ఆయుధాల తయారీలో స్వావలంబన దిశగా భారత్
ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుల్లో భారత్ ఒకటి. అదే సమయంలో అసాల్ట్ రైఫిల్ నుంచి బాలిస్టిక్ మిసైల్స్ వరకు ప్రపంచంలోని అత్యుత్తమ ఆయుధ వ్యవస్థలకు భారతీయ పరిశ్రమలు విడి భాగాలను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుధరంగంలో స్వావలంభన సాధించడం కోసం మేకిన్ ఇండియా పథకం ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఆయుధ దిగుమతుల నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో గడచిన ఐదేశ్లలో భారత్ ఆయుధ దిగుమతులు 33 శాతం తగ్గాయి.
సాయుధ దళాల ఆధునీకరణకు గడచిన ఐదేళ్లలో 304 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇందులో 190 ఒప్పందాలు దేశీయ సంస్థలతోనే జరిగినట్లు ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో తెలిపింది. గతేడాది ఆగస్టులో 101 రకాల ఆయుధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న ఏడేళ్లలో దేశీయ ఆయుధ పరిశ్రమలతో కేంద్రం రూ.4 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చు కుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆయుధాల విలువ రూ.1.3 లక్షల కోట్లు చొప్పున ఉండగా, నౌకాదళానికి చెందిన ఆయుధాల విలువ రూ. 1.4 లక్షల కోట్లు ఉండనుంది.
దెబ్బతిన్న రష్యా మార్కెట్
భారత్ ఆయుధ దిగుమతులను తగ్గించుకోవడంతో ఆ ప్రభావం రష్యా మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోందని స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) తన నివేదికలో పేర్కొంది. రష్యా ఆయుధాలపై ఆధార పడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి సంక్లిష్ట నిబంధనల కారణంగానే రష్యా నుంచి భారత్ ఆయుధ దిగుమతులు 54 శాతం వరకు తగ్గిపోయాయని వివరించింది. అదే సమయంలో ప్యారిస్ నుంచి న్యూఢిల్లీకి ఆయుధ ఎగుమతులు పెరిగాయని పేర్కొంది. భారత్ 2019లో రక్షణ రంగానికి 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు ఎస్ఐపీఆర్ఐ 2020 ఏప్రిల్‌లో వెల్లడించింది. దీంతో రక్షణరంగ వ్యయంలో అమెరికా, చైనా తరువాత భారత్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది.
అమెరికా వాటా 37 శాతం
ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ఎస్ఐపీఆర్ఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా తన వాటాను 32 నుంచి 37 శాతానికి పెంచుకున్నట్లు తెలిపింది. 2016-20 మధ్య అమెరికా 96 దేశాలకు కీలక ఆయుధాలను ఎగుమతిచేసింది. మొత్తం ఎగుమతుల్లో 47శాతం మధ్య ఆసియా దేశాలకే జరిగాయి. అమెరికా ఆయుధ ఎగుమతుల్లో ఒక్క సౌదీ అరేబియా వాటానే 24 శాతం ఉన్నట్లు ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. అమెరికా ఆయుధ ఎగుమతులు భారీగా వృద్ధి చెందడంతో ప్రధాన పోటీదారు అయిన రష్యాకు అందనంత ఎత్తుకు చేరుకుంది. అదే సమయంలో రష్యా, చైనా ఆయుధ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు ఈ నివేదిక వివరించింది.
2016-20 మధ్య కాలంలో రష్యా ఆయుధ ఎగుమతులు 20 శాతం వరకు తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం రష్యా నుంచి భారత్ ఆయుధ దిగుమతులు 54 శాతం వరకు తగ్గిపోవడమేనని నివేదిక తెలిపింది. చైనా, అల్జీరియా, ఈజిప్ట్ దేశాలకు రష్యా ఆయుధ ఎగుమతులు పెరిగినప్పటికీ భారత్‌లో తగ్గిపోయిన మార్కెట్‌ను అవి పూరించలేకపోయాయని ఎస్ఐపీఆర్ఐకు చెందిన ఆయుధ, సైనిక వ్యయ పరిశీలకుడు అలెగ్జాండర్ క్విమోవ్ పేర్కొన్నారు. మరో కీలక ఆయుధ ఎగుమతిదారు అయిన ఫ్రాన్స్ 2016-20 మధ్య ఎగుమతుల్లో 44% వృద్ధి సాధించిందని నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో ఫ్రాన్స్ వాటా 8.2 శాతానికి చేరుకుందని తెలిపింది. ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతుల్లో 59శాతం భారత్, ఈజిప్ట్, ఖతార్ దేశాలకే జరిగాయి.
రక్షణ విభాగంలో దేశీయ పబ్లిక్, ప్రైవేట్ రంగ సంస్థలు
1. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్): యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వాటి ఇంజన్ల డిజైన్, డెవలప్మెంట్, ఉత్పత్తి, మరమ్మతుల పనులు చూస్తుంది.
2. భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్): రక్షణ రంగం, పారామిలిటరీ విభాగాలు వినయోగించే సున్నితమైన ఎల్రక్టానిక్ విభాగాల ఉత్పత్తి, డిజైన్, అభివృద్ధి పనులను చేపడుతుంది.
3. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్): రక్షణ శాఖ కోసం వివిధ రకాల ప్రత్యేకతలతో కూడిన భారీ వాహనాలను తయారు చేస్తుంది.
4. మజగావ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్): భారత నౌకా దళం కోసం జలాంతర్గాములు, మిసైల్ బోట్స్, నౌకలను ధ్వంసం చేసే ఆయుధాలు, ఫ్రిగేట్స్లు తయారు చేస్తుంది.
5. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ): భారత నౌకాదళం కోసం యుద్ధ నౌకలు, వాటిని అనుబంధంగా ఉండే సహాయక ఓడలు తయారీ, మరమ్మతుల పనులు చేపడుతుంది.
6. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్): మిసైల్స్, టార్పెడోల దాడిని అంచనా వేసే సిస్టంలను తయారు చేస్తుంది.
7. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని): ఏరోనాటిక్స్, అంతరిక్ష వాహకనౌకలు, మిలటరీ, నేవీ వాహనాలకు కావాల్సిన విడిభాగాలను రూపొందిస్తుంది.
8. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్): వాయుసేనకు సంబంధించిన విమానాల విడిభాగాల ఉత్పత్తి, మిలిటరీ ఆయుధాలు, మిలిటరీ వాహనాల్లోని ఆయుధాలకు కావాల్సిన అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేస్తుంది.
9. లార్సన్ అండ్ టూబ్రో: భూతలం, యుద్ధనౌకలపై నుంచి వాడే మిసైల్స్ డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి చేస్తుంది.
10. మహీంద్ర డిఫెన్స్ సిస్టమ్స్: తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆయుధాలు, చిన్నసైజు ఆయుధాల ఉత్పత్తితో పాటు మందుగుండు సామగ్రిని తయారు చేస్తుంది.
2015-19 మధ్య వివిధ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధ వివరాలు
స్కాంటర్ 6000 రాడార్లు - డెన్మార్క్
ఎంబ్రేర్ ఈఆర్జే - 145 జెట్లు - బ్రెజిల్
ఏసీటీఏఎస్ సోనార్ సిస్టమ్స్ - జర్మనీ
సూపర్ ర్యాపిడ్ 76 ఎంఎం నావెల్ గన్స్ - ఇటలీ
కే9 థండర్ 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్ - దక్షిణ కొరియా
2014-18 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో తొలి పది దేశాల వాటా..
సౌదీ అరేబియా 12%
ఇండియా 9.5%
ఈజిప్ట్ 5.1%
ఆస్ట్రేలియా 4.6%
అల్జీరియా 4.4%
చైనా 4.2%
యూఏఈ 3.7%
ఇరాక్ 3.7%
ద. కొరియా 3.1%
వియత్నాం 2.9%