Regulate
-
బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బడా టెక్నాలజీ కంపెనీల ఆవిష్కరణలకు సంబంధించి సరైన నియంత్రణల రూప కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ఫలితంగా సమాజానికి నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఫిక్కీ నిర్వహించిన ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్) కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. మంచి కోసం ఆవిష్కృతమైన ఇంటర్నెట్.. ఇప్పుడు రిస్క్‌గా మారిందని, యూజర్లకు హాని కలిగించడంతోపాటు, నేరాలకు నిలయమైనట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఐజీఎఫ్, పేరొందిన వేదికలు.. ఈ పెద్ద టెక్నాలజీ సంస్థలు చేయాల్సిన, చేయకూడని వాటి విషయంలో, అవసరమైన నిబంధనలు తీసుకురావడంలో వెనుకబడినట్టు చెప్పారు. ‘‘మనం చాలా కాలంగా వీటిని ఆవిష్కర్తలుగా, ఆవిష్కరణలుగా చూశాం. అంతేకానీ, ఆ ఆవిష్కరణలు హాని కలిగించొచ్చని, సమాజంలో, ప్రజల్లో ఇతర నష్టాలకు దారితీయగలవని గుర్తించలేకపోయాం’’అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నందున భద్రత, విశ్వసనీయ అన్నవి ప్రభుత్వానికి ముఖ్యమైన పరిష్కరించాల్సిన అంశాలుగా చెప్పారు. ‘‘పెద్దలు, విద్యార్థులు, పిల్లలు, మహిళలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. కనుక ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఆన్లైన్లో భద్రత, విశ్వసనీయత, జవాబుదారీ అన్నవి ఎంతో ముఖ్యమైన విధానపరమైన అంశాలు’’అని పేర్కొన్నారు. -
క్రిప్టోపై కర్ర పెత్తనం? ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
క్రిప్టో కరెన్సీపై రాష్ట్రీయ స్వయం సేవక్ కన్నెర్ర చేసింది. దేశంలో క్రమంగా విస్తరిస్తున్న క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం నియంత్రించాలంటూ ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ డిమాండ్ చేశారు. విజయదశమిని పురస్కరించుకుని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు దసరా పండుగ రోజున ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఓటీటీ కంటెంట్, డ్రగ్స్ వినియోగం, జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రించాలి ‘బిట్ కాయిన్లను ఏ దేశం, ఏ వ్యవస్థ దాన్ని నియంత్రించగలదో నాకు తెలియడం లేదు. కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. కానీ అప్పటి వరకు ఏం జరుగుతుందనేది ఆందోళన కలిగిస్తోంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాను మించి తాజాగా వెల్లడైన గణాంకాల్లో అమెరికాను మించి ఇండియాలో క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం పెరుగుతోంది. మరో రెండు మూడేళ్లలో యూరప్‌ని సైతం వెనక్కి నెట్టేలా క్రిప్టో ఇండియాలో దూసుకుపోతుంది. యువతలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పట్ల క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. జిల్లా కేంద్రాల్లో సైతం బిట్‌కాయిన్, ఈథర్నెట్ తదితర కాయిన్లు వర్చువల్‌గా చలామనీ అవుతున్నాయి. అయితే క్రిప్టో కరెన్సీ వ్యవస్థ మన ప్రభుత్వం దగ్గర నిర్థిష్టమైన విధానమంటూ లేదు. ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భద్రతపై సందేహాలు సాధారణ మార్కెట్లో మనుషుల పెత్తనం, ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. దీంతో వీటిని శక్తివంతమైన వ్యక్తులు ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీని వల్ల మిగిలినవారు నష్టపోయే ప్రమాదం ఉంది. క్రిప్టో కరెన్సీ పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇక్కడ మనుషులు, ప్రభుత్వాల పాత్ర నామమాత్రం. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బుకి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. అందువల్ల క్రిప్టో ట్రేడ్‌పై అనేక సందేహాలు ఉన్నాయి. చదవండి :బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ ! పండగ వేళ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ పాఠాలు -
సోషల్ మీడియా నియంత్రణకు చట్టం!
కోల్‌కతా: సామాజిక మాధ్యమాలు ప్రభుత్వాలను కూలదోయగలవని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చగలవని అందుకే వాటిలోని పోస్టులపై నియంత్రణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఓ చట్టాన్ని తయారు చేస్తోందని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కోల్‌కతాలో తాను రాసిన ‘బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయేతర, విదేశీ శక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. సామాజిక మాధ్యమాల్లోని ఇలాంటి పోస్టులను ఎదుర్కునేలా ప్రస్తుత చట్టాలు రూపొందలేదని, వాటిని ఎదుర్కోవడానికి కొత్త చట్టం కావాలని, దానిపై ఇప్పటికే ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. దేశంలో ట్విట్టర్‌పై ప్రభుత్వం నుంచి ఇప్పటికే పలు సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాను రాసిన కొత్త పుస్తకం మోదీ ప్రభుత్వంలోని పలు నిర్ణయాలపై చర్చ చేస్తుందని తెలిపారు. -
ఎన్బీఎఫ్సీలు : ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు
సాక్షి, ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వ్యవస్థ మరింత పటిష్టవంతం కావడానికి తగిన చొరవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీకారం చుడుతోంది. ఈ దిశలో నాలుగు అంచెల నియంత్రణా వ్యవస్థను ప్రతిపాదించింది. ఆర్బీఐ విడుదల చేసిన చర్చా పత్రం ప్రకారం- ‘బేస్ (ఎన్బీఎఫ్సీ-బీఎల్), మిడిల్ (ఎన్బీఎఫ్సీ-ఎంఎల్), అప్పర్ (ఎన్బీఎఫ్సీ-యూఎల్), టాప్ (ఎన్బీఎఫ్సీ-టీఓపీ)’ అనే నాలుగు అంచల నియంత్రణలోకి ఎన్బీఎఫ్సీలు వెళతాయి. వారి పరిమాణం, నిధుల సమీకరణ పరిస్థితులు, అనుసంధాన విధాన ప్రక్రియలు, స్థిరత్వం, క్లిష్టత, క్రియాశీలత విషయంలో తీరు తెన్నులు వంటి అంశాల ప్రాతిపదికన ఈ వర్గీకరణ ఉంటుంది. ‘‘ఎన్‌బీఎఫ్‌సీలకు సవరించిన నియంత్రణా వ్యవస్థ– అంచలవారీ ధోరణి’’ అన్న పేరుతో వెలువడిన ఈ ఆర్బీఐ చర్చా పత్రంపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను నెలరోజుల్లో పంపాల్సి ఉంటుంది. (రూ.100 నోటు షాకింగ్ న్యూస్!) ఎన్‌బీఎఫ్‌సీల ప్రయాణం... పలు సంవత్సరాలుగా పటిష్ట నియంత్రణలు, పారదర్శకత దిశగా ఎన్బీఎఫ్సీ రంగం అడుగులు వేస్తూ వస్తోంది. 1964 నుంచీ ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ నియంత్రణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2006లో సెంట్రల్ బ్యాంక్ సమగ్ర రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌ను ప్రవేశపెట్టింది. 2014లో దీనిని మరోసారి సమీక్షించి, మార్పులూ చేర్పులూ చేయడం జరిగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్బీఐ నియంత్రణా పరమైన చర్యలను తీసుకుంటూనే ఉంది. పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలకు అదనపు నియంత్రణలూ అమలు జరుగుతున్నాయి. ‘‘సంస్థల వ్యాపార వృద్ధిపై తగిన నియంత్రణలు లేకపోతే, అనుసంధాన ఫైనాన్షియల్ వ్యవస్థలో వ్యవస్థాకతమైన ఇబ్బందులు తలెత్తుతాయి. భారీగా విస్తరించిన ఎన్బీఎఫ్సీలో ఏదైనా సమస్య తలెత్తితే, అది మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రతికూలత చూపుతుంది. ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. చిన్న, మధ్య స్థాయి ఎన్బీఎఫ్సీలపై కూడా ఈ ప్రభావం కనబడుతుంది’’ అని ఆర్బీఐ తన చర్చా పత్రంలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణా పరమైన పటిష్టతా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది. జాగ్రత్తలతో కూడిన, వర్గీకృత నియంత్రణా వ్యవస్థలు ఎన్‌బీఎఫ్‌సీల పటిష్టతకు దారితీస్తాయన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. వర్గీకరణ విధమిది... ఎన్బీఎఫ్సీ-బీఎల్: రూ.1,000 కోట్ల వరకూ అసెట్ సైజ్ పరిమాణం ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు అత్యధిక భాగం ఇదే కేటగిరీలోకి వెళతాయి. డిపాజిట్లు స్వీకరించని 9425 ఎన్బీఎఫ్సీల్లో 9209 ఇదే విభాగం కిందకు వస్తాయి. ఎన్బీఎఫ్సీ-ఎంఎల్: ‘వ్యవస్థాగతంగా ప్రాముఖ్యత కలిగిన’’ ప్రస్తుత అన్ని నాన్–డిపాజిట్ టేకింగ్ ఎన్బీఎఫ్సీలు అలాగే డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలోకి వస్తాయి. ఎన్బీఎఫ్సీ-యూఎల్: ‘‘వ్యవస్థాగతంగా కీలకంగా గుర్తించిన 25 నుంచి 30 టాప్ ఎన్బీఎఫ్సీలు ఈ పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల విషయంలో ఎలాంటి రెగ్యులేషన్లు ఉంటాయో, వీటికీ అవే వర్తిస్తాయి. టాప్ లేయర్: ఈ విభాగం ప్రస్తుతానికి ఖాళీగా ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి చోటుచేసుకునే సవాళ్లకు అనుగుణంగా ఈ విభాగాన్ని పునర్నిర్వచించడం జరుగుతుంది. -
నియంత్రిత సాగుతో దేశానికి ఆదర్శం
సాక్షి, సిరిసిల్ల: రాష్ట్రంలో రైతాంగం నియంత్రిత సాగు విధానాలను అనుసరిస్తే దేశానికి ఆదర్శంగా ఉంటామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పలు వంతెనలు, ఇతర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో అ«ధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, ఏ ఒక్క రైతుకూ ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. వ్యవసాయా«ధికారులు, రైతుబంధు సమితి సభ్యులు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి నియంత్రిత సాగు విధానాన్ని అనుసరించే విధంగా చూడాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా గతంలో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు కేటాయించామని, ప్రస్తుతం రూ.14 వేల కోట్లు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. రైతువారీ వివరాలను అధికారులు సేకరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పంట కల్లాలు, సాగునీటి కాల్వల నిర్మాణం చేపట్టాలని కేటీఆర్ సూచించారు. రంగనాయక సాగర్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలానికి సాగునీరు అందనుందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు సంక్షేమం విషయమై ఎలాంటి పరిస్థితుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. డిసెంబరు నాటికి మధ్యమానేరు నుంచి ఎగువ మానేరులోకి 9వ ప్యాకేజీ ద్వారా సాగు నీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల మధ్య ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 210 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఉండే విధంగా స్థలాన్ని సేకరించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. -
పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ ఉచితం
- 100 గజాల్లోపు ఉంటేనే అవకాశం - తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి - కుటుంబానికి ఒక ఇంటికే చాన్స్ - మేయర్ కోనేరు శ్రీధర్ విజయవాడ సెంట్రల్ : వంద గజాల లోపు ఉన్న పేదల గృహాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని మేయర్ కోనేరు శ్రీధర్ టౌన్‌ప్లానింగ్ అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ 296 ప్రకారం ప్రభుత్వ స్థలంలో పేదలు వంద గజాల లోపు ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. విధి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి.సునీత మాట్లాడుతూ 2014 జనవరి ఒకటో తేదీలోపు నిర్మించిన గృహాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. ఆగస్ట్ 15 నుంచి 120 రోజుల్లోపు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆక్రమణదారుడు తప్పనిసరిగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. కుటుంబానికి ఒక్క ఇల్లు మాత్రమే క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్, నదీ పరీవాహక ప్రాంతాలు, ప్రజల ప్రయోజనం కోసం కేటాయించిన స్థలాలు, ఫుట్‌పాత్‌ల మీద ఉన్న ఆక్రమణల్ని రెగ్యులరైజ్ చేయబోమని తెలిపారు. దరఖాస్తుతో పాటు ఆధార్ జిరాక్స్‌ను తప్పనిసరిగా జతచేయాలన్నారు. పూర్తి వివరాల కోసం టౌన్‌ప్లానింగ్‌లో సంప్రదించాలని సూచించారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు, సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.