Reuters Poll
-
ఇక ఇల్లు కొనడం కష్టమేనా? పోల్లో నిపుణుల అంచనాలు!
దేశంలో రానున్న రోజుల్లో మధ్య తరగతి వర్గాలు ఇల్లు కొనడం కష్టంగా మారొచ్చు. రాయిటర్స్ ప్రాపర్టీ అనలిస్ట్స్ పోల్ (Reuters poll of property analysts) ప్రకారం.. భారత్లో ఇల్లు కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత క్షీణిస్తుంది. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోల్లో పాల్గొన్న ప్రాపర్టీ అనలిస్టులు ఇళ్ల ధరలు ఈ ఏడాది, వచ్చే సంవత్సరంలో సగటున 7 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. గత జూన్ నెలలో నిర్వహించిన పోల్లో ఈ సంవత్సరం 6 శాతం, వచ్చే ఏడాది 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయగా ఈసారి ఆ అంచనాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఇళ్ల ధరలు తగ్గుముఖం పడతాయని లేదా స్తబ్దుగా అయినా ఉంటాయని వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అయితే భారత్లో మాత్రం గత మూడు సంవత్సరాలలో విపరీతమైన ప్రాపర్టీ కొనుగోళ్లు జరగలేదు. వార్షికంగా సగటున 2-3 శాతం మాత్రమే ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటిసారి ఇల్లు కొనేవారిపై ప్రభావం అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే భారత్ కూడా హౌసింగ్ సప్లయిలో సవాళ్లు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా తక్కువ ధర ఇళ్ల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఇళ్ల డిమాండ్ ఎప్పుడూ సమస్య కానప్పటికీ సప్లయి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పోల్లో అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు స్పందిస్తూ మెజారిటీ మంది మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత రాబోయే సంవత్సరంలో మరింత దిగజారుతుందని పేర్కొన్నారు. పెరగనున్న ఇంటి అద్దెలు ఇళ్ల ధరల పెరుగుదల కారణంగా కొనుగోలు స్థోమత తగ్గి చాలా మంది అద్దె ఇళ్లను ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో ఇళ్ల అద్దెలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక ప్రత్యేక ప్రశ్నకు స్పందిస్తూ పోల్లో పాల్గొన్నవారంతా ఇళ్ల అద్దెలు పెరుగుతాయని అంగీకరించారు. ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుదల కారణంగా ఇళ్ల అద్దెల్లో గణనీయమైన పెరుగుదలను అంచనా వేశారు. -
వృద్ధి రేటును తగ్గించిన మరో సంస్థ
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై రాయటర్స్ పోల్ అధ్యయనం చేసింది. ఆర్థిక నిపుణుల పర్యవేక్షణలో పలు కీలక అంశాలను వెల్లడించింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా వృద్ధిరేటు తగ్గుదల కనిపించబోతుందని నివేదిక స్పష్టం చేసింది. ఈ సంవత్సరంలో (2019-2020) 4.7శాతం వృద్ధి రేటు నమోదవుతుందని తెలిపింది. వినియాగదారుల డిమాండ్, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తగ్గడం, ప్రపంచ మందగమనం వల్ల వృద్ధి రేటు తగ్గిందని నివేదిక తెలిపింది. ఆర్బీఐ రెపోరేట్లను మరోసారి 25 బీపీఎస్ పాయింట్ల ద్వారా 4.90శాతం తగ్గిస్తుందని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు ఆర్బీఐ రెపోరేటును ఆరోసారి తగ్గించడం గమనార్హం. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో రేటు అన్న విషయం తెలిసిందే. వృద్ధి మందగించిన నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్బీఐ సమర్ధించుకుంటుందని, మారిన కేంద్ర బ్యాంక్ వైఖరితో తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు రేటింగ్ సంస్థలు భారత వృద్ధిరేటును తగ్గించడం వల్ల ప్రతికూల ప్రభావం పడవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
వడ్డీరేట్లు మళ్లీ యథాతథమే..!
బెంగళూరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆగస్టు 9న నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను మార్చదని రాయిటర్స్ పోల్లో తేలింది. ఎక్కడ రేట్లు అక్కడే ఉంచుతుందని రాయిటర్స్ సర్వేలో వెల్లడైంది. ఒకవేళ ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే, రుతుపవనాల కాలం అనంతరం రేట్ల కోత ఉంటుందని వెల్లడైనట్టు రాయిటర్స్ పేర్కొంది. మొత్తం 43 మంది ఆర్థికవేత్తలపై రాయిటర్స్ ఈ సర్వే నిర్వహించింది. గత పాలసీ సమీక్షలో ఉంచిన 6.50 శాతం రేటును ఈ సారి కూడా అలాగే ఉంచుతారని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. రాజన్ నిర్వహించబోయే తుది సమీక్ష ఇదేకానుండటం గమనార్హం. సెప్టెంబర్ 4న ఆయన పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందనున్నారు. అయితే 43 మంది ఆర్థిక వేత్తలో ఐదుగురు మాత్రం 25 బేసిస్ పాయింట్ల కోత ఉంటుందని వెల్లడించారు. నగదు నిల్వల నిష్పత్తిని 4.00 శాతంగానే ఉంచుతారని తెలిపారు. జూన్ నెలలో వినియోగదారుల ధరలు 5.77 శాతానికి ఎగిశాయి. ఆర్బీఐ నిర్దేశించుకున్న టార్గెట్ 5 శాతం టార్గెట్ కంటే ఈ ధరలు ఎక్కువగా ఉండటంతో రేట్లలో కోతకు విఘాతం ఏర్పడుతుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జీతాల పెంపు, రుతుపవనాలు ద్రవ్యోల్బణం ఏమేరకు ప్రభావం చూపుతాయో స్పష్టమైన అభిప్రాయం వచ్చేంతవరకు ఆర్బీఐ స్టేటస్ క్వోను ఇలాగే కొనసాగిస్తుందని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్థికవేత్త దీపాన్విత దత్తా తెలిపారు. రాజన్ తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టబోయే ఆర్బీఐ గవర్నర్ పేరును ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. భవిష్యత్ రేటు నిర్ణయాలను మానిటరీ పాలసీ కమిటీనే నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించేందుకు మానిటరీ పాలసీ కమిటీని నియమించబోతున్నట్టు తెలిసిందే.