నీటి పరిమాణం తగ్గించి సరఫరా చేస్తున్నా..జిల్లా స్థాయి అధికారులు కానీ, నాయకులు కానీ జిల్లాకు రావాల్సిన నీటి వాటాను తెప్పించడంలో విఫలమయ్యారు. అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారు.
గుంటూరు జిల్లా నాయకులు, అధికారులు కాలువలపై పర్యటించి నీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూసుకుంటున్నారు. కానీ మన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో జిల్లాలో ప్రధాన కాలువ, బ్రాంచి కాలువ పరిధిలోని మేజర్లకు నీరు ఎక్కడం లేదు. వాటి పరిధిలోని పంటలు ప్రస్తుతం పొట్ట, కంకి దశలో ఉన్నాయి. ఈ తరుణంలో నీటి అవసరం చాలా ఉంది. కానీ నీటి సరఫరా నానాటికీ తగ్గిపోతోంది.
జిల్లా సరిహద్దు 85/3 మైలువద్ద 3350 క్యూసెక్కులు నీరు విడుదలవాల్సి ఉండగా శనివారం 1130 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేశారు. దీంతో ఆదివారం జిల్లాకు రావాల్సిన నీటి మట్టం కాలువల్లో పూర్తిగా పడిపోయింది. దర్శి బ్రాంచి కాలువ హెడ్‌రెగ్యులేటరు కురిచేడు వద్ద 2828 క్యూసెక్కులు రావాల్సి ఉండగా ఆదివారం 1128 క్యూసెక్కులు మాత్రమే రావడం ఎన్ఎస్పీ అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది.