retirement functions
-
'రిటైర్మెంట్ ఉద్యోగానికి మాత్రమే’
సాక్షి, సిటీబ్యూరో: నెలలో ఆఖరి పనిదినం కావడంతో బుధవారం మూడు కమిషనరేట్ల నుంచి పలువురు అధికారులు పదవీ విరమణ చేశారు. వీరిని కుటుంబీకులతో సహా కమిషనరేట్లకు పిలిపించిన ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. పోలీసు విభాగంలో సుదీర్ఘకాలం అంకితభావంతో పని చేసిన వారికి ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో 29 మంది, సైబరాబాద్‌లో నలుగురు, రాచకొండలో ఐదుగురు రిటైర్ అయ్యారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమానికి సినీ నటుడు అలీ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. అక్కడి సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌లో ఏసీపీగా పని చేస్తూ పదవీ విరమణ పొందిన జి.విద్యాసాగర్‌కు అలీ సన్నిహితుడు. దీంతో ఆయన ఈ రిటైర్మెంట్ ఫంక్షన్‌కు స్వయంగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులకు రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమే అని, ఎన్నేళ్ళయినా వారి గుండెల నిండా ధైర్యం, తెగువ, అంకితభావం మాత్రం అలానే ఉంటాయని అన్నారు. అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ సమాజాన్ని రక్షించడంలో నిమగ్నమై ఉండే నాలుగో సింహమే పోలీస్ అని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులు 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అయితే తాను 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని అంటూ నవ్వించారు. సినీ దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన వారు సైతం పోలీసు విభాగానికి అనుబంధంగా పని చేసే ఆస్కారం ఉందని అన్నారు. ప్రస్తుతం తాను 60వ వసంతంలోకి అడుగుపెట్టినా... జీవితంలో మంచి సినిమాలు తీయడం, గొప్ప నటులతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. వీరిద్దకీ కమిషనర్ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ (ఎగువసభ) డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీ కాలం నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశానికి రాజ్యసభలోని వివిధ పార్టీలకు చెందిన నేతలను వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం వెంకయ్య నాయుడి నివాసంలో ప్రారంభమైన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు. మరోవైపు కొత్త డిప్యూటీ చైర్మన్ ఎంపిక కోసం అధికార బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం రాజ్యసభ చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికే మొగ్గుచూపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రేసేతర పార్టీలకు ఎగువ సభ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. -
మానవతావాది జేవీ రాముడు
అనంతపురం సెంట్రల్ : మాజీ డీజీపీ జేవీ రాముడు గొప్ప మానవతావాది అని వక్తలు కొనియాడారు. ఇటీవల రాష్ట్ర డీజీపీగా పదవీ విరమణ పొందిన జేవీ రాముడుకు మంగళవారం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ కన్వెన్షన్ హాలులో ఆత్మీయ సన్మానసభ నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుంచి అత్యున్నత శిఖరాలను అధిరోహించారని కొనియాడారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జేవీ రాముడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడడంతో పాటు, సమస్యను సావధానంగా వినడం ఆయనకున్న గొప్ప వరమన్నారు. డీజీపీగా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీలు మెట్టుగోవిందరెడ్డి, శమంతకమణి తదితరులు మాట్లాడుతూ జేవీ రాముడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు జేవీ రాముడు, పద్మజ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గేయానంద్, జెడ్పీ చైర్మన్ చమన్, మేయర్ స్వరూప, డీఐజీ ప్రభాకర్‌రావు, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, వైఎస్సార్సీపీ నాయకులు మహాలక్ష్మి శ్రీనివాసులు, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, డీఎస్పీలు, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.