ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ఆగస్టు 13వ తేదీతో ముగిసిన పక్షం రోజులకు 6.55 శాతంగా నమోదయ్యింది. డిపాజిట్ల విషయంలో ఈ వృద్ధి 10.58 శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. వివరాలు చూస్తే...
2020 ఆగస్టు 14 నాటికి రుణ మంజూరు పరిమాణం రూ.102.19 లక్షల కోట్లు. 2021 ఆగస్టు 13 నాటికి ఈ విలువ రూ.108.89 లక్షల కోట్లకు చేరింది. అంటే రుణ వృద్ధి 6.55 శాతమన్నమాట.
చదవండి : రూపాయి.. అధరహో
►ఇక డిపాజిట్ల విలువ ఇదే కాలంలో రూ.140.80 లక్షల కోట్ల నుంచి రూ.155.70 లక్షల కోట్లకు చేరింది.
► 2021 జూలై 30వ తేదీ నాటికి అందిన షెడ్యూల్డ్ బ్యాంకుల స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ గణాంకాలు వెలువడ్డాయి.
►సమీక్షా పక్షానికి ముందు ముగిసిన పక్షం రోజుల్లో (2021 జూలై 30) రుణ వృద్ధి రేటు 6.11 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 9.8 శాతంగా ఉంది.
►2020–21 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 5.56 శాతంగా ఉంటే, డిపాజిట్ల వృద్ధి రేటు 11.4 శాతంగా నమోదయ్యింది.
ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో సమావేశమైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అనంతరం మాట్లాడుతూ, రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని పేర్కొన్నారు. రుణ వృద్ధికి బ్యాంకింగ్ అక్టోబర్ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు.
మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోందని,ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అక్టోబర్ నుంచీ రుణ వృద్ధికి బ్యాంకులు జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కూడా వెల్లడించారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో రుణ మేళాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment