వడ్డీరేట్లు మళ్లీ యథాతథమే..!
బెంగళూరు : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆగస్టు 9న నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను మార్చదని రాయిటర్స్ పోల్లో తేలింది. ఎక్కడ రేట్లు అక్కడే ఉంచుతుందని రాయిటర్స్ సర్వేలో వెల్లడైంది. ఒకవేళ ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే, రుతుపవనాల కాలం అనంతరం రేట్ల కోత ఉంటుందని వెల్లడైనట్టు రాయిటర్స్ పేర్కొంది. మొత్తం 43 మంది ఆర్థికవేత్తలపై రాయిటర్స్ ఈ సర్వే నిర్వహించింది. గత పాలసీ సమీక్షలో ఉంచిన 6.50 శాతం రేటును ఈ సారి కూడా అలాగే ఉంచుతారని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. రాజన్ నిర్వహించబోయే తుది సమీక్ష ఇదేకానుండటం గమనార్హం. సెప్టెంబర్ 4న ఆయన పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందనున్నారు.
అయితే 43 మంది ఆర్థిక వేత్తలో ఐదుగురు మాత్రం 25 బేసిస్ పాయింట్ల కోత ఉంటుందని వెల్లడించారు. నగదు నిల్వల నిష్పత్తిని 4.00 శాతంగానే ఉంచుతారని తెలిపారు. జూన్ నెలలో వినియోగదారుల ధరలు 5.77 శాతానికి ఎగిశాయి. ఆర్బీఐ నిర్దేశించుకున్న టార్గెట్ 5 శాతం టార్గెట్ కంటే ఈ ధరలు ఎక్కువగా ఉండటంతో రేట్లలో కోతకు విఘాతం ఏర్పడుతుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జీతాల పెంపు, రుతుపవనాలు ద్రవ్యోల్బణం ఏమేరకు ప్రభావం చూపుతాయో స్పష్టమైన అభిప్రాయం వచ్చేంతవరకు ఆర్బీఐ స్టేటస్ క్వోను ఇలాగే కొనసాగిస్తుందని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆర్థికవేత్త దీపాన్విత దత్తా తెలిపారు.
రాజన్ తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టబోయే ఆర్బీఐ గవర్నర్ పేరును ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. భవిష్యత్ రేటు నిర్ణయాలను మానిటరీ పాలసీ కమిటీనే నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించేందుకు మానిటరీ పాలసీ కమిటీని నియమించబోతున్నట్టు తెలిసిందే.