ప్రయాణికులకు ఎయిర్ఏసియా వెసులుబాటు
కావేరీ నదీ జల వివాద ప్రభావం అటు ఐటీ కంపెనీలపైనే కాదు ఇటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చవకైన ధరలకు ఎయిర్‌లైన్ సర్వీసులను ఆఫర్ చేసే ఎయిర్ఏసియా తమ ప్రయాణికులకు ట్రావెల్ సమయాన్ని రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి 2016 సెప్టెంబర్ 13 ప్రయాణించే వారు ట్రావెల్ సమయాన్ని ఎలాంటి చార్జీ లేకుండా రీషెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపింది. కావేరీ వివాదం హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రవాణా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఎయిర్‌పోర్టుకు రావడానికి ప్రయాణికులకు కష్టతరంగా మారుతున్నట్టు ఏయిర్ఏసియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రావెల్ సమయాన్ని రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వివరించింది.
బెంగళూరులో నెలకొన్న ఆందోళనకర పరిస్థితిని ఎయిర్ఏసియా అర్థం చేసుకుందని, 2016 సెప్టెంబర్ 13 మంగళవారం బెంగళూరు నుంచి వెళ్లడానికి విమానాలు బుక్ చేసుకున్న వారు, ప్రయాణ సమయాన్ని ఎలాంటి చార్జీ లేకుండా రీషెడ్యూల్ చేసుకోవచ్చని ఎయిర్‌క్రాప్ట్ క్యారియర్ ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా ఇబ్బందులతో కొంతమంది గెస్టులు ఎయిర్‌పోర్టుకు రాలేకపోతున్నారని గుర్తించినట్టు తెలిపింది. 72 గంటల వరకు ఏ సమయంలోనైనా తమ ప్రయాణ సమయాన్ని మార్చుకోవచ్చని, దీనికోసం ఎయిర్ఏసియా అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించింది. తమ ప్రయాణ సమయాన్ని రీషెడ్యూల్ చేసుకోవడానికి ఎయిర్‌లైన్ స్టాప్‌కు లేదా కాల్ సెంటర్లకు కాంటాక్ట్ కావాల్సిందిగా సూచించింది. ఉత్తమమైన భద్రతను, సెక్యురిటీని, కంఫర్ట్‌ను ఎల్లప్పుడూ తమ గెస్టులకు, ప్రయాణికులకు అందిస్తున్నట్టు ఎయిర్ఏసియా గ్రూప్ విశ్వసిస్తూ ఉంటుందని పేర్కొంది.