రోహిట్టయినా...
భారత టాపార్డర్ పైనే మా గురి. వారిని తక్కువ స్కోరుకే ఔట్ చేసి దెబ్బకొట్టాలని భావిస్తున్నాం...’ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా వ్యూహం ఇది. దీనిని మొదటి మ్యాచ్‌లోనే దాదాపు అమలు చేసి విజయం సాధించింది ఆతిథ్య జట్టు. ముందు బ్యాటింగ్‌లో సంయమనం చూపిన కంగారూలు... తర్వాత యువ పేసర్ జెయ్ రిచర్డ్సన్ ప్రతిభతో మ్యాచ్‌ను వశం చేసుకున్నారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వీరోచిత శతకం, ఎంఎస్ ధోని అర్ధసెంచరీతో రాణించినా ఛేదనకు అది సరిపోలేదు.
దీంతో తొలి వన్డేలో కోహ్లి సేనకు పరాజయం తప్పలేదు.నెమ్మదైన పిచ్‌పై 90ల కాలం నాటి మ్యాచ్‌ను తలపించిన సిడ్నీ వన్డేలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. అత్యంత క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి రోహిత్, ధోని ఇన్నింగ్స్‌ను నిలబెట్టినా... ముగింపు లోపంతో టీమిండియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఆసీస్ యువ పేసర్లు రిచర్డ్సన్, బెహ్రెన్‌డార్ఫ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్‌కు విజయం దూరమైంది.
సిడ్నీ: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (129 బంతుల్లో 133; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత సెంచరీ భారత్‌ను గెలిపించలేకపోయింది. 289 పరుగుల ఛేదనలో రోహిత్, వెటరన్ ధోని (96 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో టీమిండియా నిర్ణీ త ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులే చేయగలిగింది. దీంతో శనివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 34 పరుగులతో గెలుపొందింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (3) సహా కీలక వికెట్లు పడగొట్టిన కంగారూ యువ పేసర్ జెయ్ రిచర్డ్సన్ (4/26) కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. హ్యాండ్స్కోంబ్ (61 బంతుల్లో 73; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఖాజా (81 బంతుల్లో 59; 6 ఫోర్లు), షాన్ మార్‡్ష (70 బంతుల్లో 54; 4 ఫోర్లు) అర్ధ శతకాలు చేశారు. ఆఖర్లో స్టొయినిస్ (43 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. భువనేశ్వర్ (2/66), కుల్దీప్ (2/54) రెండేసి వికెట్లు పడగొట్టారు. జడేజా (1/48)కు ఒక వికెట్ దక్కింది. రెండో వన్డే మంగళవారం అడిలైడ్‌లో జరుగుతుంది.
నిలదొక్కుకుని... ఆడారు
ఆసీస్ ప్రధాన బ్యాట్స్‌మన్, కెప్టెన్ ఫించ్ (6)ను మూడో ఓవర్లోనే భువీ చక్కటి ఇన్ స్వింగర్‌తో బౌల్డ్డ్ చేసి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. కుల్దీప్ బంతిని కట్ చేయబోయిన మరో ఓపెనర్ అలెక్స్ క్యారీ (24) స్లిప్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. మూడో వికెట్‌కు 109 బంతుల్లో 92 పరుగులు జోడించిన ఖాజా, షాన్ మార్‡్ష ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. భారత స్పిన్నర్లను వీరు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఖాజా రివర్స్ స్వీప్‌లతో స్కోరు పెంచే యత్నం చేశాడు. 70 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అతడిని జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సమీక్ష కోరినా... అంపైర్ తన నిర్ణయానికి కట్టుబడటంతో పెవిలియన్ చేరాడు.
ఖలీల్ బౌలింగ్‌లో బౌండరీతో అర్ధ సెంచరీ (65 బంతుల్లో) పూర్తి చేసుకున్న షాన్ మార్‡్ష... కుల్దీప్ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో షమీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్ క్రమంగా స్కోరు వేగం పెంచారు. కుల్దీప్ బౌలింగ్‌లో చెరో సిక్స్ కొట్టారు. ఈ క్రమంలో హ్యాండ్స్కోంబ్ 50 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఈ జంట 65 బంతుల్లో 68 పరుగులు జోడించింది. భువీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన ఊపులో మరో భారీ షాట్‌కు యత్నించి హ్యాండ్స్కోంబ్ ఔటయ్యాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో స్టొయినిస్ సిక్స్, ఫోర్, మ్యాక్స్‌వెల్ (5 బంతుల్లో 11 నాటౌట్) ఫోర్ కొట్టి 18 పరుగులు రాబట్టారు. భారత బౌలర్లంతా పొదుపుగానే బౌలింగ్ చేశారు. షమీ (0/46) తక్కువ పరుగులిచ్చాడు.
వారిద్దరే నిలిచారు...
4/3... నాలుగో ఓవర్ ముగియక ముందే టీమిండియా స్కోరిది. ఛేదించదగిన లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ను బెహ్రెన్‌డార్ఫ్ దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ చివరి బంతికి ధావన్ (0)ను ఎల్బీ చేశాడు. రిచర్డ్సన్ బంతిని ఫ్లిక్ చేయబోయిన కోహ్లి... స్క్వేర్‌లెగ్‌లో ఉన్న స్టొయినిస్ చేతిలోకి బంతిని కొట్టాడు. రెండు బంతుల తేడాతో రాయుడు (0) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. రివ్యూ కోరినా ఫలితం వ్యతిరేకంగానే రావడంతో అతడు ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తన తొలి రెండు ఓవర్లలో రిచర్డ్సన్ పరుగులేమీ ఇవ్వకుండానే రెండు వికెట్లు తీయడం గమనార్హం. రోహిత్ ఆచితూచి ఆడగా, ధోని పూర్తి రక్షణాత్మకంగా కనిపించాడు. బెహ్రెన్ డార్ఫ్, సిడిల్ ఓవర్లలో రోహిత్, లయన్ ఓవర్లో ధోని సిక్స్‌లు కొట్టినా... 15 ఓవర్లకు జట్టు స్కోరు 44 మాత్రమే.
ఓ దశలో ఈ జోడీ 82 బంతుల్లో 50 పరుగులు చేయగా... అందులో 4 సిక్స్‌లతో వచ్చినవే 24 పరుగులు కావడం పరిస్థితిని చెబుతోంది. అర్ధ సెంచరీ (62 బంతుల్లో) పూర్తయ్యాక రోహిత్ జోరు పెంచే యత్నం చేశాడు. అయితే, 50 మార్క్‌ను దాటిన వెంటనే ధోని.. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. సిడిల్ ఓవర్లో మూడు బౌండరీలతో రోహిత్ 90ల్లోకి రాగా... మరో ఎండ్‌లో దినేశ్ కార్తీక్ (12), జడేజా (8) నిరాశపర్చారు. 110 బంతుల్లో రోహిత్ సెంచరీ పూర్తయింది. లక్ష్యం 30 బంతుల్లో 75గా మారిన ఈ పరిస్థితుల్లో స్టొయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్ ఔటయ్యాడు. భువీ (23 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించగలిగింది.
అహో... రోహిత్
మ్యాచ్‌లో టీమిండియా ఈ మాత్రం పోటీ అయినా ఇవ్వగలిగిందంటే అది రోహిత్ చలవే. అవతలి ఎండ్‌లో ధోని పరుగులకు ప్రయాస పడుతుండగా ‘హిట్‌మ్యాన్’ బాధ్యతగా ఆడాడు. ఒత్తిడినంతా మోస్తూనే అడపాదడపా సిక్స్‌లు కొడుతూ రన్‌రేట్ మరీ పడిపోకుండా చూశాడు. ఫ్రీ హిట్ రూపంలో ఎదుర్కొన్న 18వ బంతిని సిక్స్ కొట్టి ఖాతా తెరిచాడు. తొలి 50ని 62 బంతుల్లో చేరుకున్న అతడు రెండో 50ని 48 బంతుల్లోనే అందుకున్నాడు. చివరి 33 పరుగులను 19 బంతుల్లోనే చేశాడు. లయన్ బౌలింగ్‌లో లాంగాన్‌లో, మిడ్ వికెట్ దిశగా రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. సిడిల్ ఓవర్లో డీప్ బ్యాక్వర్డ్ స్వే్కర్లో కొట్టిన సిక్స్ ప్రేక్షకులను అలరించింది.
ధోని... దేశం తరఫున
సిడ్నీ వన్డేలో తొలి పరుగు ద్వారా... ధోని వన్డేల్లో దేశం తరఫున 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. 330వ మ్యాచ్‌లో అతడీ మార్కును చేరాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్, కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా, మొత్తమ్మీద 13వ ఆటగాడిగా నిలిచా డు. ధోని 2017లో ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనే వన్డేల్లో 10 వేల పరుగుల రికార్డును అందుకున్నా... ఇందులో ఆసియా జట్టు తరపున మూడు మ్యాచ్ ల్లో చేసిన 174 పరుగులు కూడా ఉన్నాయి.
అదే మలుపు
32వ ఓవర్ తర్వాత భారత్ విజయ సమీకరణం 108 బంతుల్లో 149. ధోని అర్ధ సెంచరీ (93 బంతుల్లో) అందుకున్నాడు. ఈ దశలో ధోనిని బెహ్రెన్‌డార్ఫ్ ఎల్బీ చేశాడు. రీప్లేలో బంతి లెగ్‌సైడ్ పిచ్ అయినట్లు కనిపించింది. రివ్యూలు లేకపోవడంతో ధోని క్రీజును వీడాడు. బంతులు మింగిన కార్తీక్, జడేజా పరుగులు చేయకపోవడంతో రన్‌రేట్ పెరిగిపోయి రోహిత్‌పైన ఒత్తిడి పెరిగింది. మ్యాచ్ భారత్ చేజారింది.
►19 వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న 19వ భారతీయ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.
►4ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మ చేసిన సెంచరీలు. ఈ నాలుగు సెంచరీలు నాలుగు వేర్వేరు వేదికలపై (138: మెల్బోర్న్లో 2015లో; 171 నాటౌట్: పెర్త్‌లో 2016లో; 124: బ్రిస్బేన్‌లో 2016లో; 133: సిడ్నీలో 2019) రావడం విశేషం. ఇలా చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. అయితే రోహిత్ సెంచరీలు చేసిన ఈ నాలుగుసార్లూ భారత్ ఓడిపోయింది.
►1000ఈ గెలుపుతో ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్లో 1000వ విజయాన్ని పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మూడు ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియా ఇప్పటివరకు 1852 మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 384... వన్డేల్లో 558... టి20ల్లో 58 విజయాలు సాధించింది.
►10తాను ఆడిన గత 10 సిరీస్‌లలో రోహిత్ కనీసం ఒక సెంచరీ అయినా చేశాడు.
►9తొమ్మిదేళ్ల తర్వాత సిడిల్ ఆసీస్ తరఫున మళ్లీ వన్డే ఆడాడు. ఈ తొమ్మిదేళ్లలో ఆ జట్టు 169 వన్డేలు ఆడింది.
►3భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గంగూలీతో కలిసి రోహిత్ (22 సెంచరీలు) సంయుక్తంగా మూడో స్థానానికి చేరాడు. సచిన్ (49), కోహ్లి (38) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.