నిమిషాల్లో స్పందించిన సీఎం యోగి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్.. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పినట్టుగానే యోగి దూకుడు కనబరుస్తున్నారు. కొందరు దుండగులు తమ ఇంట్లోకి చొరబడి మహిళలను లైంగికంగా వేధించారని, తమ కుటుంబానికి రక్షణ కల్పించి, నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు యోగి వెంటనే స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
హోలీ రోజున కల్యాణ్‌పూర్ ప్రాంతంలో స్థానిక యువకులు కొందరు ఓ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి తల్లీకూతుళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన ఇంటి యజమానిపై దాడి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు విచారణలో అలసత్వం చూపుతున్నారని, తమకు సాయం చేయాల్సిందిగా బాధితుడు.. ముఖ్యమంత్రి కార్యాలయానికి, డీజీపీకి ట్వీట్ చేశాడు. దీనికి సీఎం వెంటనే స్పందించారు.
యోగి ఆదేశాల మేరకు లక్నోలోని డీజీపీ ఆఫీసు నుంచి ఎస్పీ సచీంద్ర పటేల్‌కు ఫోన్ వచ్చింది. ఈ కేసును విచారించి వెంటనే నివేదిక సమర్పించాల్సిందిగా ఆయన్ను ఆదేశించారు. తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాన్ని కలసి విచారిస్తానని, వారికి వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు పటేల్ చెప్పారు. తొలుత నమోదు చేసిన కేసులో కొన్ని మార్పులు చేశామని తెలిపారు. బాధిత కుటుంబానికి రక్షణ ఏర్పాటు చేశామని, నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.