Reuben Paul
-
పిట్ట కొంచం.. కూత ఘనం..
న్యూఢిల్లీ: పట్టుమని పదేళ్లైనా నిండకుండానే సైబర్ ప్రపంచం మెలకువలను ఔపోశన పట్టి శభాష్ అనిపించుకుంటున్నాడు ప్రవాస భారతీయ బాలుడు రూబెన్ పాల్. సైబర్ సెక్యూరిటీపై శుక్రవారం జరిగిన గ్రౌండ్ జీరో సదస్సులో.. ఇంటర్నెట్ నేరాల గురించి విపులంగా వివరించి అందర్నీ ఆకట్టుకున్నాడీ ఎనిమిదేళ్ల బుడతడు. వెబ్సైట్లకు సంబంధించి ఫేక్ లింక్‌ల ద్వారా క్రిమినల్స్ ఏ విధం గా మోసాలకు పాల్పడతారన్నది సోదాహరణంగా తెలియజేశాడు పాల్. సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా నెటిజన్లను మభ్యపెట్టి, వారి సిస్టమ్‌ను తమ అధీనంలోకి తీసుకుంటారన్నది ఒక వెబ్‌పేజీని క్లోనింగ్ చేసి మరీ వివరించాడు. అలాగే, ఇంటర్నెట్ వాడకంవిషయంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచితులతో అప్రమత్తంగా ఉండటం మొదలైన అంశాల గురించీ వివరించాడు. అమెరి కాలో నివసించే పాల్.. తన తండ్రి మనో పాల్ ప్రోద్బలంతో ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాల గురించి నేర్చుకున్నాడు. ఇటీవలే ప్రూడెంట్ గేమ్స్ పేరిట సొంతంగా గేమింగ్ సంస్థను కూడా ప్రారంభించాడు. దానికి అతనే సీఈవో. -
వయసు 8ఏళ్లు.. సైబర్ భద్రతపై కీలక ప్రసంగం!
ఈ బుడతడి వయసు నిండా చూస్తే 8 ఏళ్లు. కానీ ఏకంగా ఓ కంపెనీకి సీఈవో, సైబర్ భద్రత మీద నిర్వహించే సదస్సులో కీలక ప్రసంగం చేయబోతున్నాడు. ఇతడితో పాటు కీలక ప్రసంగాలు చేయబోయేవాళ్లలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ కూడా ఉన్నారు!! రూబెన్ పాల్ అనే ఈ బుడతడు భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు. కొత్త తరానికి సైబర్ భద్రతా నైపుణ్యాలు ఎందుకు అవసరమో అతడు వివరించనున్నాడు. సెక్యూరిటీ సదస్సులో ఎనిమిదేళ్ల రూబెన్ పాల్ కీలక ప్రసంగం చేస్తాడని సదస్సు నిర్వాహకులు తెలిపారు. తాను ఏడాదిన్నర క్రితం నుంచే కంప్యూటర్ లాంగ్వేజిలు నేర్చుకోవడం మొదలుపెట్టానని, ఇప్పుడు తన సొంత ప్రాజెక్టులు తానే డిజైన్ చేసుకుంటున్నానని రూబెన్ తెలిపాడు. రూబెన్‌కు అతడి తండ్రి మనో పాల్ కంప్యూటర్ పాఠాలు చెప్పారు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజి గురించి మొదట్లో వివరించారు. ఇప్పుడు యాపిల్ ఐఓఎస్ ప్లాట్‌ఫాం మీద స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ నేర్పుతున్నారు. ఒడిషాలో పుట్టిన మనో పాల్.. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లిపోయారు. ఆగస్టు నెలలో రూబెన్ తన సొంత గేమింగ్ సంస్థ ప్రూడెంట్ గేమ్స్‌ను ప్రారంభించాడు. దానికి రూబెన్ సీఈవో కాగా, అతడి తండ్రి కూడా ఆ సంస్థలో భాగస్వామి. రూబెన్ సైబర్ భద్రత మీద సదస్సులలో ప్రసంగాలు చేయడం ఇది నాలుగోసారి. పిల్లల్లో సైబర్ భద్రతా నైపుణ్యాల గురించి చెప్పడంతో పాటు.. వైట్పేజి హ్యాకింగ్ మీద కూడా డెమో ఇస్తాడట.