విదేశీ గుప్పిట్లో... భారత కంపెనీలు!!
న్యూఢిల్లీ: అననుకూల పరిస్థితులతో ప్రమోటర్లు కఠిన నిర్ణయాలకు మొగ్గు చూపుతున్నారు. పరిస్థితులను అధిగమించేందుకు కంపెనీల్లో తమ వాటాలను పూర్తిగా విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. నిధుల పరంగా తీవ్ర ఒత్తిళ్లు, అదే సమయంలో బ్యాంకులు పటిష్ట ఎన్పీఏ నిబంధనల కారణంగా కఠినంగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలతో... ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించుకోవడం లేదా తమ వాటాలను పూర్తిగా అమ్మేసి బయటకు వెళ్లిపోయేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. బ్లూంబర్గ్ డేటా ప్రకారం గతేడాది (2018) విదేశీ వ్యూహాత్మక కొనుగోలుదారులు (కంపెనీలు, పీఈ ఫండ్స్) భారత్‌లో 23.45 బిలియన్ డాలర్ల(రూ.1.64 లక్షల కోట్లు)ను ఇన్వెస్ట్ చేశారు. తద్వారా ఇక్కడి కంపెనీల్లో నియంత్రిత వాటాను సొంతం చేసుకున్నారు. విలీనాలు, కొనుగోళ్ల పరంగా మన దేశానికి 2018 రికార్డు సంవత్సరంగా నిలుస్తుంది. గత మూడేళ్లలో (2016, 17, 18) విదేశీ ఇన్వెస్టర్లు 52.6 బిలియన్ డాలర్ల నిధులతో భారత కంపెనీల్లో నియంత్రిత వాటాలను దక్కించుకోవడం గమనార్హం. 2013–15 కాలంలో వచ్చిన 25.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది.
సంక్షోభంలో పడకుండా...
ప్రమోటర్లు తమ వాటాలను అమ్మేసుకోవడం వెనుక ఉన్న కారణాల్లో ప్రధానంగా తమ గ్రూపు రుణాలను తగ్గించుకోవడమే. దివాలా ప్రక్రియ కిందకు వెళితే తాము పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందన్న భయం వారిని ఈ నిర్ణయాల దిశగా నడిపిస్తోంది. ఉదాహరణకు... అనిల్ అంబానీ గ్రూపులోని రిలయన్స్ క్యాపిటల్ తన అనుబంధ రిలయన్స్ నిప్పన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఆర్‌నామ్)లో తనకున్న 42.88 శాతం వాటాను పూర్తిగా అమ్మేయాలని నిర్ణయించడమే. రిలయన్స్ క్యాపిటల్‌కు ఉన్న రూ.18,000 కోట్ల అప్పుల్లో సగం వరకు అయినా తగ్గించుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంది. తన వాటాను మరో భాగస్వామి నిప్పన్ లైఫ్‌కు విక్రయించేందుకు ఆసక్తి కూడా తెలియజేసింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్రమోటర్లు కూడా గ్రూపు రుణ భారాన్ని తగ్గించుకునేందుకు తమ వాటాల్లో సగం మేర వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు విక్రయించనున్నట్టు ప్రకటించారు. కంపెనీల్లో తమ వాటాలను తనఖా పెట్టి మరీ వీరు భారీగా రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. తీసుకున్న రుణాలన్నీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వెచ్చించి సంక్షోభంలో చిక్కుకున్నారు. దీంతో దీన్నుంచి బయటపడేందుకు వీరు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
విలువైన ఆస్తులు...
విదేశీ ఇన్వెస్టర్లు ఇంత భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత కంపెనీలను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపించడం వెనుక... ఆ వ్యాపారాలను విలువైన ఆస్తులుగా ప్రమోటర్లు తీర్చిదిద్దడమే కారణమంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ఒక నిదర్శనం ఈ కామర్స్ దేశీయ అగ్రగామి కంపెనీ ఫ్లిప్‌కార్ట్. దీన్ని 16 బిలియన్ డాలర్లు వెచ్చించి మరీ వాల్‌మార్ట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు వ్యవస్థాపకులు తమ వాటాలు వాల్‌మార్ట్‌కు విక్రయించి రూ.5,000 కోట్లకు పైగా సంపదతో బయటకు వెళ్లిపోవడం గమనార్హం. అంతకుముందు ఎన్నో విడతలుగా వీరు విదేశీ నిధుల సేకరణతో వ్యాపారాన్ని విస్తరించుకుంటూ తమ వాటాలను తగ్గించుకుంటూ వచ్చినవారే. 2016లో రష్యా ఇంధన దిగ్గజం రోజ్‌నెఫ్ట్, దాని భాగస్వాములు కలసి ఎస్సార్ ఆయిల్‌ను 13 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాయి. తద్వారా ప్రమోటర్లు రుయాలు గ్రూపు రుణ భారంలో పెద్ద మొత్తాన్ని చెల్లించేశారు. దేశంలో మరిన్ని కంపెనీల ప్రమోటర్లు తమ నియంత్రిత వాటాలను విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్న వాతావరణం నెలకొంది. ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ (పీఈ) డేటా ప్రకారం... ఐదు టాప్ పీఈ డీల్స్ విలువ 2017లో 700 మిలియన్ డాలర్లుగా ఉంది. 2018లో కేకేఆర్ ఒక్కటే 1.2 బిలియన్ డాలర్లతో భారత కంపెనీల్లో వాటాలను సొంతం చేసుకుంది. ఇందులో మ్యాక్స్ ఇండియాలో మెజారిటీ వాటా, రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో 60 శాతం వాటా కూడా ఉన్నాయి.