right to infermation act
-
బోధన్ బల్దియాలో ఇష్టారాజ్యం
బోధన్ పట్టణానికి చెందిన యువకుడు కడిగె శివకుమార్ పట్టణంలోని 23 వార్డులో ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయో వివరాలు ఇవ్వాలని 2017 నవంబర్ 20న బల్దియా అధికారులకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. బల్దియాకు చెందిన అప్పిలేట్ అధికారులు కోరిన సమాచారం అందించకుండా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. ఆ యువకుడు రాష్ట్ర కమిషన్ను అశ్రయించగా, పూర్తి వివరాలతో హాజరు కావాలని నోటీసులు జారి చేసింది. సాక్షి, బోధన్(నిజామాబాద్) : సమాచార హక్కు చట్టం అంటే.. బోధన్ బల్దియా అధికారులకు బేఖాతరైంది. ఇక్కడ ఈ చట్టం అభాసు పాలవుతోంది. స్థానికులు పట్టణ అభివృద్ధి వివరాలు కోరితే స్పందించక పోవడంతో పాటు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. దీంతో సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషన్ ఎదుట బల్దియా అధికారులు హాజరు కావాల్సివస్తోంది. బోధన్ పురపాలక సంఘానికి 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు సమాచార హక్కుచట్టం కింద 111 దరఖాస్తులు అందాయి. వీటిలో అధికారులు 82 దరఖాస్తులకు సమాచారాన్ని అందించారు. ఇంకా 29 దరఖాస్తులకు సమాచారం అందించాల్సి ఉంది. అయితే అధికారుల తీరులో మార్పు రావడం లేదు. మచ్చుకు కొన్ని దరఖాస్తులను పరిశీలిస్తే.. బోధన్ పట్టణానికి చెందిన కిరణ్ అనే యువకుడు బోధన్ బల్దియా పరిధిలోని వార్డుల్లో ఉన్న ఇండ్లకు సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లు, కుళాయి పన్ను వసూళ్ల వివరాలు అందించాలని 2018 డిసెంబర్ 14న న దరఖాస్తు చేశాడు. అయితే అధికారులు తప్పుడు సమాచారాన్ని అందించారు. బోధన్ బల్దియాకు కేంద్రం నిధులు ఎన్ని మంజూరు అయ్యాయి, ఎన్ని నిధులు వెచ్చించారు. ఈ నిధులతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగి ఏడాది అవుతున్నా సంబందిత దరఖాస్తు దారుకు ఇంకా బల్దియా అధికారులు సమాచారం అందించలేక పోయారు. బోధన్ బల్దియాలో 2017 సంవత్సరంలో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు వార్డుకు రూ.లక్ష చొప్పున వెచ్చించి తాగునీటి అవసరాలు తీర్చారు. వాటి వివరాలు ఇవ్వాలని కోరిన వ్యక్తికి ఇప్పటి వరకు సమాచార హక్కు చట్టం అప్పిలేట్ అధికారి సమాచారం అందివ్వలేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వివరాలకు సమాచారం అందించాలని చట్టం చెబుతున్నా బల్దియా అధికారులు మాత్రం స్పందించకుండా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బల్దియాకు మూడు నోటీసులు సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వారికి తప్పుడు సమాచారం అందించినందుకు, సమాచారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్న కారణంగా ఇప్పటి వరకు బల్దియా కమిషనర్కు 3 నోటీసులు అందాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలతో కమిషనర్ ఎదుట హాజరు కావాలని అందిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా బల్దియా అధికారులు మాత్రం అవేవి తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బల్దియా కౌన్సెల్ ఉన్నప్పుడు ప్రతి పక్ష కౌన్సిలర్లతో పాటు అధికార పార్టీ కౌన్సిలర్లు అభివృద్ధి పనులకు సంబంధించి, బల్దియాకు మంజూరు అయిన నిధుల వివరాలు ఇవ్వాలని సహ చట్టం కింద దరఖాస్తు చేస్తే అధికారులు నెలల తరబడి సమాచారం అందించని ఘటనలు ఉన్నాయి. దీంతో కౌన్సిలర్లు కౌన్సెల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. మా పరిధిలో ఉన్న సమాచారం ఇస్తున్నాం.. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దారులు అడిగిన సమాచారాన్ని మా పరిధిలో ఉన్నంత వరకు అందిస్తున్నాము. పరిధిలో లేని అంశాల రికార్డులు లేక పోవడంతో సమాచారం అందించడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు మాకు వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం వరకు సమాచారాన్ని అందించాము. – స్వామినాయక్, మున్సిపల్ కమిషనర్ -
సమాచార హక్కు చట్టంపై అవగాహన
బాలాజీచెరువు (కాకినాడ) : సమాచార హక్కు చట్టంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార కమిషనర్ ఎల్.తాంతియాకుమారి పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో సోమవారం సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక వారోత్సవాల్లో భాగంగా ఆర్టీఐ చట్టం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం సాధించే విధానం అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తాంతియాకుమారి మాట్లాడుతూ సమాచారహక్కు చట్టం వల్ల వ్యవస్థ మెరుగుపడుతుందని, ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు ఉపయోగపడుతుందని, 2008 నుంచి 2016 వరకూ సుమారు 12వేల కేసులను పరిష్కరించామని చెప్పారు. దేశంలోనే ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం ఇవ్వడంలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ప్రతి విశ్వవిద్యాలయం, కళాశాలలో ఈ చట్టం సక్రమంగా అమలయ్యేలా కృషిచేస్తున్నామని, విద్యార్థులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుని పరీక్ష ఫీజు చెల్లింపు, కోర్సుల వివరాలు వంటివి లె లుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూకే రిజిస్ట్రార్ సీహెచ్ సాయిబాబు, రెక్టార్ ప్రభాకరరావు, ప్రిన్సిపాల్ ప్రసాద్రాజు, నాళం ఆండాళ్, చేతన పాల్గొన్నారు.