యాక్సిస్ లాభాలకు బకాయిల సెగ
హెచ్డీఎఫ్సీ, కొటక్ మహింద్రా బ్యాంకుల వల్లే దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకుకి మొండిబకాయిల బెడద తప్పలేదు. శుక్రవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 21 శాతం పడిపోయాయి. జూన్ క్వార్టర్లో నికరలాభాలు రూ.1555.53 కోట్లగా ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.1978.44 కోట్లగా ఉన్నాయి. మరోవైపు బ్యాడ్ లోన్స్ లేదా స్థూల నిరర్థక ఆస్తులు 59 శాతం పెరిగి, రూ.4010.23 కోట్లగా నమోదైనట్టు బ్యాంకు పేర్కొంది. 2016 మార్చి త్రైమాసికంలో ఇవి రూ.2522.14 కోట్లగా ఉన్నాయి.
అయితే నికర వడ్డీ ఆదాయాలు 11.35 శాతం ఎగిసి, రూ.4,516.92 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.4,056.23 కోట్లగా ఉన్నాయి. నిర్వహణ లాభాలు కూడా 9.22 శాతం జంప్ అయి, ఏడాదికి ఏడాది రూ.4,469.37 కోట్లగా రికార్డు చేసింది.
ఏప్రిల్-జూన్ కాలంలో తన నెట్ వర్క్ లను విస్తరించుకున్నట్టు యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. దేశమంతటా తను కలిగి ఉన్న నెట్ వర్క్ లకు 102 బ్రాంచ్ లను కలుపుకున్నట్టు వెల్లడించింది. దీంతో జూన్ 30కి 1,882 సెంటర్లలలో బ్యాంకుకు మొత్తం 3,006 దేశీయ బ్రాంచ్లు, ఎక్స్టెన్షన్ కేంద్రాలు ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంకు షేర్లు 0.13 శాతం పడిపోయి, రూ.537.55గా నమోదైంది.