అత్యుత్తమ వన్డే క్రికెటర్‌గా రిచర్డ్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ నిలిచారు. ‘క్రిక్‌ఇన్ఫో క్రికెట్ మంత్లీ’ నిర్వహించిన ఈ ఆన్‌లైన్ పోల్‌లో ఈ మాజీ ఆటగాడికి ఎదురులేకుండా పోయింది. సుప్రసిద్ధ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు, రచయితలతో కూడిన 50 మంది జ్యూరీ ఈ ఎంపిక చేసింది.
సచిన్, వసీం అక్రమ్, గిల్‌క్రిస్ట్, ధోని కూడా పోటీలో నిలిచారు. అయితే జ్యూరీలో 29 మంది రిచర్డ్స్‌కు అనుకూలంగా నిలవడంతో 179 పాయింట్లతో తను టాప్‌గా నిలిచాడు. 70, 80వ దశకంలో రిచర్డ్స్ వన్డే క్రికెట్‌ను శాసించారు. అలాగే తమ జట్టుకు 1975, 79 ప్రపంచకప్‌లను అందించడంలో కీలక పాత్ర పోషించారు.
ఇక వన్డేల్లో 49 సెంచరీలు, 18,426 పరుగులు చేసినప్పటికీ టాప్‌గా నిలువడంలో సచిన్ విఫలమయ్యాడు. రెండో స్థానం కోసం సచిన్, అక్రమ్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా 68 పాయింట్లతో సచిన్, 66 పాయింట్లతో అక్రమ్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. గిల్‌క్రిస్ట్ (29), ధోని (25) ఆ తర్వాత ఉన్నారు. జ్యూరీలో రాహుల్ ద్రవిడ్, పాంటింగ్, స్మిత్, ఇయాన్ చాపెల్, లాయిడ్ తదితరులు ఉన్నారు. వీరు ఎంపిక చేసిన వన్డే డ్రీమ్ టీమ్‌లో... గిల్‌క్రిస్ట్, సచిన్, పాంటింగ్, రిచర్డ్స్, కలిస్, ధోని, జయసూర్య, కపిల్, అక్రమ్, వార్న్, గార్నర్ చోటు దక్కించుకున్నారు.