దర్యాప్తును మేమే పర్యవేక్షిస్తాం
ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు స్పష్టీకరణ
⇒ ఆరు మృతదేహాలకు రీ పోస్టుమార్టంపై నేడు నిర్ణయం
⇒ ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు చేస్తున్నామన్న ప్రభుత్వం
⇒ సిట్‌లో ఎవరెవరు ఉండబోతున్నారో చెప్పాలన్న న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తును ఇకపై తామే పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇంకా మార్చురీలో ఉన్న ఆరుగురు కూలీల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించే విషయంలో గురువారం తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. ఈలోగా ఇప్పటికే జరిగిన పోస్టుమార్టం, శవ పంచాయతీ నివేదికలను పరిశీలిస్తామని పేర్కొంది. ఆ నివేదికలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీ శశికుమార్ భార్య.. మునియమ్మాళ్ ఇచ్చిన ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు కూడా నమోదు చేశామని అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. అయితే అది ఎవరి నేతృత్వంలో ఏర్పాటు కాబోతోంది.. అందులో ఎవరెవరు ఉండబోతున్నారో తెలియజేయాలని అదనపు ఏజీకి హైకోర్టు స్పష్టం చేసింది.
రీ పోస్టుమార్టానికి ఆదేశించండి
రీ పోస్టుమార్టం కోసం మునియమ్మాళ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీంతో కోర్టు ఇంకా అంతిమ సంస్కారాలు నిర్వహించని ఆరుగురి మృతదేహాలను మార్చురీలో భద్రపరచాలని ఆదేశించిందని బాలు చెప్పారు. రీ పోస్టుమార్టంకు తిరస్కరిస్తూ.. ఇందుకోసం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాలని సూచించిందని చెప్పారు. దీనిపై తాము అక్కడి ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేశామన్నారు. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించిన ధర్మాసనం, కేసు అక్కడ పెండింగ్‌లో ఉండగా, తాము రీ పోస్టుమార్టంకు ఆదేశాలు ఇవ్వలేమంది.
దీనికి బాలు.. తాము అక్కడి కేసును ఉపసంహరించుకుంటామని, ఆ మేరకు రాతపూర్వక హామీ కూడా ఇస్తామని చెప్పారు. నిపుణుల కమిటీతో మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో ధర్మాసనం ఇంతకుముందు చేసిన పోస్టుమార్టం కాపీ గురించి ఆరా తీసింది. ఆ నివేదికలు చూడకుండా రీ పోస్టుమార్టంకు ఆదేశించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
పోస్టుమార్టం, శవ పంచనామా నివేదికలను తమ ముందుంచాలంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఎఫ్ఐఆర్ కాపీని పిటిషనర్లకు ఇవ్వాలని అదనపు ఏజీకి స్పష్టం చేసిన ధర్మాసనం.. మద్రాస్ హైకోర్టులో ఉన్న కేసును ఈ రోజే (బుధవారం) ఉపసంహరించుకోవాలని, దానిపై ఆ హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులను గురువారం తమ ముందుంచాలని బాలుకు తెలిపింది. అలా అయితేనే గురువారం కేసును విచారిస్తామని స్పష్టం చేసింది.
రంగంలోకి తమిళ న్యాయవాదులు...
మునియమ్మాళ్ తరఫున వాదనలు వినిపించేందుకు చెన్నై నుంచి కె.బాలు సహా ముగ్గురు న్యాయవాదులు బుధవారం హైకోర్టుకు వచ్చారు. ఆ రాష్ట్ర పత్రికా విలేకరులు కూడా కోర్టుకు వచ్చి వాదనలు విన్నారు.
కన్నీరుపెట్టిన మునియమ్మాళ్
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మునియమ్మాళ్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను హైకోర్టు ఈ కేసులో పిటిషనర్‌గా చేర్చింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. కేసు విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనం ఆదేశాల మేరకు ఫిర్యాదుదారు మునియమ్మాళ్ కోర్టుకు హాజరయ్యారని ఆమె తరఫు న్యాయవాది కె.బాలు తెలిపారు. దీంతో ముందుకు వచ్చిన ఆమె కన్నీరుపెట్టుకున్నారు.
ఆమెను ఊరడించాలని న్యాయవాదులకు సూచించిన ధర్మాసనం.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు గురించి ఆరా తీసింది. ఈ క్రమంలో 161 సెక్షన్ (సాక్షుల సాక్ష్యాల నమోదు) కింద స్టేట్మెంట్లు రికార్డ్ చేశారా..? అని ధర్మాసనం అదనపు ఏజీని ప్రశ్నించింది. స్టేట్మెంట్లు ఇచ్చేందుకు వెళితే పోలీసులు అడ్డుకున్నారని పిటిషనర్ చంద్రశేఖర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ తెలిపారు. దీంతో ధర్మాసనం.. ఇకపై తామే ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.