Reliance Industries Ltd
-
ఆర్ఐఎల్ చేతికి శుభలక్ష్మీ పాలి
న్యూఢిల్లీ: పాలియెస్టర్ చిప్స్, యార్న్ తయారీ కంపెనీ శుభలక్ష్మీ పాలియెస్టర్స్(ఎస్పీఎల్)ను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ పాలియెస్టర్ లిమిటెడ్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా శుభలక్ష్మీ పాలియెస్టర్స్, శుభలక్ష్మీ పాలిటెక్స్ లిమిటెడ్‌కు చెందిన పాలియెస్టర్ బిజినెస్‌లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి రూ. 1,522 కోట్లు, రూ. 70 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)తోపాటు రెండు సంస్థల రుణదాతల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు పేర్కొంది. తాజా కొనుగోలు ద్వారా టెక్స్టైల్ తయారీ బిజినెస్ మరింత పటిష్టంకానున్నట్లు తెలియజేసింది. ఎస్పీఎల్ పాలియెస్టర్ ఫైబర్, యార్స్, టెక్స్టైల్ గ్రేడ్ చిప్స్ తయారు చేస్తోంది. ఏడాదికి 2,52,000 టన్నుల పాలిమరైజేషన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ గుజరాత్‌లోని దహేజ్, దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి! -
అంబానీ బ్రదర్స్‌కు రూ. 25 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకు పూర్వం జరిగిన ఒక కేసులో ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీతోపాటు మరికొంతమందికి కలిపి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5 శాతానికిపైగా వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు, పీఏసీ.. వివరాలు అందించడంలో విఫలమైనట్లు సెబీ తాజాగా పేర్కొంది. దీంతో టేకోవర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అంబానీ బ్రదర్స్‌తోపాటు.. ముకేశ్ భార్య నీతా అంబానీ, అనిల్ భార్య టీనా అంబానీ, మరికొన్ని సంస్థలపై జరిమానా విధించింది. వారంట్లతో కూడిన రీడీమబుల్ డిబెంచర్ల ద్వారా ఆర్ఐఎల్ ప్రమోటర్లు, పీఏసీ.. 6.83 శాతం ఈక్విటీకి సమానమైన షేర్లను సొంతం చేసుకున్నాయి. 5 శాతం వాటాకు మించిన ఈ లావాదేవీని టేకోవర్ నిబంధనల ప్రకారం 2000 జనవరి 7న కంపెనీ పబ్లిక్‌గా ప్రకటించవలసి ఉన్నట్లు సెబీ పేర్కొంది. అయితే ప్రమోటర్లు, పీఏసీ ఎలాంటి ప్రకటననూ విడుదల చేయలేదని తెలియజేసింది. వెరసి టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించారని సెబీ ఆరోపించింది. కాగా.. పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా చెల్లించవచ్చని సెబీ తెలియజేసింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విభజించుకోవడం ద్వారా 2005లో ముకేశ్, అనిల్ విడివడిన సంగతి తెలిసిందే. -
ఏనాడూ వ్యవసాయ భూమి కొనలేదు: ఆర్ఐఎల్
ముంబై: కార్పొరేట్ అవసరాల కోసం ఏనాడూ వ్యవసాయ భూములను కొనుగోలు చేయలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదే విధంగా రైతులతో కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని తెలియజేసింది. భవిష్యత్‌లోనూ కాంట్రాక్ట్ లేదా కార్పొరేట్ వ్యవసాయం చేసే ప్రణాళికలు లేవని తేల్చిచెప్పింది. తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటనలో ఆర్ఐఎల్ ఇంకా ఏమన్నదంటే.. ఎంఎస్పీకి అనుగుణంగా అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఏనాడూ రైతుల నుంచి ఆహార ధాన్యాలను ప్రత్యక్షంగా కొనుగోలు చేయలేదు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) లేదా ఏ ఇతర మార్గదర్శకాలకు అనుగుణమైన విధానాలలోనే వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయవలసిందిగా సరఫరాదారులందరికీ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల విధానంలో మాత్రమే వ్యవసాయోత్పత్తులను సమకూర్చవలసిందిగా సరఫరాదారులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. రైతులకు నష్టం చేసే రీతిలో లేదా కంపెనీకి అనుచిత లబ్ది చేకూరే విధానంలో ఏనాడూ దీర్ఘకాలిక కాంట్రాక్టులను కుదుర్చుకోవడం వంటివి చేపట్టలేదు. కోర్టులో పిటిషన్ ఇటీవల కొద్ది రోజులుగా పంజాబ్, హర్యానాలలో రిలయన్స్ జియోకు చెందిన సుమారు 1,500 మొబైల్ టవర్లకు కొంతమంది నష్టం చేకూర్చినట్లు అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ద్వారా పంజాబ్, హర్యానా హైకోర్టులో ఆర్ఐఎల్ ఫిర్యాదు చేసింది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవల రైతులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కావాలని కొంతమంది కంపెనీ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నట్లు ఆరోపించింది. తద్వారా వేలకొద్దీ ఉద్యోగులకు రక్షణ కరవుకాగా, కీలక మౌలికసదుపాయాలకు విఘాతం కలుగుతున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఉద్యోగులు, ఆస్తులకు వెంటనే తగిన రక్షణ కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించింది. కంపెనీ ఆస్తుల విధ్వంసాన్ని కొన్ని వ్యాపార వైరివర్గాలు కావాలని చేస్తున్న దుశ్చర్యలుగా ఫిర్యాదులో ఆరోపించింది. -
రిలయన్స్‌లో పెరిగిన అంబానీ వాటా
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలో ప్రమోటర్ ముకేశ్ అంబానీ వాటా మరింతగా పెరిగింది. ప్రమోటర్ గ్రూప్ సంస్థ పెట్రోలియమ్ ట్రస్ట్ నియంత్రణలోని రిలయన్స్ సర్వీసెస్ అండ్ హోల్డింగ్స్ కంపెనీ ఈ నెల 13న 2.71 శాతం వాటాకు సమానమైన 17.18 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ముకేశ్ అంబానీ వాటా 48.87 శాతానికి పెరిగిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే రెండో అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఈ ఏడాది జూన్ 30 నాటికి ముకేశ్ అంబానీ, ఆయన సంబంధిత ప్రమోటర్ సంస్థలకు 47.29 శాతం వాటా ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)లకు 24.4 శాతం, మ్యూచువల్ ఫండ్స్‌కు 4.56 శాతం, బీమా కంపెనీలకు 7.1 శాతం చొప్పున వాటాలుండగా, మిగిలింది ప్రజల వద్ద ఉంది. కాగా ప్రమోటర్ ముకేశ్ అంబానీ వాటా పెంపు వార్తలతో బీఎస్ఈ ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 1.6 శాతం లాభంతో రూ.1,216ను తాకింది. చివరకు 0.7 శాతం లాభంతో రూ.1,206 వద్ద ముగిసింది. -
రిలయన్స్ కొత్త టీ షర్ట్ ‘ది ఎర్త్ టీ’
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు-2018’కి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ ‘ది ఎర్త్ టీ’ అనే టీ షర్ట్‌ని విడుదల చేసింది. తన ‘ఫ్యాషన్ ఫర్ ఎర్త్’ కార్యక్రమంలో భాగంగా లాక్మే ఫ్యాషన్ వీక్‌తో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ టీ షర్ట్‌ని ప్రముఖ డిజైనర్ అనిత డోంగ్రే డిజైన్ చేశారు. ఫ్యాషన్ అంటే ప్రకృతిని, పర్యావరణాన్ని పణంగా పెట్టడం కాదనీ, పర్యావరణ హితం కోరుతూ పనిచేయడం కూడా అనే నినాదంతో రిలయన్స్ ఇండస్ర్టీస్ జనవరిలో ఫ్యాషన్ ఫర్ ఎర్త్ కార్యక్రమాన్ని చేపట్టింది. ముంబైలోని జియో గార్డెన్లో జరిగిన నాటి కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మందికి అందించిన తాగు నీటి సీసాలను రీయూజ్ కోసం ఆర్ఐఎల్ స్వయంగా సేకరించడం గమనార్హం. -
రిలయన్స్ వాటాదారులకు కూడా ఓ కానుక
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా వాటాదారులకు బోనస్ ఆఫర్ ప్రకటించింది. జియో వినియోగదారులకు జియో ఫోన్ ద్వారా బంపర్ ఆఫర్లతో పాటు వాటాదారులకు కూడా తీపి కబురు అందించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. శుక్రవారం నాటి వార్షిక సాధారణ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ బోనస్ షేర్లను షేర్ల హోల్డర్స్‌కు బహుమతిగా ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటాదారులకు 1: 1 బోనస్ ప్రకటించారు. దీని ప్రకారం ప్రతి షేరుకు అదనంగా ఒక షేర్ బోనస్‌గా లభించనుంది. దీంతో రిలయన్స్ షేరు 3.19 శాతం లాభపడి 1,578 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన ప్రసంగంలో 1977 లో నుంచి రిలయన్స్ షేర్లలో రూ .1,000 పెట్టుబడికి గాను దీని విలువ రూ. 16.5 లక్షలకు చేరుకుందని ప్రకటించారు. రూ .5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కెట్ క్యాప్‌లో భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించిందని వెల్లడించారు. ముఖ్యంగా ఏజీఎం సందర్భంగా జియో 4 జీ ఫీచర్ ఫోన్ ను ఆవిష్కరించారు. ఉచిత వాయిస్ సేవలతోపాటు నెలకు రూ.153లకు డేటా సేవలను ఉచితంగా అందించనున్నామని తెలిపారు. -
ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: భవిష్యత్తులో ధర పెరుగుతుందని, అప్పుడు మరిన్ని లాభాలు దండుకోవచ్చని ఆశతో కేజీ బేసిన్లో గ్యాస్ ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపుతున్నామని వస్తున్న విమర్శలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తోసిపుచ్చింది. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ, సీపీఐ పార్లమెంటు సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల (పీఐఎల్) పిటిషన్ నిరాధారమని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్‌పై 51 పేజీల అఫిడవిట్‌ను ఆర్ఐఎల్ దాఖలు చేసింది. కేంద్రంతో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్‌కు తాను అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు అఫిడవిట్ తెలిపింది.