రెవె‘న్యూ’ చట్టాల కోసం ఉద్యమం
వామపక్షాలకు రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపు
సాక్షి, హైదరాబాద్: పాత రెవెన్యూ చట్టాల స్థానంలో ప్రత్యామ్నాయ చట్టాలను ప్రతిపాదించి, వాటి అమలుకోసం వామపక్షాలు ఉద్యమాలు చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపిచ్చింది. శనివారం మఖ్దూంభవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ‘రాష్ట్రంలో రెవెన్యూచట్టాలు-విశ్లేషణ, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి, రైతులు, ప్రజలకు ఉపయోగపడేలా సమగ్రమైన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సమర్పించాలని ఈ భేటీలో నిర్ణయించారు.
భూసమస్య ప్రధాన ఎజెండాగా అఖిలపక్ష భేటీని ఏర్పాటుచేసి, వచ్చే సలహాలు, సూచనలకు అనుగుణంగా వివాదాలకు తావులేని పారదర్శక చట్టాలను తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి రౌండ్‌టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేసింది. చట్టాలను పరిశీలించి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించేందుకు విశ్రాంత ఐఏఎస్ టి.గోపాలరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, రవికుమార్, సునీల్‌కుమార్, పశ్యపద్మ, రాంనర్సింహారావు, బొమ్మగాని ప్రభాకర్‌తో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ సమస్యను సమస్యగా గుర్తించడం లేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.గోపాలరావు అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లేదన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ భూపోరాటాల ద్వారా పేదలు పట్టాలు పొందినా అటవీశాఖ అధికారులు అనేక సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో లిటి గెంట్ వ్యవస్థ పోవాలని, రెవెన్యూ చట్టాల్లోని లొసుగులు, తప్పులను గుర్తించి వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో రవికుమార్ (భూమికేంద్రం), కందిమళ్ల ప్రతాపరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, పశ్యపద్మ మాట్లాడారు.
వారి మిగులు భూమి స్వాధీనం చేసుకోవాలి
రాష్ట్రానికి చెందిన నలుగురు ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలకు మిగులు భూమి ఉందని, వెంటనే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పశ్య పద్మ డిమాండ్ చేశారు. ఏపీ భూసంస్కరణల(సీలింగ్, అగ్రికల్చరల్ హోల్డింగ్స్) చట్టం-1973 ప్రకారం మెట్టభూమి 54 ఎకరాలకు మించి ఉండరాదని, అయితే 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను బట్టి నలుగురు ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలకు మిగులు భూమి ఉందని పేర్కొన్నారు.