
60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయండి
‘ఎన్‌కౌంటర్’పై సిట్‌కు హైకోర్టు ఆదేశం
⇒ మేం ఏర్పాటు చేసిన బృందంగానే పనిచేయాల్సి ఉంటుంది
⇒ దర్యాప్తుపై ఏ అధికారినీ సంప్రదించనక్కర్లేదు
⇒ అవసరముంటే తమ అనుమతి తీసుకోవాలని స్పష్టీకరణ
⇒ దర్యాప్తు పురోగతి సరైన దిశలో సాగడం లేదన్న ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: తిరుపతి శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఆదేశించింది.
ఇది తాము ఏర్పాటు చేసిన బృందంగానే పనిచేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ‘సిట్’ తన దర్యాప్తును కొనసాగించి.. అవసరమైన వ్యక్తి, వ్యక్తులను చట్టప్రకారం విచారించి తగిన ఆధారాలు సేకరించవచ్చని, ఈ విషయంలో ఏ అధికారినీ సంప్రదించనక్కర్లేదంది. ఒకవేళ సంప్రదించదలచుకుంటే కోర్టు అనుమతితో చేయాలంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు డైరీని తక్షణమే సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారికి అందచేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. దర్యాప్తు పురోగతిని తెలుసుకునేందుకు వీలుగా కేసును శుక్రవారం విచారిస్తామని తెలిపింది.
ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తుకోసం పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్, తమ భర్తల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ మునియమ్మాళ్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.గతవారం ఆదేశించిన మేరకు ఈ కేసు డైరీ(సీడీ)ని అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ కోర్టు ముందుంచారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. కేసు దర్యాప్తు సరైన దిశలో సాగుతున్నట్లు అనిపించడం లేదంది.
ఈ ఎన్‌కౌంటర్‌పై ఫిర్యాదు తీసుకునేముందు, ఆ తరువాత కేసు నమోదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం కోరడంపట్ల తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. అటువంటి అభిప్రాయం తీసుకోనక్కర్లేదని తేల్చిచెప్పింది. సీఆర్‌పీసీ సెక్షన్ 154 ప్రకారం ఇటువంటి వ్యవహారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) తన అభిప్రాయాన్ని తెలియచేయకూడదని పేర్కొంటూ.. ఇలాంటి కేసుల్లో పీపీ అభిప్రాయం తీసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తుచేసింది. తన అభిప్రాయం తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఈ కేసులో నియమించుకోవడానికి వీల్లేదంటూ.. వేరే ఇతర స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించుకోవాలని, అవసరమైతే మరో ప్రాంతానికి చెందినవ్యక్తిని స్పెషల్ పీపీగా ఏర్పాటు చేసుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఐజీ నేతృత్వంలోని సిట్‌ను ఈ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తుకోసం ఏర్పాటు చేయలేదని, దీనిని సమగ్ర దర్యాప్తుకోసం ఏర్పాటు చేసినట్లు ఉందని తెలిపింది. దర్యాప్తుపై సందేహాలుంటే వాటిని నివేదిక గా తమ దృష్టికి తీసుకురావాలని సిట్‌కు స్పష్టం చేసింది. సిట్ అధికారుల్లో కొందరి నిష్పాక్షికత, ఔచిత్యంపై పిటిషనర్లు సందేహాలు వ్యక్తం చేయగా.. అందుకు ఆధారాలను కౌంటర్ అఫిడవిట్లుగా శుక్రవారానికల్లా వేయాలని వారిని ఆదేశించింది.